ఈ సినిమా నేను వెండితెరపై చూడడం మిస్ అయ్యాను కొన్ని అనివార్యకారణాలవలన. ఇప్పుడు ఆహా ఓటిటి లో చూసాను. నాకు చాలా నచ్చి ఈ సమీక్ష వ్రాస్తున్నాను. పిల్లల కథల సినిమాలు మన తెలుగువాళ్ళు దూరమై చాలాకాలమైంది. కానీ ఇది పిల్లలు తో పెద్దలు కూడా కలిసి ఖచ్చితంగా చూడవలసిన గొప్ప సినిమా.
పిల్లలకు తల్లి ప్రధమ గురువు అని మన భారతీయ సనాతన ధర్మం చెప్పకనే చెప్పింది. కుటుంబ వ్యవస్థలో పిల్లల పెంపకంలో తల్లి పాత్రదే కీలక స్థానం.
అతి సున్నితమైన పిల్లల హృదయపు లోతుల్ని అవలీలగా గ్రహించే దైవదత్తమైన శక్తి, హృదయం భగవంతుడు తల్లికి మాత్రమే ఇచ్చాడు.
పిల్లల కడుపుచూసి అన్నం పెడుతూ వాళ్ళను చక్కగా తీర్చిదిద్దే తల్లిగా, జీరోని సైతం హీరోని చేసే క్రమంలో మానసిక విశ్లేషణ చేయగల వైద్యురాలిగా,
ప్రేమించిన పెళ్ళిచేసుకున్న అతిసామాన్యమైన భర్తతోనైనా ఉన్నంతలో సర్దుకుపోయే గృహిణిగా ఒక భారతీయ స్త్రీ మన సమాజపు ఉన్నతికి వెన్నుదన్ను.
స్త్రీకి చదువు, సంస్కారం ఉంటే సమాజం మొత్తం బాగుపడుతుంది అని పెద్దలు చెప్పారు.
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మధ్యతరగతి ఆశలన్ని పిల్లలు చదువుకుని పైకి రావాలనే ఆలోచన తప్ప మరొకటి ఉండదు. అందులో ఇంట్లో తల్లిదండ్రులకు చదువు సరిగారాకపోతే పిల్లల సందేహాలు తీర్చేవారు లేకపోతే ఇప్పటి విద్యవిధానం గల స్కూళ్ళల్లో మరీ కష్టం. ఎవ్వరూ వాళ్ళను పట్టించుకునే టైమే ఉండదు. అదీగాక చిన్న చిన్న సందేహాలు వస్తే తీర్చేవాడులేక ఆ శిశువు తల్లడిల్లిపోయి, ఏం చేయాలో తెలియక గతితప్పుతాడు.
వాణ్ణి తిరిగి చదువు మీద దృష్టిపెట్టేలా, సందేహాలు తీర్చేలా తల్లి తాను చదువుతూ చదివించడం అనే . ఒక అద్భుతమైన, నిజాయితీగా రాసుకున్న కథతో
ఈమని నందకిశోర్ ముందుకు రావడం అభినందనీయం.
ఒక తల్లి తన కొడుకు బాగు కోసం పడే తపన గల సరస్వతిగా అత్యద్భుతమైన నటనతో నివేదితా థామస్ మధ్యతరగతి బ్రాహ్మణ తల్లిగా ఆ పాత్రలో ఒదిగిపోయింది. చిత్తూరు మాండలికం ఆమె స్వంతంగా చెప్పుకోవడం ముదావహం. నటనలో వైవిధ్యం కనబరచింది.
మన విద్యావ్యవస్థలో ఎన్నో లోపాలున్నాయి. తార్కితతో ఆలోచించి పిల్లలకు విద్యనేర్పే విధానానికి అది దూరం. మార్కుల పందేరంలో ఎందరో పిల్లలు తెలివి ఉన్నా వెనక పడిపోవడం జరుగుతోంది. దర్శకుడు కార్పొరేట్ సంస్థల గోల వైపు వెళ్ళకుండా తాను చెప్ప దల్చుకున్నది సూటిగా చెప్పాడు.
