‘మాట తప్పడు… మడమ తిప్పడు’ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గురించి వైసీపీ నేతలు పదే పదే చెప్పే మాట. జగన్ తన మాసన పుత్రిక అని చెప్పే సచివాలయ వ్యవస్థ విషయంలోనే ఆయన మాట తప్పారు. సచివాలయ ఉద్యోగులు చేసేది గొడ్డు చాకిరీ. అరకొర జీతాలు. రెండేళ్లు ఈ కష్టాలు అనుభవిస్తే తమ కొలువులు క్రమ బద్ధీకరించడంతో పాటు.. వేతనాలు కూడా పెరుతాయని ఆశించారు.
ఇది వారు సొంతంగా ఊహించినది కాదు. ముఖ్యమంత్రి జగన్ స్వయంగా చెప్పిన మాట. అయితే సచివాలయ ఉద్యోగుల విషయంలో జగన్ మాట తప్పారు. గత ఏడాది అక్టోబరు 2వ తేదీ నాటికే వీరి ప్రొబేషన్ ఖరారు చేయాలి. ఇపుడు మాట మార్చారు. ఈ ఏడాది జూన్ 30వ తేదీలోగా ప్రొబేషన్ ఖరారు చేస్తామని.. జూలై నుంచి కొత్త జీతాలు అమలు చేస్తామంటున్నారు.
అప్పటికి కూడా చేస్తారో.. చేయరో తెలియదు. అందుకే సచివాలయ ఉద్యోగులు తిరుగుబాటు చేసి.. పోరుబాట పట్టారు. వారు విధులు బహిష్కరించడంతో క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్య కలాపాలు స్తంభించి పోయాయి. వీరు ఇలా చేస్తారని జగన్ ప్రభుత్వం కూడా ఊహించలేదు. అందుకే అధికార యంత్రాంగం ‘షాక్’కు గురవుతోంది.
‘గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం’ తన లక్ష్యమంటూ ముఖ్యమంత్రి జగన్ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు 2019 అక్టోబరు 2న శ్రీకారం చుట్టారు. ఉద్యోగుల నియామకం కోసం గ్రూప్-1 స్థాయిలో పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగం కావడంతో… రాష్ట్ర వ్యాప్తంగా 24లక్షల మందికి పైగా ఈ పరీక్షలు రాశారు. ఇందులో 1,34,694 మందిని ఎంపిక చేశారు.
వీరందరూ ఉన్నత చదువులు చదివిన వారే. రూ.50వేలకు పైగా జీతం తీసుకునే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు సైతం ప్రభుత్వ ఉద్యోగం… భవిష్యత్తు భాగా ఉంటుందనే ఆశతో సచివాలయ ఉద్యోగులుగా చేరారు. ఎంటెక్ లో బంగారు పతకం సాధించిన వారు కూడా ఇందులో ఉన్నారు. వీరి నెలసరి వేతనం ప్రస్తుతం రూ.15వేలుగా నిర్ధారించారు. రెండేళ్ల తరువాత అనగా… 2021 అక్టోబరు 2వ తేదీ నాటికి వీరి ప్రొబేషన్ ఖరారు చేస్తామని జగన్ స్వయంగా చెప్పారు.
సచివాలయ ఉద్యోగులు జగన్ మాట పూర్తిగా నమ్మారు. రెండేళ్లకు తమ ఉద్యోగాలను క్రమమబద్దీకరిస్తారని ఆశపడ్డారు. అయితే జగన్ ప్రభుత్వం వీరికి మరో ‘లింక్’ పెట్టింది. సచివాలయ ఉద్యోగులకు మళ్లీ పరీక్షలు పెడతామని… అందులో ఉత్తీర్ణులు అయిన వారికి మాత్రమే ప్రొబేషన్ ఖరారు చేస్తామని నిబంధన విధించింది. విపరీతమైన పని ఒత్తిడిలో సైతం సచివాలయ ఉద్యోగులు పరీక్షలకు సిద్ధమయ్యారు.
