పార్టీ ఓడిపోయినప్పుడు ఆ పార్టీని వదలిపోయి, తిరిగి అధికారంలోకి రాగానే ఆ పార్టీ పంచన జేరే అవకాశవాద రాజకీయ నాయకులు అనేకమంది ఉంటారు. వారు అతి తరచుగా పార్టీలు మారుతూనే ఉంటారు.
ఇలాంటి వారి దెబ్బ మిగిలిన పార్టీలకంటె తెలుగుదేశానికి ఎక్కువగా ఉండేది. అయితే.. ఈ వ్యవహారాలపై ఇటీవలి కాలంలో పార్టీలో మిగిలిన నాయకుల్లో అసహనం విపరీతంగా పెరిగిపోయింది. ఇలాంటి అవకాశవాదులతో అధినేత చంద్రబాబు కూడా విసిగిపోయారు. ఇలాంటి నేపథ్యంలో ఒక గట్టి నియమం పెట్టుకున్నారు. కష్టకాలంలో పార్టీని వీడిపోయిన వారు, వారి స్వార్థం కోసం తిరిగి పార్టీలోకి వస్తామని అంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించ కూడదని రూలు పెట్టుకున్నారు. కానీ, పాపం టీడీపీ తాము పెట్టుకున్న రూలును తానే పాటించలేకపోతోంది. తాజాగా విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో.. జగన్ సర్కారు వచ్చిన తర్వాత.. పార్టీని వీడి వైసీపీలో చేరిన కొందరు నాయకులను తిరిగి టీడీపీలో చేర్చుకోవడం జరిగిపోయింది. ఇందుకు వారు రకరకాల సమర్థించుకునే వాదనలు వినిపిస్తున్నారు.
స్వార్థపూరిత అవకాశవాద నాయకులు ఒకసారి వెళ్లిపోయి తిరిగి పార్టీలోకి వస్తే అనుమతించకూడదని టీడీపీలో చాలా పెద్ద చర్చ జరిగింది. 2020 మహానాడు సందర్భంగా.. ఈ విషయంపై అనేకమంది అధినేత చంద్రబాబును నిలదీశారు. ఉత్తరాంధ్ర నాయకురాలు గౌతు శిరీష అయితే.. ఇలాంటి పనుల వల్ల.. పార్టీనే నమ్ముకుని ఉంటున్నవారికి విలువ లేకుండా పోతోందని.. తీవ్రంగా ప్రశ్నించారు. ఆ నేపథ్యంలో చంద్రబాబు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక అలాంటి వారిని తిరిగి చేర్చుకునేది లేదని చాలా గట్టిగానే అన్నారు. కానీ కొన్ని నెలలు గడిచేసరికి తమ రూలు తామే పాటించలేకపోతున్నారు.
ఇవీ చదవండి :
వకీల్ సాబ్ సాంగ్ లో మహాత్మాగాంధీ ఫిలాసఫీ
రాష్ట్రపతి ఆదేశించినా.. ఇంకా వేధింపులేనా?
ఓవరాక్షన్ మాని.. వెనక్కు తగ్గిన నిమ్మగడ్డ!
టీఆర్ఎస్లో గుబులు పుట్టిస్తున్న అడ్వకేట్లు!
బన్నీ అప్పియరెన్స్‌తో హైప్ వస్తుందా?
విశాఖపట్టణం దక్షిణ నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులు తాజాగా, తెలుగుదేశంలో చేరారు. వీరు గతంలో టిడిపి ఓడిపోయాక పార్టీని వీడి, వైసిపిలో చేరిన వారే! వీరిలో కేదారి లక్ష్మి, బంగారు రవిశంకర్ వారి అనుచరులు ఉన్నారు. వీరిద్దరూ తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరి పునరాగమనం సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో క్షమాపణలు కోరుతూ ఈ ఇద్దరు నాయకులు భావోద్వేగానికి గురయ్యారు.
ఈ సందర్భంగా టిడిపి విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వీరిని మభ్యపెట్టి వైసిపిలో చేర్చుకున్నారని, నమ్మిన పార్టీని వదలడం అంటే వ్యక్తిత్వాన్ని కోల్పోవడమే అని సెలవిచ్చారు. పార్టీ అంటే ఒక సిద్ధాంతం అని ప్రతి ఒక్క కార్యకర్త గుర్తుంచుకోవాలన్నారు. ఇదే కార్యక్రమంలో టిడీపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పార్టీని కష్టకాలంలో విడిచి వెళ్లిన వారిని చేర్చుకోవాలని అనుకోలేదని, కానీ, కార్యకర్తల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోమని చంద్రబాబు సూచించినందున, కార్యకర్తల మనోభీష్టం మేరకు వీరిని పార్టీలో తిరిగి చేర్చుకున్నామని అన్నారు.
ఈ ‘మనోభీష్టం’ ఎవరిదో..?
సాధారణంగా నాయకులు తాము ఉన్న పార్టీని వీడిపోయే ప్రతి సందర్భంలోనే.. తమ వ్యక్తిగత స్వార్థాన్నే ప్రధానంగా చూసుకుంటారు. అయితే.. కార్యకర్తల అభీష్టం మేరకు పార్టీ మారుతున్నాం అని ఒక డొంకతిరుగుడు కారణం చెబుతున్నారు. ఇప్పుడు టీడీపీ నిర్వహిస్తున్న ఘర్‌వాపసీ కార్యక్రమానికి కూడా కార్యకర్తల మనోభీష్టం అనే ఒక ముసుగు తొడుగుతున్నారు. వారు తిరిగి పార్టీకి కావాలని ఎవరు చెప్పారో గానీ.. ఇలాంటి పునరాగమనాల వల్ల.. పార్టీని నమ్మిన కార్యకర్తల్లో పార్టీ పట్ల వైరాగ్యం కలుగుతుంది. తమ స్వార్థం కోసం వారు కారుస్తున్న కన్నీళ్లు చూసి పడిపోతే.. పార్టీకే నష్టం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
.
Discussion about this post