భారతదేశం అంటే ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలకు నిలయం. ప్రకృతిని ఆరాధించే భారతీయులకు నదులు ఎంతో ముఖ్యమైనవి. అసలు ప్రపంచవ్యాప్తంగా నాగరికతలు విలసిల్లింది నదీ తీరప్రాంతాల్లోనే. అలాగే మనదేశంలో నదులను ప్రత్యేకమైన వ్యక్తులుగా భావించి పూజలు చేయడం పరిపాటి. ప్రకృతిని ఆరాధించే సమున్నతమైన సంస్కృతిలో భాగంగానే మనం నదులను కూడా దేవతలుగా పూజించే సాంప్రదాయాల్ని అలవాటు చేసుకున్నాం.
అయితే మనదేశంలో చిన్నా చితకా నదులు అనేకం ఉన్నా… పంచగంగలు అని అయిదు నదులనే పేర్కొంటుంటారు. అవి గంగ, కృష్ణ, గోదావరి, తుంగభద్ర, కావేరీ. వీటిలో ఒకటి మాత్రమే ఉత్తర భారతదేశంలో ఉండగా మిగిలిన నాలుగూ దక్షిణ భారతదేశంలో ఉండడం విశేషం. వీటిలో ఒకటైన తుంగభద్ర నదికి నవంబరు 20వ తేదీ (శుక్రవారం) నుండి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో పుష్కరస్నానాలు చేయడానికి ఒకవైపు ప్రభుత్వాలు ఏర్పాట్లు కూడా చేస్తున్నాయి. అసలు ఈ తుంగభద్ర నది విశేషాల గురించి ఆదర్శిని డాట్ కామ్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది..
పురాణాల్లోకి వెళితే తుంగభద్ర అనేది ఒక్క నది కాదని, ఇది తుంగ, భద్ర అని రెండు నదుల కలయిక అని చెబుతారు. పూర్వం హిరణ్యాక్షుని సంహరించిన వరాహస్వామి అలసిపోయాడు. అప్పుడు ఆయన ముఖం నుండి జారిన చెమట బిందువులు ఒకటి కుడివైపు నుండి, మరొకటి ఎడమవైపు నుంచి భూమిపై పడ్డాయట. అవే తుంగ, భద్ర నదులుగా వెలిశాయని పురాణాలు చెబుతాయి. ఈ రెండు నదులు కలిసి తుంగభద్ర గా ఏర్పడింది.
ఈ నదికి మరో ప్రత్యేకత కూడా ఉంది. నదులుచాలావరకు సముద్రంలో సంగమిస్తాయి. కానీ ఈ నది మాత్రం సముద్రంలో కలవదు. ఇది సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో సంగమిస్తుంది. ఇది ఈ నదికి గల ప్రత్యేకత. శుక్రవారం నుండి ప్రారంభం కానున్న తుంగభద్ర నది పుష్కరాల్లో మునిగితే పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
భాగీరధ్యాం వర్షమేకం ప్రాతఃస్నానేన యత్ ఫలం
తుంగభద్ర జలం స్పృశ్యా లభేత్ మకర గతే గురౌ
భాగీరధి అంటే గంగానది. గంగలో ఒక ఏడాదిపాటు ప్రాతఃకాల వేళలో స్నానం చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుందో.. అలాంటి పుణ్యఫలం.. మకరంలోకి గురుడు ప్రవేశించే వేళలో తుంగభద్ర నదీ జలాన్ని తాకితేనే మనకు లభిస్తుంది.. అనేది ఈ శ్లోకంలోని తాత్పర్యం
తుంగభద్ర పుష్కరాల సందర్భంగా ప్రత్యేక కథనాలు.. ఇవీ చదవండి : పుష్కరం అంటే పన్నెండేళ్లకు ఓసారి వచ్చే పండుగ పుష్కరాల్లో ఎలాంటి పనులు చేయాలో తెలుసా? ఏయే నదులకు ఎప్పుడెప్పుడు పుష్కరాలు వస్తాయో తెలుసా?
నదులలో గంగానది చాలా ప్రశస్తి చెందిన నది. అందులో మునిగితే మన పాపాలు హరించి పోతాయని అంటారు. అలా ఏడాది పాటు గంగానదిలో స్నానం చేయడం వలన లభించే పుణ్యం పుష్కర సమయంలో తుంగభద్రానదిలో మునిగితే మనకు లభిస్తుందని పెద్దలు చెబుతారు. కాబట్టి తుంగభద్రానది పుష్కరాల్లో స్నానం చేయడానికి భక్తులు ప్రయత్నిస్తారు.
అయితే ఇప్పడు కొవిడ్ మహమ్మారి అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. అయినా కూడా జాగ్రత్తలను పాటించి పుష్కరస్నానం చేయడానికి భక్తులు ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం వారు కూడా పుష్కర ఘాట్లను శుభ్రం చేయడం వంటి పనులు చేస్తూ, భక్తులకు తగు సౌకర్యాలను అందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. గురుడు మకర రాశిలో ప్రవేశించే ఈ శుభతరుణంలో తుంగభద్రానది పుష్కర స్నానాలు చేయడానికి ప్రయత్నించండి. అయితే తగు జాగ్రత్తలను పాటించండి. కొవిడ్ బారిన పడకుండా పుష్కర స్నానాలు చేయండి.