నాలుగురోజులుగా తిరుమల, తిరుపతి లో కురిసిన వర్షాలు గత 30 సంవత్సరాల్లో ఎప్పుడూ కురవలేదు. తిరుపతి తిరుమల చరిత్రలో ఎన్నడూ ఎరగనంత వర్షబీభత్సం ఈ దఫా ప్రజల, భక్తుల జీవితాలను అతలాకుతలం చేసేసింది. వర్షాల తాకిడికి టీటీడీకి సుమారు నాలుగు కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది.
వర్షబీభత్సం ప్రభావాన్ని, నష్టాన్ని శనివారం నాడు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విలేకర్లకు తెలిపారు.
ఈ భారీ వర్షాలకు శేషాచలం కొండల్లోని డ్యాములు, చెక్ డ్యామ్ లు పొంగి పొర్లి కపిల తీర్థం జలపాతం గుండా తిరుపతి నగరంలోని పలు ప్రాంతాలను ముంపునకు గురి చేశాయని ఆయన తెలిపారు. వర్షాల వల్ల తిరుమల లో రూ 4 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందని అన్నారు.
మొదటి ఘాట్ రోడ్ లోని అక్కగార్ల గుడి వద్ద రక్షణ గోడ దెబ్బతిని, ఘాట్ రోడ్ లో నాలుగు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయన్నారు. టిటిడి సిబ్బంది, అధికారులు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగి వీటిని తొలగింప చేసి తాత్కాలిక రక్షణ ఏర్పాట్లతో ట్రాఫిక్ ను పునరుద్ధరించారని ఆయన చెప్పారు.
రెండవ ఘాట్ రోడ్లో 13 ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడ్డాయి. ఐదు ప్రాంతాల్లో రక్షణ గోడలు దెబ్బతిన్నాయి. టీటీడీ అధికారులు, సిబ్బంది ఈ ఘాట్ రోడ్డులో కూడా కొండ చరియలను తొలగించి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు.
తిరుమల నారాయణగిరి గెస్ట్ హౌస్ ను ఆనుకొని ఉన్న రక్షణ గోడ పడిపోవడంతో మూడు గదులు దెబ్బతిన్నాయి. అధికారులు నారాయణ గిరి, ఎస్వీ అతిథి గృహాల్లోని యాత్రికులను ముందు జాగ్రత్త గా ఇతర ప్రాంతాలకు తరలించడంతో ప్రమాదం తప్పింది. శ్రీవారి మెట్టు మార్గంలో కొంతమేరకు రోడ్డు, కొంతమేరకు ఫుట్ పాత్ భారీ వర్షాలకు దెబ్బతిన్నాయి.
తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం వెనుక వైపు ఉన్న గోడ తో పాటు, రాంనగర్, వినాయక నగర్, జి ఎంబి క్వార్టర్స్, శ్రీనివాసం విశ్రాంతి గృహం కాంపౌండ్ వాల్స్ దెబ్బ తిన్నాయి.
కపిలతీర్థం ఆలయంలో ఒక మండపం వర్షాలకు దెబ్బతింది. దీని మరమ్మతులకు 70 లక్షల రూపాయలు ఖర్చు కావచ్చని అధికారులు అంచనా వేశారు.
వర్షం వల్ల టీటీడీ సర్వర్లు దెబ్బతిని సేవలకు అంతరాయం కలిగిందన్నారు. ఐటి విభాగం అధికారులు, సిబ్బంది వెంటనే పునరుద్ధరించి భక్తుల సేవలకు ఇబ్బంది లేకుండా చేశారు.
స్వామివారి దర్శనం కోసం వచ్చి భారీ వర్షాల కారణంగా తిరుపతిలో ఆగిపోయిన భక్తులకు శ్రీనివాసం, మాధవం, రెండు మరియు మూడో సత్రాల్లో వసతి, ఆహారం ఏర్పాటు చేశారు.
రాలేకపోయిన వారికి మళ్లీ దర్శనం
టికెట్లు ఉండి దర్శనానికి రాలేక పోయిన భక్తులను వర్షాలు తగ్గాక స్వామివారి దర్శనానికి అనుమతించాలని నిర్ణయం తీసుకున్నామని సుబ్బారెడ్డి చెప్పారు. తిరుమల, తిరుపతిలో దెబ్బతిన్న రోడ్లు, ఇతర మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
.

Discussion about this post