పంచాయతీ ఎన్నికలవిషయంలో ఎన్ని రకాల డ్రామాలు జరిగాయో రాష్ట్రమంతా తెలుసు. టోటల్ గా రాష్ట్రంలో వెలువడిన ఫలితాలను, తమకు తోచిన రీతిలో ప్రకటించుకుని.. అధికార పార్టీ 80 శాతం సీట్లు తామే గెలిచినట్లుగా ప్రకటించుకుంది. తెలుగుదేశానికి దక్కిన సీట్లే లేవని కూడా తేల్చేసింది. కుప్పంలోను, అచ్చెన్న సామ్రాజ్యంలోనూ కూడా తమ సొంత జెండా ఎగిరిందని చాటేసుకుంది. రాబోయే మునిసిపల్ ఎన్నికల్లో ఇలా తోచిన ప్రకటన చేసుకునే అవకాశం లేదు. పార్టీ గుర్తులపై ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రజాదరణ ఎలా ఉందో ఖచ్చితంగా లెక్కతేలిపోతుంది. ఈ నేపథ్యంలో జగన్ దళం కంగారు పడుతున్నట్లుగా కనిపిస్తోంది.
మేనిఫెస్టో తెచ్చే ధైర్యం ఉందా?
పంచాయతీ ఎన్నికలకు కూడా తెలుగుదేశం పార్టీ ఓ మేనిఫెస్టో తెచ్చింది. పార్టీలతో సంబంధంలేని ఎన్నికలకు ఈ మేనిఫెస్టో ఏంటని.. అధికార పార్టీ ఈసీకి ఫిర్యాదుచేసింది. దరిమిలా.. నిమ్మగడ్డ రమేష్ కుమార్.. చంద్రబాబుకు నోటీసు ఇచ్చారు కూడా! అక్కడికేదో.. గుర్తుల మీద ఎన్నికలు జరిగితే.. తాము కూడా మేనిఫెస్టో తెచ్చి అద్భుతాలు సృష్టిస్తాం అన్నట్టుగా అప్పట్లో వైసీపీ నాయకులు అన్నారు. కానీ.. ఇప్పుడు మునిసిపల్ ఎన్నికల విషయంలో జరుగుతున్నది ఏమిటి? ఇవి పార్టీరూపంలో ఎన్నికలే! అయితే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ తాము మునిసిపాలిటీలకు ఏం చేయబోతున్నామో హామీ ఇచ్చే స్థితిలో ఉందా? మేనిఫెస్టో తేగల స్థితిలో ఉందా? అంటే సందేహమే.
తెలుగుదేశం పార్టీ ఆ పని చేసింది. వారు స్పష్టమైన హామీలతో మేనిఫెస్టో తెచ్చారు. మునిసిపాలిటీల పాలనలో సంస్కరణలనుంచి.. అభివృద్ధి దిశగా ఆ హామీలున్నాయి. అవి చూసి.. వైఎస్సార్ కాంగ్రెస్ కు జడుపు పుట్టినట్టుంది. తాము తేలేకపోగా.. తెదేపా మేనిఫెస్టోను సజ్జల రామకృష్ణారెడ్డి ఆదిమూలం సురేష్ కలిసి పెట్టిన ప్రెస్ మీట్ లో బాగా ఎద్దేవా చేశారు. ఆడలేనమ్మ మద్దెల ఓడన్న సామెత చందంగా తాము చేయలేని పని మరొకరు చేసేసరికి ఓర్వలేక విమర్శించినట్టుగానే వారి మాటలు ఉన్నాయి తప్ప.. వారి విమర్శలు సహేతుకంగా లేవు.
ఇవి కూడా చదవండి సమంత ఫ్లాప్ రుచిచూడాల్సి వస్తుందా? ఈసారి ఎన్ని మిలియన్స్ టార్గెట్ చేశారో తెలుసా?
మేనిఫెస్టో అంటే వైసీపీకి భయం.. ఎందుకంటే..?
మునిసిపల్ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేయాలంటే అధికార పార్టీకి భయంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే.. ఇప్పటికే మునిసిపాలిటీల నడ్డి విరిచే అనేక నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంది. మునిసిపాలిటీల పరిధిలో పన్నులు విపరీతంగా పెంచుకునే వెసులుబాటు.. వారికి ఇచ్చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు ఉండవని కూడా తేల్చేశారు. ఇలాంటి పరిస్థితిలో మునిసిపాలిటీలను ప్రభుత్వం గాలికొదిలేసిందనే చెప్పాలి. వారు చేస్తున్నది.. చేయబోయేది కూడా శూన్యం. అలాంటప్పుడు.. మేనిఫెస్టో రూపంలో పేపర్ మీద కమిట్మెంట్ ఇచ్చే స్థితిలో లేరు. ఈ నేపథ్యంలోనే వారు భయపడుతున్నారని అనిపిస్తోంది. వారు హామీలు ఇవ్వలేరు.. ఇస్తే.. ఇవ్వడం వలన గెలిస్తే.. ఎటూ అధికారంలో ఉన్నారు గనుక.. అవి నెరవేర్చాలి. ఏ చిన్న హామీ అయినా నెరవేర్చేందుకు నిధుల్లేవు. ఉన్న నిధులన్నీ పంచిపెట్టడానికే సరిపోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో.. వారు జంకుతున్నారు.
అదే సమయంలో.. చంద్రబాబునాయుడు, లోకేష్ విడుదలచేసిన మేనిఫెస్టోను చూసి జగన్ దళం జడుసుకుంటున్నారని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే .. ఎన్నికలలో చెప్పాల్సిన అసలు అంశాలు వదిలేసి.. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో మీద విమర్శలు చేస్తున్నారనే వాదన ప్రబలంగా వినిపిస్తోంది.
.
Discussion about this post