ఇప్పుడు మూడు పదులు దాటిన వారికి చాలామందికి ఉండే జబ్బులో ప్రధానంగా చెప్పుకోదగినది హై బిపి. నలభైయ్యవ పడిలో పడిన ఏ ఇద్దరు కలుసుకున్నా వారు ప్రధానంగా మాట్లాడుకునేది మీకు బి.పి, షుగరేమైనా ఉన్నాయా… అనే.
అయితే అందరిలోనూ కామన్ గా ఉండేది మాత్రం హైబీపి. దీన్ని అదుపులో ఉంచుకోవడానికి మందులు వాడకం ప్రారంభిస్తుంటారు. అయితే దీన్ని ఆదిలోనే గుర్తిస్తే… మన ఆహారం విషయంలో కాస్త మార్పులు, చేర్సులు చేసుకుంటే దీన్ని అదుపులో ఉంచవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ముక్కలు తక్కువగా… మొక్కలు ఎక్కువగా…
ముక్కలు తక్కువేంటి… అంటే పులుసులో ముక్కలా… అనుకుంటున్నారా… అక్షరాలా పులుసులో ముక్కలే… అయితే కూరగాయల ముక్కలు కాదు. మాంసం ముక్కలు.
మనం తీసుకునే ఆహారంలో మాంసాన్ని అంటే చికెన్, మటన్ వంటి వాటిని తగ్గించుకుని, వాటి స్థానంలో ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తీసుకుంటే హైబిపిని అదుపులో ఉంచుకోవచ్చు. వీటితోబాటు చేపలు కూడా మన ఆహారంలో భాగంగా చేసుకుంటే మరీ మంచిదని నిపుణులు చెబుతున్నారు.
మరో విషయం అందరూ చెప్పేదే… ఉప్పు నిప్పు అని. మన ఆహారంలో ఉప్పు శాతాన్ని తగ్గించుకోవాలి. ఇందుకోసం నిలవ చేసే ఊరగాయలు, పచ్చళ్లు వంటివాటిని తగ్గించుకోవాలి. అంతేకాదు… ముందుగా ప్యాక్ చేసిన ఆహార పదార్ధాలను కూడా తీసుకోకుండా ఉంటే బాగుంటుంది. బయట హోటళ్లలో తిండి తినకపోవడమే మంచిది. చక్కగా తాజాగాచేసుకున్న కూరలు తీసుకుంటే మరీ మంచిది.
హైబీపీని అదుపులో ఉంచుకోవాలంటే స్వీట్స్ తగ్గించుకోవాలి. కూల్ డ్రింక్స్ వంటివాటిని కూడా తీసుకోకూడదు. ఒకవేళ మీకు స్వీట్‌గా ఏదైనా తినాలనిపిస్తే చక్కగా తాజా పండ్లను తీసుకోండి. మరీ కావాలనుకుంటే డార్క్ చాక్లెట్ తీసుకుంటే మంచిది.
ఇలా మన దైనందిన జీవితంలో కొన్ని చిన్న చిన్న మార్పులను, చేర్పులను చేసుకుంటే మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు. హైబీపీని కాస్తైనా అదుపులో పెట్టుకోవచ్చు. ఏమంటారు?
.