ఎన్నో ఆశలతో అందరు తల్లిదండ్రులు స్కూల్ కు పంపుతారు. పిల్లలందరూ ఒకే జ్ఞానంతో ఉండరు. రోజు గడిస్తే, మా జీతం మాకు వస్తే చాలనే టీచర్లు, పిల్లలు అడిగే సందేహాలకు సమాధానం చెప్పే ఓపిక, లేని టీచర్లు మన స్కూళ్ళలో ఉన్నారు చాలావరకు. వాళ్ళను తప్పుబట్టలేము ఎందుకంటే చదువుతో పాటు వేరే పనులు వాళ్ళ నెత్తిమీద పెడుతున్నారు పాపం.
ఆ పరిస్థితుల్లో ఒక పక్షుల గూటిలో చిన్న కుదుపు. ఎగరలేని, ప్రమాదంలో చిక్కుకున్న పరిస్థితి నుండి తల్లి పక్షి రెక్కలు విప్పి ఆ పిల్లపక్షికి ఎలా ఎగరాలో నేర్పడం.
దర్శకుడు తన రచనతో మనల్ని గొప్పగా ఆకట్టుకున్నాడు. ఎంతో కష్టమైన సబ్జెక్ట్ తీసుకుని చాలా తెలివిగా హ్యాండిల్ చేసాడు. సంభాషణలైతే సందర్భానికి తగ్గట్టు గా ఉన్నాయి. కొడుకు అరుణ్ అడిగే ప్రశ్నలకు తన కున్న పరిజ్ఞానంతో సరస్వతి సమాధానాలు చెప్పడం చాలాబావుంది. ప్లస్, మైనస్ అనే సంకేతాలతో జీవిత పాఠాలు చెప్పడం చాలా బావుంది. చెస్ ఆడిస్తూ పిల్లవాడి మనస్సును తన అధీనంలోకి తెచ్చుకునే సంఘటనలు పాతరోజుల్లో మన తల్లిదండ్రులు, తాత బామ్మలు మనతో ఉండి ధైర్యంచెప్పే రోజులు గుర్తుకు వస్తాయి.
విలువ లేని సున్నా పక్కన ఒకటి వేస్తే వచ్చే పది తొమ్మిది కన్నా ఎలా పెద్దది అన్న ప్రశ్నకు కొడుక్కి తల్లికి కలిగిన సందేహం నివృత్తి అయ్యే సన్నివేశంతో దర్శకుడు, రచయత తన ప్రతిభతో శిఖారాగ్రాన కూర్చున్నారు. ఈ ఒక్క సన్నివేశం చాలు ఈ సినిమా ఎంత గొప్పగా ఉందో.
తల్లి పేరులో సరస్వతి కానీ టెంత్ ఫేయిల్డ్. కొడుకుకోసం చదవడం కొంత అసహజంగా కొందరికి అనిపించినా, అక్కడ తల్లి అని గుర్తుంచుకోవాలి,
ఒక తల్లి కొడుకు కోసం ఏదైనా చేయగలదు తలుచుకుంటే అని మన పురాణాలు, చరిత్రలు చెప్పాయి.. అంత ప్రేమ ఉంటుంది పిల్లలంటే తల్లికి.
కథనం మనల్ని ఆలోచింప చేస్తుంది. ఆర్ద్రతతో మన గుండె తడుస్తుంది. సంభాషణలు మనల్ని అప్రతుభుల్ని చేస్తాయి. దర్శకుడు నందకిషోర్ ఈమని, ప్రశాంత్ విఘ్నేష్, అమరవాది కలిసి చాలా బాగా రాసారు.
