తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు , జనసేనాని పవన్ కల్యాణ్ తో పొత్తు పెట్టుకోవాలనే ఉంది. ఇద్దరూ కలసి ఎన్నికలకు వెళ్లాలనే ఉంది. జగన్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఏమైనా వస్తుంటే గనుక.. ఆ వ్యతిరేక ఓటు చీలకుండా.. ఇరు పార్టీలూ కలిసి పోటీచేస్తే గరిష్టమైన ప్రయోజనం ఉంటుందనే ఆశ ఉంది.
అందుకే ఆయన పవన్ కల్యాణ్ మీద ఎన్నడూ పల్లెత్తు మాట అనకుండా.. రాజకీయం నడిపిస్తున్నారు. ఇప్పటిదాకా ఇదంతా కూడా గుంభనంగానే సాగుతోంది. తాజాగా కుప్పం పర్యటనలో ఆయన గోప్యత బట్టబయలైంది. పవన్ కల్యాణ్ మీద తనలో ఉన్న వన్ సైడ్ లవ్ ను చంద్రబాబునాయుడు స్వయంగా, స్పష్టంగా బయటపెట్టుకున్నారు.
ప్రస్తుతం కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబును, రామకుప్పంలో ఓ అభిమాని.. ‘సార్.. వచ్చే ఎన్నికల్లో మీరు పవన్ కల్యాణ్ పార్టీతో కలిసి పోటీచేస్తారా?’ అని అడిగారు. దానికి చంద్రబాబు తమాషా జవాబు ఇచ్చారు. ‘తమ్ముడూ.. నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావని అనుకుందాం. ఆ అమ్మాయి కూడా నిన్ను ప్రేమించాలి కదా.. ఏకపక్షంగా ప్రేమించలేం కదా’ అని జవాబు ఇచ్చారు.
మొత్తానికి చంద్రబాబు చాలా స్పష్టంగా పవన్ కల్యాణ్ తో బంధం కోసం ఆశపడుతున్న తనలోని వన్ సైడ్ లవ్ ను బయటపెట్టేసుకున్నారు. ఇంత స్పష్టంగా బయటపడి తన నోటమ్మట చెప్పకపోయినా.. ప్రతి సందర్భంలోనూ ఆయన పవన్ కల్యాణ్ అనుకూల వైఖరినే అనుసరిస్తున్నారు. ఇప్పుడు ఇలా ‘లవ్’ బయటపడిన తర్వాత.. ఈ ప్రేమ సంకేతాలు పవన్ కల్యాణ్ కు చేరుతాయా?
ఆయన ఎలా స్పందిస్తారు? ఆల్రెడీ ఇప్పటికే భారతీయజనతా పార్టీతో ఓ బంధాన్ని ముడేసుకుని.. ఉండలేక, వీడలేక ఉక్కిరిబిక్కిరి అవుతూ.. ఈసురోమని ఆ బంధాన్ని కొనసాగిస్తున్న పవన్ కల్యాణ్.. ఈ రకంగా చంద్రబాబు రూపంలో కొత్తప్రియుడు అందిస్తున్న ప్రేమ సంకేతాలను అందుకుంటాడా? గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా అనేది వేచిచూడాలి.
Discussion about this post