రాజధాని నుండి బయలుదేరిన మహా పాదయాత్రను జయప్రదం చేయాలని శ్రీకాళహస్తి నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య కోరారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రేపు రెండవరోజు చింతలపాలెం నుండి బయలుదేరే మహా పాదయాత్రకు సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ నారాయణ హాజరవుతున్నారన్నారు.
ఈ మహా పాదయాత్రకు నియోజకవర్గం లో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రాధాకృష్ణ గోపి మునీంద్రా వై యస్ మణి మోహన్ రెడ్డి రజాక్ తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లాలోకి ‘అమరావతి యాత్ర’
అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండు చేస్తూ అమరావతి రైతులు చేపట్టిన ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పాదయాత్ర 37వ రోజైన మంగళవారం నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించింది. శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లె వద్దకు అమరావతి రైతులు చేరుకోగానే చిత్తూరు జిల్లాకు చెందిన రైతులు, టీడీపీ, బీజేపీ, వామపక్ష పార్టీలకు చెందిన నేతలు వందలాది మంది స్వాగతం పలకడానికి తరలి వచ్చారు.
జగ్గరాజుపల్లె వద్ద కొంతమంది రైతులు, నేతలు మోకాళ్లపై కూర్చుని వందనం చేస్తూ పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు స్వాగతం పలికారు. జై అమరావతి… జై జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఈ పాదయాత్ర శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లె నుంచి సుమారు 16 కి.మీ. దూరంలోని ఏర్పేడు మండలం చింతలపాళెం వరకు చేస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. కాగా ఈ రోజు మధ్యాహ్నం ఎంపేడు వద్ద అమరావతి రైతులకు భోజన ఏర్పాట్లు చేశారు. భోజన ఏర్పాట్లు చేసే ప్రాంతంలో చదును చేసిన భూమిని… గుర్తు తెలియని వ్యక్తులు యంత్రాల సాయంతో దున్నేశారు.
దీంతో మొదటి ఎంఫిక చేసిన స్థానంలో కాకుండా… వేరే చోట భోజన ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. కాగా శ్రీకాళహస్తి మండలంలో పాదయాత్ర చాలా ఉత్సాహంగా జరిగింది.
.