మచ్చుకు కొన్ని:
ఏంకావాలో కన్నా ఏం అవసరమో అదివ్వాలి
చదువుకోవడం అంటే నేర్చుకోవడం
మనిషికి మాట విలువ వినడంతో రాదు. పాటించడంతో వస్తుంది
నామాల స్వామి నామాలు ఆయనకు కనిపించవన్నట్టు
పిల్లలు నాతో బాగావుండకపోయినా పర్వాలేదు. వాళ్ళు బాగా ఉంటే చాలు
కొడుకు, తల్లి తిరుపతి మెట్లు ఎక్కుతూ లెక్కలు నేర్పించడం,
ఆల్జీబ్రా అంటే అర్ధం చెప్పడం,
జీరో అని పిలిచే పిల్లాణ్ణి పేరుతో పిలిచేలా మాస్టారిని ప్రేరేపించడం లాంటి సంఘటనల సమాహారం సినిమాకు గొప్ప బలాన్ని చేకూర్చాయి.
స్త్రీలు చదువుకోవాలని, కొనసాగించాలనే ఆలోచన, అలాంటి వాళ్ళకు ఆలంబనగా నిలిచే ఉన్నత భావాలుగల పాత్రలో గౌతమి బాగా నటించింది. భాగ్యరాజా పాత్ర సముచితంగా ఉంది. తన సిధ్దాంతమే కరక్టు అని మొండిగా ఉండి పోయి, పిల్లల నాతో బాగుండకపోయినా పర్వాలేదు, పిల్లలు బాగావుంటే చాలు అనే లెక్కల మాస్టారు చాణక్య పాత్రలో ప్రియదర్శి కూడా చాలా బాగా చేసాడు.
సగటు మధ్యతరగతి తండ్రిగా తనకున్న దాంట్లో పిల్లల్ని ఆనందపరిచే ప్రసాద్ పాత్రలో రాచకొండ విశ్వదేవ్ చాలా సహజంగా నటించాడు. హాస్యకోసం కృష్ణతేజ చేత ఒక డైలాగ్ చెప్పించారు, ఈ సాఫ్ట్ వేర్ జాబ్ లు ముందు ముందు ఉండవు, మా వేదం నేర్చుకునేవాళ్ళవే ముందు ముందు రోజులని అని.
నిజం! అవి కాలాతీతమైనవి, నేర్చుకోవడం అనే నిరంతర ప్రక్రియకు పెద్ద ఉదాహరణ. కథనంలో తిరుపతి కొండ, భక్తి వాతావరణం చక్కని అనుభూతినిచ్చింది.
పిల్లల చదువుమీద తీసుకున్న సబ్జెక్టు అయినా కుటుంబ బంధాలు, బడిలో స్నేహాలు, విడిపోతున్నప్పుడు బాధపడీ, బెంగపడే భావేద్వేగాలు చాలా బాగా చూపించారు.
మరో ముఖ్యపాత్ర పెద్దకొడుకు అరుణ్ పాత్రలో వేసిన అరుణదేవ్ చాలా అద్భుతంగా నటించాడు. వాడి నటన మనల్ని కంట నీరు తెప్పిస్తుంది ఒకోచోట. సంగీతం వివేక్ సాగర్ బాగానే ఇచ్చాడు. కొంత మ్యూజిక్ డామినేట్ చేయడం వలన పాటలు అర్ధం అవ్వలేదు. సంభాషణలు తిరుపతి మాండలికంలో చెప్పించారు. డబ్బింగ్ కాస్త బాగా చూసుకోవలసింది. కొన్నిచోట్ల అర్ధం అవ్వలేదు. కొన్నిచోట్ల సరిగా పలకలేదు.
ఇలాంటి మంచి కథతో సినిమాతీయడానికి ముందుకు వచ్చిన నిర్మాతలు సృజన, సిద్ధార్ధ్ లు అభినందనీయులు. రానా సమర్పించడంతో మంచి సినిమాల కు తానెప్పుడు ముందుంటానని నిరూపించుకుంటున్నాడు. తప్పకుండా పిల్లలు, పెద్దలు కలిసు చూడవలసిన గొప్పసినిమా ఈ సినిమాకు అవార్డువ రావడం ఖాయం ఏ విధమైన రాజకీయాలు అడ్డుపడక పోతే.
..చాగంటి ప్రసాద్.
9000206163
Discussion about this post