స్థానిక పురపాలిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెగ్గింది అనగానే.. ఆ విజయాలతో ప్రభుత్వానికి, పార్టీకి ఏమాత్రం సంబంధం లేనట్లుగా.. మొత్తం పరిపాలన వ్యవస్థలోకి కొత్తగా వచ్చిన వాలంటీర్లు మాత్రమే.. పార్టీని అడ్డగోలుగా గెలిపించినట్లుగా రంగు పులమడానికి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు ఇదే ధోరణిలో ఉన్నాయి. అయితే కమలదళపతి సోము వీర్రాజు ఒక అడుగు ముందుకు వేసి.. తాము అధికారంలోకి వస్తే.. వాలంటీర్ల వ్యవస్థను ఏకంగా సమాధి చేసేస్తాం అని చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ కనీసం రెండు శాతం ఓటు బ్యాంకు కూడా లేని బీజేపీ.. ‘తాము అధికారంలోకి వస్తే..’ అని if cluase పెట్టి అలవిమాలిన మాటలు అనేకం వల్లెవేస్తూ ఉంటుంది. ఎటూ తాము అధికారంలోకి వచ్చేది అసాధ్యం గనుక.. ఏం చెప్పినా నడుస్తుందనేది బహుశా వారి ధీమా కావొచ్చు. ఆ క్రమంలో భాగంగానే.. తిరుపతిలో మునిసిపల్ ఓటమికి కారణాలు చెప్పుకున్న సోము వీర్రాజు.. వాలంటీర్లే గెలిపించారని అనడం విశేషం.
తాము అధికారంలోకి వస్తే.. వాలంటీర్ల వ్యవస్థను రద్దుచేసేసి, ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు వేల మంది కార్యకర్తల వ్యవస్థను పథకాల పంపిణీకి ఏర్పాటుచేస్తామని కూడా ఆయన సెలవిచ్చారు. అంటే పథకాల్లో దోపిడీకి కార్యకర్తలకే అవకాశం కల్పిస్తామని ఆయన ప్రకటించుకున్నట్లుగా ఉంది.
ఈ మాటలు పార్టీకి నష్టం..
వాలంటీర్లు వైసీపీని స్వయంగా గెలిపించారా? లేదా? అనేది వేరే సంగతి. కానీ.. ఆ వ్యవస్థనే సమాధి చేసేస్తాం అనే ప్రకటన మాత్రం వారికి కోపం తెప్పిస్తుంది. వాలంటీర్లు బీజేపీకి చేటు చేయాలని అనుకుంటే ఆశ్చర్యం లేదు. గెలిపించడం వారికి చేతకాకపోయినా.. ఓడించడం వారికి చేతనవుతుంది. సాధారణంగా ఉద్యోగులతో విభేదాలు పెట్టుకున్న ఏ పార్టీ గెలవదని వారు అంటుంటారు. అలాగే వాలంటీర్లు కూడా ఓటమిని నిర్దేశించే అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికకు గంట మోగిన తరుణంలో.. వాలంటీర్ల వ్యవస్థను సమాధిం చేస్తాం అనడం.. బీజేపీకి నష్టదాయకం కావొచ్చు.
.

Discussion about this post