ఎప్పుడో నవంబర్లో మెదలైన కొవిడ్-19, మార్చ్ నుంచి ప్రపంచంలో అన్నింటికీ తలుపులు మూసింది. ఈ ఏడాది విడుదల చేయాలి అనుకున్న సినిమాలన్నీ ఈ దరిద్రం ఎప్పుడు అయిపోతుందా.. ఎప్పుడు రిలీజ్ చేద్దామా అని ఎదురుచూస్తున్నాయి. కానీ అది ఇప్పుడల్లా జరిగేపని కాదని తెలిసి డైరెక్ట్‌గా ఒటిటి లో విడుదల చేయడం మెదలుపెట్టాయి. ఇప్పుడు ఒక మంచి సినిమా వస్తే, ఇది థియేటర్ సినిమా రా అంటారు. ఒటిటి లో వస్తున్న సినిమాల్లో ఈ మధ్య వచ్చిన కలర్ ఫోటో తప్ప మిగతావన్నీ అంత పేరు తెచ్చుకోలేదు. కానీ ఏమాత్రం అతి అంచనాలు లేకుండా వచ్చిన ఆకాశమే నీ హద్దురా, తమిళం లో సూరరాయ్ పోట్ట్రు థియేటర్లో రిలీజ్ అయ్యే స్థాయి సినిమానా.. లేదా అని చూడాలి.
కథ : ఒక మారుమూల గ్రామానికి చెందిన నెడుమారన్ (సూర్య) తండ్రి స్కూల్ టీచర్ మరియు సోషియల్ యాక్టివిస్ట్. ఏ సదుపాయం లేని ఊరికి కరెంటు తెప్పించాడు.. ఊరిలో రైలు ఆగేలా చేయించాడు. అలా అహింసతో యుద్ధం చేసే మనిషికి అహింస మీద ఏమాత్రం నమ్మకంలేని కొడుకు ఉండడంతో ఇద్దరికీ సరిగా పడేది కాదు. ఎయిర్ ఫోర్స్ పైలెట్ ట్రైనింగ్ తీసుకుంటున్న సూర్యకు- తండ్రి ఆరోగ్యం చెడి, ఇక ఏమాత్రం బతికే చాన్స్ లేదని సమాచారం తెలుస్తుంది. సూర్య వెంటనే తన ట్రైనింగ్ క్యాంప్ నుంచి ఎయిర్ పోర్ట్‌కు వస్తే ఎకానమీ టికెట్స్ అన్నీ బుక్ అయిపోయి కేవలం బిజినెస్ క్లాస్ సీట్లు మిగిలుంటాయి. సరిపడా డబ్బుల్లేక రోడ్డు ప్రయాణం మొదలు పెట్టి ఇంటికి వచ్చేసరికి తండ్రి చనిపోయి దహనం కూడా జరిగిపోయుంటుంది. అప్పటినుంచి ధనవంతులే కాదు పేదవాళ్లు కూడా విమానంలో ప్రయాణం చేయాలి అందిరికీ అందుబాటులో ఉండే టికెట్ రేట్లు ఉండాలి అనే ఐడియాతో ఏయిర్‌ప్లేన్ సర్విసెస్ మొదలుపెట్టాలనుకుంటాడు. అక్కడినుంచి తన కోరిక తీరడానికి ఎంత కష్టపడుతాడు.. మధ్యలో ఎందరు శత్రువులు తయారై, ఎలాంటి ఇబ్బందులు కలిగిస్తారు.. వాటన్నిటినీ అధిగమించి తాను అనుకున్నది సాధించాడా లేదా అనేది కథ.
ఇవీ చదవండి: బలవంతపు పెళ్లి చేశారు.. వెంటనే తాళి తెంచేశారు... Review : అంచనాలకు అందని సినిమా కలర్ ఫోటో మెగాస్టార్ విషయంలో వాళ్లంతా నోరు మూసుకోవాలి
నటీనటులు : సూర్య నటన గురించి అందరికీ తెలిసిందే. కానీ ఈ సినిమాలో డైరెక్టర్ సూర్య ట్యాలెంట్ ఆఖరి బొట్టు దాకా మెత్తం పిండేసినట్టుంది. సినిమాలో చాలా సార్లు ‘ఎంత బాగా చేశాడు రా!’ అని అనిపించేలా ఉంది. తక్కువ స్క్రీన్ టైమ్ ఉన్నా కూడా మోహన్ బాబు నటన గురించి ఎవ్వరైనా మెచ్చుకొవాల్సిందే. అతను పెద్ద నటుడు.. బాగా చేస్తాడు అని పెట్టుకున్నట్టు లేదు. ఆ పాత్రకు అతను తప్ప ఇంకెవ్వరు లేరు అన్న రేంజ్‌లో మోహన్ బాబు అందరినీ మరపించారు. హీరోయిన్ గా అపర్ణ బాలమురళీ కూడా కధతో పాటుగా మిగిలిన వారి నటన ఆమెను వెనక్కి నెట్టేయకుండా సూర్య భార్య పాత్రలో బాగా ఒదిగిపోయింది. తెలుగు ప్రేక్షకులకు చాలావరకు విలనిష్ పాత్రలతోనే బాగా గుర్తుండిపోయిన పరేష్ రావల్ ఈ సినిమా లో కూడా విలన్ పాత్ర పోషించారు. కానీ మిగిలిన నటీనటులు వారి ‘ది బెస్ట’ పర్ఫామెన్స్ అన్నట్టు చేస్తుంటే పరేష్ రావల్ మాత్రం అతని ట్యాలెంట్ విజృంభించలేదనే చెప్పాలి. మిగిలిన నటులందరూ బాగా చేశారనే చెప్పాలి.
