‘‘ఈ ఏడాది రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో మా పార్టీ తరఫున నలుగురు ఎంపీలు ఎన్నికవుతారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో మరో నలుగురు ఎంపీలు ఎన్నికవుతారు… రాజ్యసభలో మా పార్టీ బలం పెరుగుతుంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తమ బిల్లులని నెగ్గించుకోవడానికి మా పార్టీ అవసరం చాలా ఉంటుంది… ఆ దశ వచ్చిన తర్వాత, ప్రత్యేక హోదా సాధించి తీసుకొస్తాం…’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా ఆశగా చెప్పుకుంటూ వస్తున్నారు. వాస్తవానికి వాతావరణం అందుకు అనుకూలంగా కనిపించడం లేదు. రాజ్య సభలో వైకాపా బలం పెరగడం నిజమే కావచ్చు కానీ, వారితో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి బలం కూడా పెరుగుతుంది.
అదే జరిగితే కనుక… తమ కూటమిలో లేని ఇతర పార్టీ అవసరమూ, మద్దతు లేకుండానే మోడీ ప్రభుత్వం తాము తలచిన బిల్లులు అన్నింటినీ పార్లమెంటు ఉభయ సభల్లోనూ నెగ్గించుకునే అవకాశం వారికి లభిస్తుంది.
245 సీట్లు ఉన్న రాజ్యసభలో ప్రస్తుతానికి ఎన్డీఏ బలం 114. మిగిలిన అన్ని పార్టీల సమష్టి బలం కంటే వారికి కేవలం 8 సీట్లు మాత్రమే తక్కువ. ఈ ఏడాది 68 స్థానాలు ఖాళీ అవుతుండగా, వాటిలో ఎన్డీయే కూటమికి కొత్తగా కనీసం 15 స్థానాలు బలం పెరిగే అవకాశం ఉంది. అప్పుడిక మోడీ సర్కార్ కు రాజ్యసభలో కూడా పూర్తి మెజారిటీ ఏర్పడుతుంది.
ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం వద్ద ‘‘హిడెన్ ఎజెండా’’ ఏదైనా ఉంటే గనుక, అలాంటి దానిని కూడా నిస్సంకోచంగా, నిర్మొహమాటంగా కార్యరూపంలో పెట్టడానికి మోడీ సర్కారు దూకుడు ప్రదర్శిస్తుంది.
అదంతా ఒక ఎత్తు అయితే… రాజ్యసభ ఓట్ల కోసం కేంద్ర ప్రభుత్వం తమ మీద ఆధారపడే, తమను బతిమాలుకొనే పరిస్థితి వస్తుందని ఆశ పడుతున్న వైయస్సార్ కాంగ్రెస్ నాయకుల కలలు మాత్రం తలకిందులు అవుతాయి. కొడాలి నాని వంటి వైకాపా నాయకులు చెబుతున్న భవిష్యత్ చిత్రం ఆచరణలోకి రాకపోవచ్చు. రాష్ట్ర ప్రయోజనాలు- అనే మాటే నిజమైతే, రాష్ట్రప్రభుత్వం కేంద్రంతో మంచిగా మెలగవలసిందే తప్ప, గత్యంతరం ఉండదని అర్థం అవుతోంది.
.

Discussion about this post