రెండు తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న హఫీజ్ పేట్ భూములు- బోయిన్ పల్లి కిడ్నాప్ వ్యవహారంలో భూమా అఖిలప్రియ ఇరుక్కుపోతున్నారా? భూములు తన పేరు మీదనే ఉన్నాయంటున్న ఏవీ సుబ్బారెడ్డి, వాటిని కొన్నట్లుగా (పంచుకున్నట్లుగా) ప్రచారంలో ఉన్న ప్రవీణ్, నవీన్, సునీల్ రావులు కుమ్మక్కయ్యారా అనే అనుమానాలు ప్రబలంగా వినిపిస్తున్నాయి. కేసులు నమోదైన రోజున ఏ1 గా ఏవీ సుబ్బారెడ్డి పేరు, ఏ2గా భూమా అఖిలప్రియ పేరు ఉన్నట్టుగా స్వయంగా పోలీసు కమిషనర్ ప్రకటించారు.
రెండోరోజు రిమాండ్ రిపోర్టు వచ్చేసరికి అంతా మారిపోయింది. ఈ పేర్లను మార్చినట్టు బోయిన్ పల్లి ఇన్స్‌పెక్టర్ మీడియాకు చెప్పారు. అఖిలప్రియ ఎ1 అయ్యారు.. సుబ్బారెడ్డి ఎ2 అయ్యారు. భార్గవరామ్ మాత్రం ఎ3 గా కొనసాగుతున్నాడు.
ఇంతకంటె తమాషా ఏంటంటే.. సుబ్బారెడ్డి పరారీలో ఉన్నారని తొలుత పోలీసు అధికార్లు ప్రకటించారు. ఆ ప్రెస్ మీట్ లో ఉన్న విలేకర్లే.. సదరు సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నాడు కదా.. అని గుర్తుచేసిన తర్వాత.. పోలీసులు మేలుకుని వెళ్లి అదుపులోకి తీసుకున్నారా? అప్పటిదాకా కనీసం పోలీసులు ఆ విషయాన్ని గుర్తించకుండా.. ఎలా మాట్లాడారనేది సస్పెన్స్! అలాగే, విచారణకు సహకరిస్తానని, తనకు కిడ్నాప్ తో సంబంధం లేదని సుబ్బారెడ్డి అనగానే.. ఆయనకు నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారు. అదే మాట అఖిలప్రియ కూడా అంటున్నా జైల్లో పెట్టారు. ఇదంతా చిక్కుముడిలాగా కనిపిస్తోంది.
ఇలా ఎలా జరిగింది?
హఫీజ్ పేట్ భూముల వ్యవహారానికి సంబంధించి.. రకరకాలుగా వస్తున్న వివిధి మీడియా కథనాలను బట్టి ప్రజల్లో వేర్వేరు అనుమానాలు పుడుతున్నాయి. ఉన్న యాభై ఎకరాలను ఎవి సుబ్బారెడ్డి, ప్రవీణ్ రావు తదితరులు చెరి పాతిక ఎకరాలు పంచుకోడానికి ఒప్పందం చేసుకున్నట్లుగా కొన్ని కథనాలు వస్తున్నాయి. అయితే దానికి సంబంధించి ప్రవీణ్ రావు తదితరులు సుబ్బారెడ్డికి భారీగా వందల కోట్ల రూపాయల సొమ్ముచెల్లించారనేది సమాచారం. తాను పొందగలిగింది.. దక్కింది గనుక.. సుబ్బారెడ్డి ఈ విషయంలో సైలెంట్ గానే ఉంటారని అనుకోవచ్చు.
తన తండ్రి కొన్న ఆస్తులకు సంబంధించి.. తమకు ఒక్కరూపాయి కూడా దక్కకుండా కోల్పోతున్నాం అనేది అఖిలప్రియ అండ్ కో బాధగా కనిపిస్తోంది. అయితే.. వారితో వైరం పెట్టుకున్న సుబ్బారెడ్డి.. వారికి ఇచ్చే అవకాశం లేదు. ఆయన నిమ్మళంగానే మాట్లాడుతున్నారు. భూమా కుటుంబం ఆగ్రహంగా స్పందిస్తోంది. సొమ్ము పుచ్చుకున్న సుబ్బారెడ్డి, సొమ్ము ఇచ్చిన (కిడ్నాప్ అయిన) ప్రవీణ్ రావు సోదరులు అంతా ఒక జట్టు అయ్యారా? అనే వాదన వినిపిస్తోంది. ప్రవీణ్ రావు త్రయం కుమ్మక్కు అనడానికి వీల్లేదు. వారు సొమ్ము ఇచ్చేశారు.. ఆస్తి కోరుకుంటున్నారు.. అంతవరకే వారి సంగతి! కానీ సుబ్బారెడ్డి.. వారితో మిలాఖత్ అయి.. భూమా అఖిలప్రియను మాత్రమే కేసులు ఇరికిస్తున్నారా? అనే వాదన తెరపైకి వస్తోంది.
ఈ కేసులో ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతాయో.. ఎటు వైపు మళ్లుతాయో వేచిచూడాలి.
.