మంచితనం, నిజాయితీ, సామాజిక సేవ, విలువలతో కూడిన రాజకీయాల కోసం కృషి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆలోచన, ఎన్నికల సంస్కరణలకు ప్రయత్నాలు, మృదువైన బాష, ఉన్నతమైన భావాలు, విలువలతో కూడిన సేవాభావం, మూర్తీభవించిన వ్యక్తిత్వం, ఇలా ఎన్నో రకాల మంచితనాలు కలబోసుకున్న వ్యక్తుల సమూహం ఒకేసారి, ఒకేచోట కనపడిన దృశ్యానికి ఎటువంటి పేరు పెట్టొచ్చు. అసలు అటువంటి దృశ్యం కనపడడమే అరుదు. నిన్నటి రోజున (23-11-2024) ఆ దృశ్యం నా కళ్ళెదుట కనపడడమే కాదు, అటువంటి వ్యక్తుల సమూహం మధ్యలో మూడు గంటల పాటు గడిపిన అనుభూతి కలిగింది. చాలా సభలు, సమావేశాలు చూసాను, పాల్గొన్నాను. ఎన్నో ఉన్నత ఆశయాలతో జరిగిన సభలు తెలుసు. ఉన్నత విలువలు, ఆశయాలు, లక్ష్యాలు కలిగిన వ్యక్తులు నిర్వహించిన సభలు, వాటిలో పాల్గొన్న గొప్ప వ్యక్తులను, సభికులను కలిసాను.
అయితే ఆ సభలలో నిర్వాహకులకు ఉన్న ఆశయాలు, విలువలు, అంకితభావం మరియు నిబద్ధత సభికులు అందరిలో కనిపించేది కాదు. బహుశః ఆ సభలలో వివిధ స్థాయిలలో వివిధ సంఘాల వారు పాల్గొనడం కూడా అలా అనిపించడానికి కారణం కావచ్చు. ఆ సభలకు నేను నిన్న హాజరయిన సమావేశానికి స్పష్టం అయిన తేడా ఉంది.
నిన్నటి సభలో ‘సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ‘ ఆధ్వర్యంలో దివంగత హైకోర్టు (అలహాబాద్) చీఫ్ జస్టిస్ శ్రీ అంబటి లక్ష్మణరావు గారి మెమోరియల్ సందర్భంగా సుప్రీంకోర్టు జడ్జిగా ప్రస్తుతం పనిచేస్తున్న జస్టిస్ శ్రీ యస్. వి. యన్. భట్టి స్మారక ఉపన్యాసం చేశారు. ఈ సమావేశం 23-11-2024 తేదీ సాయంత్రం విజయవాడ లోని సర్వోత్తమ ట్రస్ట్ లైబ్రరీ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో ‘సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ‘ ఆఫీసులో జరిగింది.
సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థను రిటైర్డ్ జస్టిస్ శ్రీ భవానీప్రసాద్, రిటైర్డ్ సి.ఎస్ (ఎపి) అధికారి శ్రీ ఎల్ వి సుబ్రహ్మణ్యం, మాజీ ఎన్నికల కమీషనర్ (ఎపి) శ్రీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, మరి కొందరు పెద్దలు స్థాపించారు. వీరంతా తమ ఉద్యోగాలలో విలువలతో నిజాయితీగా పనిచేసి రిటైరైన తర్వాత ప్రజలకు తమ వంతు సహాయసహకారాలు అందించి ప్రజలలో చైతన్యం తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వీరి కృషికి చేదోడు వాదోడుగా ఉండేందుకు అటువంటి ఆశయాలు, విలువలు, లక్ష్యాలు, నిజాయితీ కలిగిన అనేక మంది రిటైర్డ్ అధికారులు, ఉద్యోగులు, వివిధ రంగాలలో పనిచేసిన మేధావులు ఆ సభలో కనిపించారు.
వారందరితో నిండిన ఆ సభ ఎంతో ఉన్నతంగా ఆశాజనకంగా ఉంది. ఇటువంటి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థల అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతైనా ఉంది. అందుకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ నిర్వహించిన ఈ సభ తార్కాణంగా నిలిచింది. మున్ముం దు మరింత ప్రాచుర్యం కలిగి “సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ” సంస్థ నీతి, నిజాయితీతో కూడిన రాజకీయాల కోసం, విలువలతో కూడిన సమాజం కోసం, రెండు తెలుగు రాష్ట్రాలలో తన వంతు కృషి చేస్తుందని ఆశిద్దాం.
– పి. పి. శాస్త్రి,
అడ్వకేట్, ఏలూరు.
Discussion about this post