శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 10వ రోజైన శనివారం శివ పార్వతుల గిరిప్రదక్షిణ వేడుకగా జరిగింది.
తమ కల్యాణానికి విచ్చేసిన సకల దేవతా గణాలకు ఆది దంపతులు ఘనంగా వీడ్కోలు పలికి కృజ్ఞతలు తెలియచేశారు.అంతకుమునుపు గంగాభవానీ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి, జ్ఞానప్రసూనాంబ ఉత్సవమూర్తులను అలంకార మండపంలో విశేషంగా అలంకరింప చేశారు.
ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను గిరిప్రదక్షిణకు తీసుకెళ్లారు.
రాజగోపురం గుండా చతుర్మాడవీధుల్లోకి శివ పార్వతులు ప్రవేశించారు. భేరివారి మండపం వద్ద భేరి కులస్థులు ఇచ్చిన నాగవల్లిని అమ్మవారికి ధరింపచేశారు.
అనంతరం జయరామరావువీధి, ఎన్టీ ఆర్ నగర్. తెలుగుగంగ కాలనీ. కైలాసగిరికాలనీ, రాజీవ్ నగర్ మీదుగా గిరి ప్రదక్షిణ జరిగింది. రామాపురం రిజర్వాయరు సమీపంలో గల అంజూరు మండపం వద్ద స్వామి, అమ్మవార్లు కొంతసేపు విశ్రమించారు. అక్కడ స్వామి, అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదానం కూడా చేశారు.
అంజూరు మండపం నుంచి వేడాం మీదుగా శుకబ్రహ్మాశ్రమం సమీపంలోని ఎదురు సేవా మండపానికి స్వామి, అమ్మవార్లు సాయంత్రానికి చేరుకున్నారు. ఎదురు సేవా మండపం వద్ద ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు స్వామి, అమ్మవార్లకు భక్తి పూర్వకంగా స్వాగతం పలికారు. ఎదురు సేవా మండపంలో స్వామి, అమ్మవార్లకు పూజలు చేశారు.
అనంతరం శివపార్వతుల ఉత్సవ మూర్తులను ముక్కంటి ఆలయానికి తీసుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి, ముక్కంటి ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
రేపు ధ్వజావరోహణం
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని 11వ రోజైన ఆదివారం ధ్వజావరోహణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంతో మహాశివరాత్రి ఉత్సవాలు దాదాపు ముగిసినట్లే. ధ్వజావరోహణం చేసే రాత్రిని దేవరాత్రిగా పిలుస్తారు. క్షీరసాగర మథనంలో అమృతం జనించాక దేవతలు శివ సాన్నిధ్యంలో ధ్వజావరోహణం చేసి… తమ నిజ స్థానాలకు వెళతారు. ఇందులో భాగంగా ఉదయం శివ పార్వతుల ఉత్సవ మూర్తులను పురవీధుల్లో చప్పరాలపై ఊరేగించనున్నారు. ఇక రాత్రి స్వామి వారిని సింహాసనం పైనా… అమ్మవారిని కామధేనువు పైనా పురవీధుల్లో ఊరేగిస్తారు.
.

Discussion about this post