పుష్కరాలు పన్నెండురోజుల పాటు జరుగుతాయి. ఈ పన్నెండు రోజులలో నదీ పరీవాహక ప్రాంతాల్లోని పలు పుణ్యక్షేత్రాల్లో భక్తులు నదీ స్నానం చేసి, ఒడ్డున గల దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. అంతేకాదు పుష్కరాల సమయంలో నదీ తీరంలో పెద్దలకు పిండ ప్రదానాలు చేస్తే మంచిదని భారతీయుల విశ్వాసం. అలాగే పుష్కరాల సమయంలో పలు దానాలు చేస్తే కూడా మంచిదని పెద్దలు చెబుతారు. అయితే పన్నెండు రోజుల పాటు జరిగే పుష్కరాల సమయంలో ఒక్కోరోజు ఒక్కో విధమైన దానాలు చేయడం వల్ల ఒక్కో రకమైన ఫలితం ఉంటుందని చెబుతారు.
పుష్కరాలు ప్రారంభమైన తొలిరోజు బంగారం, వెండి, ధాన్యం దానం చేస్తే మంచిదంటారు. అలాగే భూదానం కూడా మంచిదని చెబుతారు. రెండవరోజు వస్త్రాలు, లవణం, రత్నాలు, మూడవ రోజు బెల్లం, పండ్లు, నాల్గవరోజు నెయ్యి, నూనె, పాలు తేనె, ఐదవ రోజు ధాన్యం, బండి, ఎద్దులు, నాగలి దానం ఇవ్వాలి. ఆరవరోజు ఔషధాలు, చందనం, కస్తూరి, కర్పూరం, ఏడవరోజు ఇల్లు, పీట, శయ్య దానం ఇవ్వాలి. ఎనిమిదవ నాడు చందనం, కందమూలాలు, పూలమాలలు, తొమ్మిదవనాడు పిండదానం, దాసీదానం, కన్యాదానం, కంబళి దానం చేయాలి. పదవనాడు కూరగాయలు, సాలగ్రామం, పుస్తకాలు, పదకొండవనాడు ఏనుగును దానం ఇవ్వాలి. చివరి రోజైన పన్నెండవనాడు నువ్వులు దానం ఇవ్వాలి.
పన్నెండు రోజులు ఇవన్నీ దానం ఇవ్వాలని లేదు… మనకు తాహతుకు తగినట్టు ఏదో ఒకటి దానం ఇస్తే మంచిది. అలాగే అటువేపు నుండి దానం స్వీకరించే వారుకూడా సంతృప్తిగా స్వీకరిస్తే ఇటు దానం ఇచ్చేవారికి కూడా శుభకరంగా ఉంటుంది. అలాకాకుండా తృప్తిలేని, చెందలేని వారికి దానం ఇవ్వడం వల్ల ఫలితం ఉండదని చెప్పవచ్చు. ఈ దానాలతోబాటు పితృదేవతలకు పిండ ప్రదానాలు చేస్తే వారు తృప్తి చెంది మనలను ఆశీర్వదిస్తారని నమ్మకం. అందుకే పుష్కరాల మొదటిరోజున హిరణ్యశ్రాద్ధం, అలాగే తొమ్మిదవ రోజున అన్నశ్రాద్ధం, పన్నెండవ రోజున ఆమ శ్రాద్ధం చేయడం మంచిదని పెద్దలు చెబుతారు.
.

Discussion about this post