వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు సంబంధించినంత వరకు బొత్స సత్యనారాయణ ఏం చెబితే అదే ఫైనల్ అన్నట్లుగా వాతావరణం కనిపిస్తోంది. ఆయన ఏదో నోరు జారినట్లుగా చెప్పినా, లీకులు ఇవ్వడానికన్నట్లుగా చెప్పినా.. ఎలాగైనా చెప్పవచ్చు గాక.. ఫైనల్ గా ఆయన మాటే ఆచరణలోకి వస్తున్నది. అందుకే.. వైస్సార్ కాంగ్రెస్- భారతీయ జనతా పార్టీలకు సంబంధించి గత కొన్ని రోజులుగా షికారు చేస్తున్న పుకారు విషయంలోనూ… బొత్స మాటల నేపథ్యంలో నిజమేననే అభిప్రాయం కలుగుతోంది.
చంద్రబాబునాయుడు తాను ఎన్డీయేతో సున్నం పెట్టుకుని బయటకు వచ్చిన నాటినుంచి.. భారతీయజనతా పార్టీని, మోడీని విలన్ గా చిత్రీకరించిన నాటినుంచి.. ఆ పార్టీతో జగన్మోహన రెడ్డికి అక్రమ సంబంధం ఉన్నదనే ప్రచారం కూడా ప్రారంభించారు. మోడీని విలన్ గా ప్రజల ఎదుట నమ్మించిన తర్వాత.. ఆ విలన్ తో జట్టుకట్టే వాళ్లంతా విలన్లే అని నమ్మించవచ్చు అనుకున్నారు. ఆ వ్యూహం బెడిసికొట్టింది. జగన్ తిరుగులేని మెజారిటీతో గద్దె ఎక్కారు. అప్పటినుంచి అడపాదడపా జగన్ పార్టీకి, భాజపాతో ముడిపెడుతూ తెలుగుదేశం వర్గాలు తమ వంతు ప్రచారం చేస్తూనే వచ్చాయి.
జగన్ ఢిల్లీ వెళ్లి.. ప్రధాని మోడీతో భేటీ కాగానే.. ఎన్డీయేలో వైకాపా చేరబోతున్నట్లుగా, ఇద్దరికి కేంద్రమంత్రి పదవులు దక్కనున్నట్లుగా పుకార్లు పుట్టాయి. మోడీతో కలిసే ప్రతి ముఖ్యమంత్రీ తమ పార్టీని ఎన్డీయేలో భాగస్వామి చేయాలనేం లేదు. కానీ ప్రచారం చేసేవారి ఉద్దేశ్యాలు వేరే గనుక.. పుకార్లు పుట్టాయి. తటస్థులు కొందరు ఈ పుకార్లను నమ్మలేదు. కానీ.. వారు కూడా నమ్మేలాగా.. బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంకోసం ఎవరి గడ్డమైనా పట్టుకునే స్థాయికైనా దిగుతాం.. అవసరమైతే ఎన్డీయేలో కూడా చేరుతాం.. అని బొత్స ప్రకటించారు. భాజపాతో అంటిపెట్టుకుని లేకపోయినా, మేం ఎన్నడూ దూరంగా పోలేదని కూడా అన్నారు. ఈ సంకేతాలు.. ఎన్డీయేలో వైకాపా చేరబోతున్నట్లుగానే కనిపిస్తున్నాయి.
అమరావతి విషయంలో.. రాజధాని తరలిపోతుందని బొత్స సంకేతాలు ఇచ్చినప్పుడు తొలుత ఎవ్వరూ నమ్మలేదు. కానీ తర్వాత అదే ఫైనల్ అయింది. అదే క్రమంలో.. ఢిల్లీ స్నేహం విషయంలో కూడా కేంద్ర కేబినెట్లోకి జగన్ పార్టీ వెళుతుందంటే తొలుత ఎవరూ నమ్మలేదు. కానీ.. బొత్సమాటల తర్వాత.. ఈసారి కూడా అదే ఫైనల్ అవుతుందనే అభిప్రాయం కలుగుతోంది. తాను తీసుకోదలచని నిర్ణయాలపై ప్రజల స్పందన గమనించడానికి.. ముందుగా బొత్సతో లీకులు ఇప్పించి.. మరీ పెద్దగా వ్యతిరేకత లేకపోతే.. ప్రొసీడ్ అయిపోయే వ్యూహంతో జగన్ పావులు కదుపుతున్నారనే అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది.
.

Discussion about this post