సిరి అంటే సంపద. మనం సంపన్నులం కావడం ఎలా? అనే ఆలోచన ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అపర కుబేరులు అయినా సరే.. మనం మరింత సంపన్నులు కావడం ఎలా అనే సంగతి ఆలోచిస్తూ ఉంటారు.
సంపదకు చిహ్నంగా భావించే లక్ష్మీదేవి ఇలా చేస్తే మన ఇంట్లో కొలువుంటుందని మనం అనేక పనులు చేస్తుంటాం. వ్రతాలు, పూజలు, నోములు ఇవన్నీ కూడా లక్ష్మీదేవి మన ఇంటికి రావడం కోసమే అన్నట్టుగా చేస్తూ ఉంటాం.
కానీ లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో.. ఒక సుభాషితం మనకు తనదైన శైలిలో చెబుతుంది..
మూర్ఖా యత్ర న పూజ్యంతే ధాన్యం యత్ర సుసంచితమ్
దంపత్యో కలహో నాస్తి తత్ర శ్రీః స్వయమాగతా
ఎక్కడైతే మూర్ఖుల మాటకు విలువ దక్కకుండా ఉంటుందో, మూర్ఖుల మాటను పట్టించుకోకుండా ఉంటారో.. ఎక్కడైతే దైనందిన జీవితానికి సరిపడేంత ధాన్యం (దినుసులు) సమృద్ధిగా ఉంటాయో.. ఎక్కడైతే భార్యాభర్తలు గొడవపడకుండా, కలహించుకోకుండా ఉంటారో.. అలాంటి ఇంటికి లక్ష్మీదేవి తనంత తానుగా వచ్చేస్తుంది. .. అనేది శ్లోకభావం.
సంపదను చాలామంది లక్ష్మీదేవిగా భావిస్తారు. సంపద అనేది మనల్ని నిత్యం ప్రలోభపెడుతూ ఉంటుంది. ఏ పనిచేసినా.. సంపదలకోసమే అన్నట్టుగా మనం చేస్తుంటాం. వాకిట్లో ముగ్గు వేసినా కూడా.. ఉదయం పూట అడ్డు గీతలు గీయడం.. లక్ష్మీదేవి ఇంట్లోంచి బయటకు వెళ్లనివ్వకుండా అలా గీయాలని అంటారు. సాయంత్రం వేళ నిలువు గీతలు గీస్తూ.. లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించేలా అలా గీయాలని అంటారు. ఇంత చిన్న చిన్న పనుల నుంచి మనకు ఆచారాలుగా స్థిరపరచిన ప్రతి అలవాటునీ లక్ష్మీదేవి రావడానికి, అంటే సంపద సమకూరడానికి చిహ్నాలుగా చెబుతూవచ్చారు పెద్దలు.
‘కలకంఠి కంట కన్నీరొలికిన సిరి ఇంటనుండ నొల్లదు సుమతీ’ అంటూ.. ఆడవారితో కన్నీళ్లు పెట్టించే చోట కూడా లక్ష్మీదేవి (సంపదలు) ఉండవనే అర్థాన్ని ప్రతిపాదించారు. ఇలా అనేకానేక రీతులుగా.. మంచి లక్షణాలను మనకు అలవాటు చేయడానికి లక్ష్మీదేవితో.. సంపదలతో ముడిపెడుతూ వచ్చారు. అలాగే ఈ సుభాషితం కూడా.. మరో మంచి లక్షణాన్ని మనకు ప్రతిపాదిస్తూ లక్ష్మితో ముడిపెట్టి చెబుతోంది.
మూర్ఖుడి మాటకు విలువ ఇచ్చేచోటకు లక్ష్మి రాదనే మాట కూడా ఈ సుభాషితం చెబుతుంది. అంటే.. తెలివితక్కువ వాడి సలహాలు.. కుటుంబాన్ని దెబ్బతీస్తాయనేది ఒక అంతరార్థం.
ధాన్యం సంగతి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే.. లక్ష్మీదేవి ఉండడమే ధాన్యం సమృద్ధిగా ఉండడం. ఈరెండూ ఒకదానితో ఒకటి ముడిపడినవి. ఇకపోతే.. ఈ సుభాషితంలో కీలకమైన విషయం భార్యాభర్తలు తగాదాపడకుండా ఉండే ఇంటికి లక్ష్మీదేవి తనంత తానుగా వచ్చేస్తుందనేది.
దంపతుల మధ్య చాలా తగాదాలు సహజంగా వస్తుంటాయి. ఎందుకంటే.. ఇద్దరూ కూడా పరస్పరం ఆధారపడిన వ్యక్తులు. ఇద్దరూ కలిపి ఒకే జీవితాన్ని పంచుకునే వాళ్లు. ఒకరి నుంచి మరొకరికి చాలా ఎక్కువగా expectations ఉంటాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ కొద్దిగా దెబ్బతిన్నప్పుడెల్లా.. దంపతుల మధ్య చిన్నా పెద్దా కలహాలు తప్పనిసరిగా వస్తుంటాయి. భార్యగానీ, భర్తగానీ ఎవరో దారినపోయే వాళ్లతో గొడవపడలేరు కదా. తామిద్దరూ ఒకటే యూనిట్ గా బతుకుతుంటారు గనుక.. తమలో తామే గొడవపడతారు.
అయితే సుభాషితకారుడు చెబుతున్నదేంటంటే.. కలహాలు లేని దంపతుల ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని! కలహాలు లేని పరిస్థితి ఎలా వస్తుంది? భార్యాభర్తలు ఇద్దరూ కూడా.. తమ భాగస్వామి అంచనాలను, expectationsని అందుకుంటూ ఉండాలి. ఎప్పటికీ కూడా ఒకరిపట్ల మరొకరికి అసంతృప్తి కలగకుండా చూసుకుంటూ ఉండాలి. ఆ వాతావరణంలో మాత్రమే దంపతుల మధ్య కలహం ఏర్పడకుండా ఉంటుంది. అలాంటి ఇంటికి సంపద, లక్ష్మీదేవి తనంత తానే వచ్చేస్తుందిట.
శుభోదయం
ఇవి కూడా చదవండి :
‘రామ్’ బాణమ్ : సినిమావాళ్ళు పాలిటిక్స్‌కు పనికొస్తారా?
సురేష్ పిళ్లె : ఒక మా ఎలక్షన్.. మీడియా ఓవరాక్షన్
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరుడే వంద కోట్లు సంపాదించాడంటే…?
.

Discussion about this post