బిగ్ బి, రేఖ ల కాంబినేషన్ మళ్లీ రానుందా…? అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా యావత్ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా ఉంది. దానితో పాటు తెలుగువారికి కలిగే సందేహం ఏంటంటే.. మన ప్రతిభావంతుడైన రచయిత, దర్శకుడు, నటుడు తనికెళ్ల భరణి హిందీలో మెగాఫోన్ పట్టబోతున్నారా? అనేది! ఈ సందేహం మన వారిని వేధిస్తోంది.
బిగ్ బి, రేఖల జోడీ మళ్లీ వెండితెరపై కనువిందుచేయనుందా… అయితే అవుననే కొన్ని గుసగుసలు వినవస్తున్నాయి. తెలుగులో ఎస్పీ బాలసుబ్రమణ్యం, లక్ష్మీల కాంబినేషన్లో వచ్చిన మిథునం సినిమా గుర్తుందా… అందులో కేవలం రెండే పాత్రలతో చక్కటి కథనంతో దర్శకుడు తనికెళ్లభరణి సినిమాను ఆద్యంతం రక్తి కట్టించారు. జీవితం చివరి రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులను వదిలి విదేశాల్లో స్థిరపడుతున్న ఈ రోజుల్లో వృద్ధాప్యంలో ఉన్న దంపతులు ఒకరికి ఒకరు ఏవిధంగా తోడు నీడగా ఉంటూ జీవనాన్ని సాగిస్తారో ఈ చిత్రంలో చక్కగా చిత్రించారు. చక్కటి సంగీతంతోపాటు మంచి సాహిత్యంతో కూడా ఈ చిత్రం ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. అయితే ఈ చిత్రాన్ని హిందీలో చిత్రించనున్నట్టు సమాచారం.
ఈ సినిమాకు సంబంధించి హక్కులను హిందీలో ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ చేజిక్కించుకున్నట్టు సమాచారం. అంతేకాదు… ఇందులో బాలు పాత్రలో బిగ్ బి నటించనున్నారని, అలాగే ఆయనకు జోడీగా లక్ష్మి పాత్రలో అందాల తార రేఖ నటించనున్నట్టు కూడా సమాచారం.
చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయని అంతా అంటున్నారు గానీ.. దర్శకత్వం వహించేది ఎవరో తెలియదు. అందుకే ఈ చిత్రానికి తనికెళ్ల భరణినే హిందీలో దర్శకత్వం వహిస్తారా అనే చర్చ నడుస్తోంది. ఎందుకంటే.. ఇది కథలోని ఆత్మ వంటి అంశంతో మమేకమై దర్శకత్వం వహించాల్సిన చిత్రం. కమర్షియల్ హంగులు మాత్రం చూసుకుంటే కుదర్దు. అందుకే భరణి అక్కడ ఎంట్రీ ఇస్తారా అనే చర్చ జరుగుతోంది.
.

Discussion about this post