వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి కొంచెం విలక్షణమైన నాయకుడు. చాలా సందర్భాల్లో సామాన్యులతో సామాన్యుల్లాగా కలిసిపోతారు. ఎవరూ చేయని పనులు, చేయడానికి ఇష్టపడని పనులు కూడా తానే ముందుండి చేస్తుంటారు. ఎమ్మెల్యేలు సాధారణంగా ఎన్నికల సమయంలో ప్రచార గిమ్మిక్కులగా రకరకాల చిత్రమైన పనులు చేస్తుంటారు. కానీ భూమన ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా.. విలక్షణ పనులు చేయడానికి వెనుకాడకుండా తన ప్రత్యేకత చాటుకుంటూ ఉంటారు.
భూమన కరుణాకర రెడ్డి.. గతంలో తిరుపతి పట్టణంలో పాదయాత్ర చేసి.. భిక్షాటన చేశారు. ఓ భిక్షగాడిని బండిపై కూర్చోబెట్టి.. ఆ బండిని తానే స్వయంగా లాగుతూ.. రోడ్లలో షాపుల వద్దకు తిరుగుతూ భిక్షమెత్తారు. అలా భిక్షమెత్తిన సొమ్మును చివరగా ఆ భిక్షగాడికే ఇచ్చారు. నిజానికి అది చాలా చిన్న విషయం ఇవాళ కరుణాకర రెడ్డి మృతదేహాన్ని మోశారు. ఈ పని చాలామంది ఎమ్మెల్యేలు చేస్తుండవచ్చు గానీ.. వరదల్లో కొట్టుకుపోయిన వ్యక్తి వారం రోజుల తర్వాత దుర్గంధభరితమైన స్థితిలో శవంగా దొరికితే, ఆ స్ట్రెచర్ ను ఇతర నగర పాలక సిబ్బందితో పాటు భూమన కరుణాకరరెడ్డి స్వయంగా మోశారు.
వివరాల్లోకి వెళితే..
ప్రమాదవశాత్తు తిరుపతి లక్ష్మీపురం వద్ద గల్లంతై.. వరద కాలువలో పడి.. గలంతైన సుబ్బారావు అనే ల్యాంకో ఉద్యోగి మృతదేహాన్ని ఎట్టకేలకు కొరమేనుగుంటలో శవమై తేలిఉండగా గుర్తించారు. వారం రోజుల కిందట సుబ్బారావు తాను పనిచేసిన ఓ కంపెనీలో విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా తిరుపతి లక్ష్మీ పురం కూడలి వద్ద వరద నీటి కాలువలో కొట్టుకు పోయాడు.
ఆ మర్నాడే తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గల్లంతైన సుబ్బారావు ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాల్సిందిగా నగర పాలక సంస్థ సిబ్బందిని ఆదేశించారు. ఈ క్రమంలో నిరంతరం గాలింపు చర్యలు కొనసాగాయి. అయినప్పటికీ సుబ్బారావు ఆచూకీ లభించక పోవడంతో ఎన్ ఆర్ డీ ఎఫ్ ను రంగంలోకి దింపడం ద్వారా గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయించారు.
చివరకు శనివారం కొరమేని గుంట వద్ద చేపలు పట్టేందు వెళ్లిన కొంత మంది ద్వారా మృతదేహం పడివున్నట్టు సమాచారం అందడంతో…సిబ్బందితో పాటు భూమన కరుణాకర రెడ్డి అక్కడికి చేరుకున్నారు. బురద గుంటలో దిగబడి పోతుండడంతో మృతదేహాన్ని తీసుకురావడం కష్టంగా మారింది. ఈ దశలో జేసీబీ సహాయంతో సిబ్బంది అతికష్టం మీద మృత దేహాన్ని గుంటలో నుంచి వెలుపలకు చేర్చారు. సుబ్బారావు కుటుంబ సభ్యులు కూడా గుర్తించారు.
ఈ నేపథ్యంలో మృత దేహాన్ని తిరుపతి ముస్లీం జేఏసీ ప్రతినిధులు ఎస్ కే బాబు, జే ఎం డీ గౌస్, నగర పాలక సిబ్బందితో పాటు భూమన కరుణాకర రెడ్డి స్వయంగా స్ట్రెచర్ మీద మోసి, అంబులెన్స్ లో కి చేర్చారు. మరో వైపు సుబ్బారావు కుటుంబ సభ్యులను భూమన కరుణాకర రెడ్డి ఓదార్చారు. నగర మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ పీఎస్ గిరీష, ఎస్పీ వెంకట అప్పల నాయుడు, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ తదితరులు సహాయక చర్యలు చేపట్టారు.
.

Discussion about this post