కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కోశాధికారి అహ్మద్ పటేల్ కన్నుమూశారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని బలితీసుకుంటున్న కరోనా మహమ్మారి దెబ్బకు పటేల్ తుదిశ్వాస విడిచారు. అక్టోబరు 1వ తేదీన కరోనా పాజిటివ్ గా తేలింది. ఆ తర్వాత పరిస్థితి మరింత విషమించడంతో ఆయన గుర్ గావ్ లోని ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. చికిత్స పొందుతూనే.. బుధవారం ఉదయం 3.30 గంటలకు మరణించారు. ఆయన మరణాన్ని కుమారుడు ఫైసల్ ప్రకటించారు.
అహ్మద్ పటేల్ అంటే.. కాంగ్రెస్ పార్టీ వ్యూహరచనా దురంధరుడు అటు రాజీవ్ గాంధీకి పార్లమెంటరీ కార్యదర్శిగా, సోనియా గాంధీకి రాజకీయ కార్యదర్శిగా కూడా సేవలందించారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని కాంగ్రెస్ నాయకులతో ఆయనకు సత్సంబంధాలు ఉండేవి. వైఎస్ రాజశేఖర రెడ్డితో కూడా ఆయనకు మంచి స్నేహబంధం ఉంది. సోనియా కీలక నిర్ణయాల్లో అహ్మద్ పటేల్ ప్రధాన భాగస్వామిగా ఉండేవారు.
అహ్మద్ పటేల్ మృతిపట్ల ప్రధాని మోడీ, సోనియా, రాహుల్ లతో పాటు దేశంలోని రాజకీయ ప్రముఖులు అందరూ ప్రగాఢ సానుభూతి, సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
.