ముత్తంశెట్టి శ్రీనివాస రావు రాజకీయ ప్రసంగాలు, వ్యవహారాల విషయంలో ఎలా ఉన్నప్పటికీ.. మానవత్వం పరంగా.. తన మంచితనాన్ని మరో మారు నిరూపించుకున్నారు. గాయపడిన వ్యక్తిని తన కాన్వాయ్ లోని వాహనంలో ఆస్పత్రికి పంపి.. ప్రాణాలు కాపాడారు.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తిని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సకాలంలో స్పందించి తన కాన్వాయ్ లోని రక్షక్ వాహనంలో ఆసుపత్రికి తరలించిన ఘటన ఇది. వివరాల్లోకి వెళ్తే..
ఆదివారం మధ్యాహ్నం మంత్రి ముత్తంశెట్టి సబ్బవరం మండలంలోని ఆరిపాకలో భువనేశ్వరీ అమ్మవారిని దర్శించుకునే నిమిత్తం ఆలయానికి వెళ్తున్నారు. ఈక్రమంలో మార్గ మధ్యలో లగిశెట్టిపాలెం గ్రామం వద్ద అప్పుడే ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. టాటా మ్యాజిక్ వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు.
గమనించిన మంత్రి వెంటనే తన వాహనాన్ని ఆపి విషయం తెలుసుకున్నారు. వెంటనే స్పందించి తన కాన్వాయ్ లోని సబ్బవరం రక్షక్ వాహనంలో క్షతగాత్రుడిని విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులతో మాట్లాడి క్షతగాత్రుడికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు. అక్కడే ఉండి బాధితులను మంత్రి ఓదార్చారు. బాధితుడి బంధువులు, గ్రామస్థులు మంత్రి చూపిన చొరవకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రమాదానికి కారకుడైన టాటా మ్యాజిక్ డ్రైవర్ ను గ్రామస్థులు మంత్రి సమక్షంలో పోలీసులకు అప్పగించారు. స్థానికంగా ఈ సంఘటన సంచలనం రేపింది.
బాధితుడు గొడ్డి రాము చోడవరం మండలం పెదనరవ గ్రామవాసి. లక్కీశెట్టిపాలెంలో బంధువుల ఇంట్లో కార్యక్రమానికి హాజరై వెళ్తూండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో కొలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు.
.