ప్రశ్న పత్రాలు చాలా కఠినంగా ఇచ్చినప్పటికీ.. అత్యధిక శాతం రెండు పేపర్లలో ఉత్తీర్ణులు అయ్యారు. ప్రస్తుతం ఉత్తీర్ణులు కాని వారికి మరో అవకాశం ఇచ్చారు. రెండవ సారి ఉత్తీర్ణత సాధించక పోతే ఉద్యోగం ఉండదని ప్రకటించారు. పరీక్షల్లో ఉత్తీర్ణులు అయిన వారందరూ తమ ప్రొబేషన్ ఖరారు చేస్తారని ఆశ పడ్డారు. కలెక్టరే వీరి ప్రొబేషన్ ఖరారు చేయాలని 2021 సెప్టెంబరు 29న గ్రామ, సచివాలయ శాఖ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తి చేసేనందున… ప్రొబేషన్ ప్రక్రియను కలెక్టర్లు పూర్తి చేస్తారని అధికారులు అప్పట్లో వెల్లడించారు.
అయితే 2021 డిసెంబరు 17న విడుదల చేసిన మరో సర్క్యులర్ లో ప్రొబేషన్ ఖరారు చేయదలచిన ఉద్యోగుల జాబితాలను కలెక్టర్లు సంబంధిత ప్రభుత్వ శాఖల రాష్ట్ర స్థాయి విభాగాధిపతులకు పంపాలని సూచించారు. వీటిని ప్రభుత్వం ఆమోదించాకే ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారైనట్లు భావించి సవరించిన జీతాలు అమలు చేయాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ చెబుతోంది. రెండు నెలలు గడచి పోయినా ప్రొబేషన్ ప్రక్రియ ఒక కొలిక్కి రాలేదు. అయినా సచివాలయ ఉద్యోగులు సహిస్తూ వచ్చారు.
అయితే ఈ నెల 7న ముఖ్యమంత్రి జగన్ సచివాలయ ఉద్యోగులకు పిడుగులాంటి వార్త చెప్పారు. జూన్ 30వ తేదీలోగా సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు చేస్తామని… జూలై నుంచి సవరించిన వేతనాలు చెల్లిస్తామని ప్రకటించారు. జగన్ ఇలా చెప్పడం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆగ్రహం తెప్పించింది. ప్రభుత్వ ఉద్యోగమని ఎన్నో ఆశలతో ఇక్కడకు వస్తే… ఇపుడు మొదటికే మోసం చేస్తున్నారని… తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరగాలంటే పోరుబాట తప్పదంటున్నారు. అందుకే తిరుగుబాటు చేస్తున్నట్లు కూడా వారు చెబుతున్నారు.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రస్తుతం నెలకు రూ.15వేల వంతున రూ.202 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రొబేషన్ ఖరారు చేస్తే నెలకు సగటున ఒక్కో ఉద్యోగికి రూ.25వేల వరకు వేతనం చెల్లించాల్సి ఉంటుంది. వేతనం పెంచడం వలన ప్రభుత్వానికి నెలకు దాదాపు రూ.134 కోట్లు అదనపు భారం పడుతుంది. ఈ భారం భరించలేక ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగా ప్రొబేషన్ ఖరారు విషయంలో ఆలస్యం చేస్తోందనే వాదన వినపడుతోంది.
ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏటా రూ.10,247 కోట్లు అదనపు భారం భరించడానికి సిద్ధపడిన జగన్… తన మానస పుత్రికగా చెప్పుకునే సచివాలయ ఉద్యోగుల పట్ల వివక్ష చూపడం విమర్శలకు దారి తీస్తోంది. వారు ప్రశ్నించలేరనే భావనతో ఇలా చేస్తున్నారనే వాదన కూడా వినపడుతోంది. సచివాలయ ఉద్యోగుల ఉద్యమం తీవ్ర రూపం దాల్చక మునుపే జగన్ వీరికి న్యాయం చేస్తే బాగుంటుంది. లేదంటే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుంది.
Discussion about this post