మనసుకు సరైన శిక్షణ పొందిన వారే విజయ పథాన పయనించగలరని ప్రముఖ మానసిక నిపుణుడు డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి అర్బన్ మండలంలోని ఎస్ వి ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులకు ‘మానసిక శిక్షణ- విజయానికి నిచ్చెన’ అన్న అంశంపై అవగాహన కల్పించారు.
సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నది వాస్తవమైనప్పటికీ దానికి శాస్త్రీయత, నైపుణ్యాలు సమకూరి నప్పుడే మెరుగైన ఫలితాలు ఉంటాయన్నారు.
గుడ్డెద్దు చేలో పడ్డట్టు చేసే పనుల వల్ల మంచి కంటె చెడే ఎక్కువ జరుగుతుందని చెప్పారు. అందుకే ఎదగాలనుకున్న విద్యార్థులు పాఠాలతో పాటు వ్యక్తిత్వ వికాసం పొందాలని సూచించారు.
పాటకు శృతి, లయ లాగే జీవితానికి గమనం, గమ్యం ముఖ్యమన్నారు. అందుకే ప్రతి వ్యక్తి మొదట స్వీయ అవగాహన పెంచుకోవాలని చెప్పారు. శాస్త్రీయమైన తర్కానికి నిలబడే నమ్మకాలు, విలువలు పెపొందించుకోవాలన్నారు.
సృజనాత్మక శక్తి, భావ వ్యక్తీకరణ సమాజంలో గుర్తింపు తెస్తాయన్నారు. మనం తీసుకునే నిర్ణయాలే మన తలరాతను మారుస్తాయన్నారు. ఉద్వేగాలను నియంత్రించుకుంటూ వ్యవహార సామర్థ్యాలు పెంచుకుంటూ సాగిపోవాలన్నారు.
వ్యక్తిత్వానికి సరిపడే లక్ష్యాలను ఎంచుకుని, సంబంధాలను పెంచుకుని దీక్షతో కృషి చేసినప్పుడు విజయం సిద్ధిస్తుందన్నారు.
ఎప్పటికప్పుడు చేస్తున్న పనులను బేరీజు వేసుకుని, తీర్పు చెప్పుకుని, తీరు మార్చుకోవాలన్నారు.
దీనికి విషయ పరిజ్ఞానంతో పాటు లోకజ్ఞానం అవసరమని చెప్పారు. ఆఖరుగా ప్రతి పనిలోను నాయకత్వ లక్షణాలను అందిపుచ్చుకుంటే అందలాలను అధిరోహించవచ్చునని స్పష్టం చేశారు.
సదస్సులో కళాశాల ప్రిన్సిపాళ్లు డాక్టర్ ఎన్. సుధాకర్ రెడ్డి, డాక్టర్ టి.కల్పలతా రెడ్డి పాల్గొన్నారు.
.