భర్త చేయిచేసుకుంటే.. కొడితే.. భార్యలు తిరగబడుతున్నారా? మనస్తాపానికి గురవుతున్నారా? మురిసిపోతున్నారా? తెలుగురాష్ట్రాల్లో మాత్రం అత్యధికులు మురిసిపోతున్నారట. ఎందుకిలా మురిసిపోతున్నారు. ‘అబ్బ నీ తీయని దెబ్బ..’ అనే పాటలు ఎక్కించిన చైతన్యమా? అలాంటి పాటలు ఇతర భాషల్లో లేవా?
కొట్టడం భర్త హక్కు అనుకుంటున్నారో.. సాంప్రదాయం అనుకుంటన్నారో గానీ.. తెలుగు మహిళలంతా భర్త కొట్టడాన్ని సమర్థించినట్టుగా సర్వే ఒకటి తేల్చింది. సర్వే ఫలితం రావడమే తరువాయి.. వాటికి మరింత చిత్రమైన భాష్యాలతో మీడియా మొత్తం హైలైట్ చేసి ప్రచురించేసింది.
పనికి మాలిన సర్వేలు.. వాటిని హైలైట్ చేసేలా పనికిమాలిన హెడ్డింగులతో వార్తలు. అర్థం పర్థంలేని ప్రాధాన్యాలతో పతాక శీర్షికల్లో ప్రచురించడం?! ‘మొగుడు కొట్టడం తప్పేమీ కాదు, భార్యను భర్త కొట్టడం తప్పు కాదు..’ ఇలాంటి హెడ్డింగ్ లతో ఈ సమాజానికి ఏం చెబుదామని?
అసలు ఈ సర్వే చేసినవాళ్లు ఏ పనీపాటా లేనివాళ్లో కాదు, కేంద్ర ప్రభుత్వమే చేసింది. 30శాతం మంది మహిళలు చెప్పారట- మొగుడు కొట్టడంలో తప్పు లేదు అని. అటూఇటూగా 33శాతం ఒప్పేసుకొన్నారు కాబట్టి గృహ హింస చట్టం రద్దు చేసేయాలి, భార్యను కొట్టినా ఎలాంటి కేసు ఉండకుండా చేయాలి అని డిమాండ్లు మొదలుపెట్టడమే ఇక మిగిలింది.
దరిద్రం ఏమిటంటే- తెలుగు రాష్ట్రాల్లో 80శాతం మంది మొగుడు కొట్టడాన్ని సమర్థించారట. అసలు ఇలాంటి సర్వేలకు ఉండే విశ్వసనీయత ఏమిటి? అసలు సర్వే కోసం తీసుకునే శాంపిల్స్ ఎన్ని.. ఆ శాంపిల్స్ ఎంపికకు ఉన్న పారామీటర్స్ ఏమిటి? వాళ్ళు అంతగా మొగుడు కొట్టడాన్ని సమర్థించడానికిగల సామాజిక, కుటుంబ పరిస్థితులు ఏమిటి అనేవి చూడొద్దా?
ఈ సర్వే ప్రశ్నావళి కూడా అభ్యంతరకరంగానే ఉంది. ఈనాటి సర్వేలతో సాధించే ప్రయోజనం ఏమిటి?
ఈ వార్తలు, హెడ్డింగ్స్ చూస్తే భార్యను కొట్టడంలో ఎలాంటి తప్పు లేదు అనే విషయాన్నే బలంగా చెప్పుతున్నట్లు ఉంది. ఇలాంటి సర్వేల వివరాలు వెల్లడి కాగానే.. పత్రికలు బాధ్యతగా వ్యవహరించేట్లయితే గనుక.. ఈ సర్వేల సహేతుకతను, విశ్వనీయతను ప్రశ్నించేలా, అలాంటి సర్వే చేయదలచుకోవడం వెనుక వారి ఉద్దేశ్యాలను తప్పుపట్టేలా కథనాలు రావాలి.
