మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన వ్యక్తిగత వేదననుంచి కోలుకున్నారు. అసభ్యమైన మాటలు భరించాల్సి రావడంతో.. ఆపుకోలేని దుఃఖాన్ని అనుభవించిన ఆయన కాస్త తేరుకున్నారు. తిరిగి కార్యశీలి చంద్రబాబుగా మారిపోయారు. వరదబాధిత ప్రాంతాల్లో పర్యటించి జనం కన్నీళ్లు తుడవడానికి రెడీ అవుతున్నారు.
చిత్తూరు, కడప జిల్లాలు వరద తాకిడికి చాలా దారుణంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. పట్టణాలకు పట్టణాలే నీటిమడుగుల్లా మారిపోయిన దుస్థితి. కడప జిల్లా మరణాల విషయంలో కూడా అనధికారికంగా సంఖ్య చాలా ఎక్కువే ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరద బాధిత జిల్లాల్లో త్వరలోనే పర్యటించనున్నట్లుగా చంద్రబాబునాయుడు ప్రకటించారు.
వరద తాకిడికి గురైన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శనివారం పర్యటించారు. అయితే ఆయన పర్యటన కేవలం ఆకాశంలో మాత్రమే సాగింది. గన్నవరం టూ కడప, కడప టూ తిరుపతి, తిరుపతి టూ గన్నవరం ఆకాశయానం చేసినట్లుగా ముఖ్యమంత్రి పర్యటన సాగింది. కడప నుంచి తిరుపతి దాకా జగన్ కేవలం హెలికాప్టర్ ద్వారా మాత్రమే పర్యటించారు.
కడప జిల్లాలో చరిత్రలో ఆ జిల్లా ఎన్నడూ ఎరగనంత తీవ్రమైన వరద తాకిడి, నష్టం ఇదని అందరూ అంటుండగా.. అదే జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఎయిర్‌పోర్ట్ లో మినహా జిల్లాలో ఎక్కడా కాలు మోపలేదు. వరదబాధితుల కష్టాలు స్వయంగా చూడడానికి గానీ, వినడానికి గానీ ఆయన మొగ్గు చూపలేదు. వరద తాకిడికి జలమయం అయిన ప్రాంతాలను హెలికాప్టర్ లోంచి చూస్తూ తిరుపతికి చేరుకుని అక్కడినుంచి ఆయన తిరిగి గన్నవరం వెళ్లిపోయారు.
ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు త్వరలోనే ఈ జిల్లాల్లోనే పర్యటించనున్నారు. వరదలు వంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సహాయక చర్యలు విషయంలో అధికారులు ఎంత బాగా పనిచేస్తున్నప్పటికీ.. స్వయంగా తనుకూడా బాధితప్రాంతాల్లోనే ఉండి పనులను పర్యవేక్షించే అలవాటు చంద్రబాబుకు ఉంది.
ప్రస్తుతం అధికారం లేకపోయినా.. త్వరలోనే వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించబోతున్నారు. బాధితులకు అండగా ఉండే భరోసా ఇవ్వాలని అనుకుంటున్నారు. పార్టీ శ్రేణులకు సహాయ కార్యక్రమాల విషయంలో ఇప్పటికే దిశానిర్దేశం చేశారు.
.
Discussion about this post