ఎవరికైనా పిచ్చి కుదరాలంటే ఏం చేయాలి? పిచ్చాసుపత్రిలో చేర్పించాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినంత వరకు పిచ్చాసుపత్రి వైజాగ్ లోనే ఉంది. హాస్పిటల్లో అడ్మిట్ చేయలేకుండా, ప్రతిరోజూ పిచ్చాసుపత్రిని సందర్శిస్తూ కుదిరేదాకా చికిత్స చేయించాలంటే… ఏం చేయాలి? వేరే గత్యంతరం ఏముంది? విశాఖలోనే మకాం పెట్టాలి! ఇదీ పద్ధతి అని మనందరికీ తెలుసు.
అయితే.. ఇలా తమ పార్టీలోని ఎమ్మెల్యేలు అందరికీ పిచ్చి కుదిర్చడానికే.. వారి చికిత్స కోసమే.. జగన్మోహన రెడ్డి.. రాజధానిని వైజాగ్ కు తరలిస్తున్నారట. వైకాపా పార్టీ వాళ్లందరికీ పిచ్చెక్కిందనే ఈ సంగతిని… జనసేన పార్టీ నాయకులు చెప్పుకొచ్చారు. వైకాపా ఎమ్మెల్యేలు రోజూ పిచ్చాసుపత్రికి తిరుగుతూ ఉండడంకోసమే రాజధానిని తరలిస్తున్నారని అర్థం వచ్చేలా విమర్శలు గుప్పించారు.
జనసేన పార్టీ అధికార ప్రతినిధి అక్కల రామ్మోహన్ రావు, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు శ్రీనివాస యాదవ్ లు కలిసి విలేకర్ల సమావేశం ఏర్పాటుచేశారు. ప్రభుత్వం పనితీరు మీద.. జనసేన కార్యకర్తల్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న వైకాపా నాయకుల మాట తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ అధినేత జనసేనాని పవన్ కల్యాణ్ సంయమనంతో వ్యవహరించాల్సిందిగా తరచూ సూచిస్తున్నందువల్లే.. తాము మౌనం పాటిస్తున్నామని.. వారిలా దిగజారి మాట్లాడడం లేదని వారు హెచ్చరించారు. తాము భాష అదుపులో పెట్టుకుని మాట్లాడుతున్నాం అంటున్నారు.
వైసీపీ నాయకులు తిరునాళ్లలో తిరిగే పిచ్చివాళ్లు మాట్లాడే భాష మాట్లాడుతున్నారనేది జనసేన ఆరోపణ. ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు ఇలాంటి భాష మాట్లాడితే.. సభ్యసమాజం ఏమనుకుంటుంది.. ప్రజల్లోకి ఎలా వెళ్లగలం అనే ఆలోచన కూడా వైకాపా ఎమ్మెల్యేలకు లేకుండా పోతోందని వారు హెచ్చరిస్తున్నారు. పిచ్చివాళ్లలాంటి వైకాపా ఎమ్మెల్యేలను చూసి ప్రజలు భయపడుతున్నారని, వారి పిచ్చిని నయం చేయడానికే జగన్ వైజాగ్ కు రాజధాని తీసుకువెళ్తున్నారని జనసేన నాయకులు ఎద్దేవా చేస్తున్నారు.
జనసేన- భాజపా పొత్తు చూసి వైకాపా కంగారు పడుతోందనేది వారి వాదన. తాము కూడా ఎన్డీయేతో కలుస్తున్నాం అని ప్రకటించడమూ, తర్వాత నాలిక్కరచుకోవడమూ చూస్తోంటే.. వారి మాట కూడా నిజమేననిపిస్తుంది!
Discussion about this post