ఆ కథనంలో ఈ పనికిమాలిన సర్వేలో అఘోరించిన లెక్కలు ఇవి అని చెప్పాలిగానీ- కొట్టించుకొని, కొట్టడాన్ని సమర్థించండి అన్నట్లుగా తెలుగు మీడియా కవరేజీ ఉంది. మీడియా కూడా ఇలాంటి వార్తల విషయంలో సామాజిక బాధ్యత, బాధిత వర్గంపట్ల సానుభూతితో వ్యవహరించాలి.
అసలు ఈ సర్వేలే బోగస్. పరస్పర విరుద్ధమైన ఫలితాలను తేలుస్తూ.. అనేకానేక సర్వేలు వెల్లువలా వచ్చిపడుతుంటాయి. అమెరికాలో ఏ డకోటా యూనివర్సిటీ వాళ్లో కాఫీ తాగితే గుండె జబ్బు రాదు అని తేల్చినట్లు ఒక సర్వే ఫలితాలు వస్తాయి. ఆ మర్నాడే బ్రిటన్లో ఏదొక రీసెర్చ్ సెంటర్ ‘వాడు కాఫీ తాగితే మీ గుండె పేలుతుంది’ అని తమ సర్వేలో తేలినట్లు వెల్లవిస్తాడు.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
కేంద్ర ప్రభుత్వ సర్వే కూడా ఈ బాపతుగానే కనిపిస్తున్నాయి. మహిళా సంఘాలు, హక్కుల బ్యాచ్‌లు ఏం చేస్తున్నాయి.. ఈ సర్వేను వ్యతిరేకించకుండా? భార్యను కొట్టేవాళ్లు ఉంటేనే కదా ఉద్యమం చేసి, ఉపన్యాసాలు ఇవ్వడానికి అని ఊరుకొన్నారా?
అసలు ఇలాంటి సర్వేను.. భర్త కొట్టడం గురించి భార్యల మనోభిప్రాయాల్ని కేంద్రం ఎందుకు సేకరించాల్సి వచ్చిందన్నదే పెద్ద ప్రశ్న. భర్త కొట్టడమే మహద్భాగ్యం అని చెప్పిన మహిళా మణుల్లో చైతన్యం తీసుకురావడం తర్వాత- ముందు ఇలాంటి సర్వేలకు పూనుకునే వారిమీదనే పోరాటం జరగాలి.
ఒక సందేహం..
భార్యా భర్తలు కొట్టుకోవడం అనేది ప్రతి ఒక్కరికీ ఆసక్తికరమైన టాపిక్ కావచ్చు. పక్కింటి తగాదాలు ప్రతి ఒక్కరికీ ఇంటరెస్టే. కానీ సర్వేలో ఇలాంటి ఫలితం వచ్చినప్పుడు.. ఈ ఫలితాల్ని ప్రజలకు పంచిపెట్టకుండా పత్రికలు ‘‘ఇగ్నోర్’’ చేస్తే ఏమవుతుంది? ప్రతి సర్వేను ప్రజలకు అందించడం ఏమైనా తప్పనిసరి అంశమా? ఆ సర్వేను వేయకపోతే.. ప్రజలు పత్రికను కొనేయడం మానేస్తారా? ఎందుకింత ఎగబడి ప్రచురించడం? ఒకసారి సమీక్షించుకుంటే మంచిది.
.. వట్టికూటి చక్రవర్తి

Also Read :
మంచితనం నిరూపించుకున్న వైసీపీ ఎమ్మెల్యే భూమన
ఈ రాశుల్లో పుడితే.. ప్రేమను బయటకు చెప్పలేరుట!
చంద్రబాబు కన్నీళ్లు ఆయనకు మేలు చేస్తున్నాయా? నిజమేనా?
మగాళ్ల దినోత్సవం రోజున మోడీ వెనక్కి తగ్గితే, చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చాడు
.

Discussion about this post