సాంకేతిక విభాగాలు : సుధ కొంగర మంచి అభిరుచి దర్శకురాలిగా ఆల్రెడీ పేరుతెచ్చుకున్నారు. ఈ సినిమా విషయంలో కూడా టీమ్ కెప్టెన్ గా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపిస్తుంది. డైరెక్షెన్‌తో మొదలెడితే చిన్నా చితకా సిల్లీ మిస్టేక్స్ రాకుండా అందరినీ హ్యాండ్ పిక్ చేసినట్టు అన్నీ 24 క్రాఫ్ట్స్ ఫస్ట్ క్లాస్ రేంజ్‌లో ఉన్నాయి. నికేత్ సినిమాటోగ్రఫీ బాగుంది. డిఐ కూడా సినిమాటోగ్రఫీకి, ఇంకా ఆ మూడ్‌కి చాలా సూట్ అయింది. సతీష్ సూర్య ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. నీట్ కట్స్‌తో ఆర్ ఆర్ వాయిస్‌ని డామినేట్ చేసేయకుండా జాగ్రత్తగా చేశాడు. గ్రాఫిక్స్ కొద్దిగా అన్ రియలిస్టిక్‌గా ఉన్నా కూడా చాలా నీట్ వర్క్. హీరో సత్యదేవ్ చెప్పిన డబ్బింగ్ కూడా నప్పింది.
స్క్రీన్‌ప్లే బాగుంది. కొద్దిగా రొటీన్ అయిపోతున్న స్క్రీన్‌ప్లే అయినా బాగా చేశారు. ‘ఇంకా ఎంతసేపు రా బాబూ!’ అన్నట్టుగా కాకుండా ‘ఇప్పుడేం జరుగుతుందో’ అనే టెన్షన్ ఎక్కువ. ఈ ఫీలింగ్ వస్తే ఇంక అది ఫ్లాఫ్ అని చెప్పేందుకు వీల్లేదు.
మ్యూజిక్ లేనిదే సినిమాలో ఫీలే ఉండదు అనేది టామ్ అండ్ జెర్రీ అయినా, చార్లీ చాప్లిన్ అయినా అదే. అక్కడ నవ్వాలన్నా ఏడవాలన్నా మ్యూజిక్ లేకుండా ఆ ఫీల్ రాదు. అది సైలెంట్ మూవీ అయినా చూస్తారు కానీ అందులో మ్యూజిక్ లేనిదే ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపరు. ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కూడా సినిమా ఫీల్‌ని ఇంకో లెవల్‌కి తీసుకెళ్లింది.
ఒపినియన్ : ఈ సినిమాను సూర్య నటన కోసం చూడొచ్చు. సుధ కొంగర దర్శకత్వం కోసం చూడొచ్చు.. ప్రకాష్ మ్యూజిక్ కోసం చూడొచ్చు.. నికేత్ సినిమాటోగ్రఫీ కోసం చూడొచ్చు.. ఇలా ఎందుకు చూడచ్చో అనే లిస్ట్ చాలా పెద్దది. ఎందుకు చూడకూడదు అని లిస్ట్ లేదు అసలు. సినిమాలో కాస్త తమిళ టచ్ ఎక్కువ అనిపిస్తుంది. కానీ అది ఉండాలి. అది లేకపోతే అదో మైనస్ అయిపోతుంది. సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా చేశారు అని చెప్పను కానీ మంచి సినిమాకి ఉండాల్సిన స్థాయి కంటే కాస్త ఎక్కువ బాగానే చేశారు. థియేటర్ సినిమా రా ఇది. థియేటర్లు తెరిచాక కూడా మొత్తం హౌస్‌ఫుల్ అవుతుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వచ్చింది అని చెప్పొచ్చు. ఈ కొవిడ్ సిట్యువేషన్ష్‌లో ఓటీటీ వేదికల మీద చాలా చెత్త డంప్ అయిపోతున్నప్పటికీ.. అడపాదడపా మెరుస్తున్న మంచిసినిమాలూ ఉన్నాయి. వాటిలో ఇదొకటి.
ఫీల్ : ఆకాశాపు హద్దు దాటేసింది
స్కోర్ : 4/5
.. ఆదర్శిని భారతీకృష్ణ
twitter.com@adarsinikissulu