రాష్ట్రంలో సోమవారం ఎన్నికలు జరిగే ఐదు ఎమ్మెల్సీ స్థానాలలో వైకాపా అభ్యర్థులు 500 కోట్లు ఖర్చు చేస్తున్నారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. తూర్పు, పశ్చిమ రాయల సీమ నియోజక వర్గాలలో రెండు పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయుల స్థానాలకు, ఉత్తరాంధ్రలో ఒక పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరుగుతాయని చెప్పారు.
మూడు పట్టభద్రుల నియోజక వర్గాలలో 9.5 లక్షలు, రెండు ఉపాధ్యాయ నియోజక వర్గాలలో 50 వేలు కలిపి పది లక్షల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. వైకాపా నాయకులు ఒక్కో ఓటుకు ఐదు వేల రూపాయల చొప్పున ఇస్తున్నారని ఆయన ఆరోపణ చేశారు. దీనికోసం ఒక్కో పట్టభద్రుల అభ్యర్ధి 150 కోట్లు, ఒక్కో ఉపాధ్యాయ అభ్యర్ధి 25 కోట్లు కలిపి 500 కోట్లు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. ఇంత దారుణం ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా చూడలేదని అవేదన వ్యక్తం చేశారు.
10వ తేదీకు ముందే ఉపాధ్యాయులకు గిఫ్ట్ బాక్సుల్లో డబ్బు పంచారని చెప్పారు. శుక్రవారం నుంచి పట్టభద్రులకు డబ్బు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. విశాఖపట్నంలో ఐదు వేల రూపాయలతో పాటు వెయ్యి రూపాయల విలువ చేసే వెండి బిస్కెట్లు కూడా పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఈ విషయం చిత్రీకరించిన వీడియో వైరల్ అయ్యిందని చెప్పారు. తాడిపత్రి మునిసిపాలిటీలో ఓటర్లకు ఆన్లైన్లో పంపిణీ చేస్తున్నారని తెలిపారు. కొన్ని చోట్ల వైకాపా నాయకులు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా పంపుతున్నారని తెలిపారు.
ఇవన్నీ అధికారులకు తెలిసినా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మొత్తం ఓటర్లలో 30 శాతం బోగస్ ఓట్లు ఉన్నాయని చెప్పారు. ఎన్నికల రోజు అక్రమ మార్గాల ద్వారా ఓట్లు వేసుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని చెప్పారు. పోలీసులు, ఎన్నికల అధికారులను భయపెట్టి లేదా ప్రలోభ పరచి రిగ్గుంగులు, దొంగ ఓట్లు వేసుకోవాలని చూస్తున్నారని చెప్పారు.
అయితే టిడిపి నాయకులు, కార్యకర్తలు వైకాపా ఆటలు సాగనివ్వమని ధీమా వ్యక్తం చేశారు.ఇప్పటికే బోగస్ ఓట్లను గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఎన్నికల సమయంలో టిడిపి ఏజంట్లు దొంగ ఓటర్లను పట్టుకుని పోలీసులకు అప్పగిస్తారని అన్నారు. టిడిపి పోటీ చేస్తున్న మూడు పట్టభద్రుల స్థానాలలోను భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని సుధాకర్ రెడ్డి ధీమా వ్యక్తం
చేశారు.
.

Discussion about this post