సంతోషం, దుఃఖం, కోపం, భయం లాంటి రాగద్వేషాలు పుట్టుకతోనే ఎవరికీ ఉండవు. ఊహ తెలిసిన తర్వాతే అవి ఆపాదించబడుతాయి. విచిత్రమైన విషయం ఏంటంటే మనిషిలో వాటిని చొప్పించేది సాటి మనిషే.
భయం.. అలాంటి వాటిలో అసంబద్ధంగా మన ఇతరుల్లోకి చొప్పించే ఒక అలవాటు. చాలా దుర్మార్గమైనది.
ఎలాగంటే…
ఉదాహరణకు:
చిన్నతనంలో పిల్లలు అన్నం తినకుండా మారాం చేసినప్పుడు “అదిగో బూచాడు వస్తావున్నాడు. తినకపోతే ఆయన ఎత్తుకెళ్తాడు” అని గడ్డం పెంచుకున్న భిక్షగాడినో, లేకపోతే సాధువునో చూపించి తినిపించేస్తాం. కానీ, పిల్లలకు ఆ దృశ్యం అలాగే మనస్సులో ముద్రపడిపోయి తినకపోతే నిజంగా ఎత్తుకెళ్తాడనే ‘భయం’ తో తినేస్తారు. అలా మనకు తెలియకుండానే అన్నం ముద్దలతోపాటు భయాన్ని పిల్లల్లోకి చొప్పిస్తాం.
అలాగే పిల్లలు కొంచెం పెద్దయ్యాక ‘హోంవర్క్ చేస్తే చాక్లెట్ తీసిస్తామని. క్లాసులో ఫష్ట్ వస్తే సైకిలు కొనిస్తామని, లేకపోతే తీసివ్వం, కొనివ్వం’ లాంటి ఆశలను, భయాలను తల్లిదండ్రులే పిల్లలకు కలిగిస్తుంటారు.
దీనివల్ల వచ్చిన నష్టమేమిటంటే…
పిల్లలు పెద్దయ్యాక అన్నం తినకపోతే ఏ బూచాడు ఎత్తుకపోడు అనే విషయాన్ని తెలుసుకున్నప్పటికీ ఆ భయం లోపల అలాగే ఉండడంచేత తానూ ఇతరులను భయపెట్టాలనే ప్రవృత్తిని అలవాటు చేసుకుంటాడు. అసలు భయం ఉన్నవాడే ఇతరులను భయపెట్టాలననుకుంటాడు. ధైర్యవంతుడు భయపడడు. భయపెట్టడు. అలాగే, నీవు ఈ పనిచేస్తే ఫలానాది తీసిస్తాను, చేయకపోతే తీసివ్వను అని చెప్పే విషయం చాలా ప్రమాదకరం.
ఎందుకంటే…
పిల్లలు పెద్దయ్యాక అదే ఫార్ములాని తల్లిదండ్రులపై ప్రయోగిస్తారు. నాకు సైకిలు కొనివ్వకపోతే నేను ఆ పని చేయనని, బైకు తీసివ్వకపోతే చదవనని, ప్రేమించిన అమ్మాయితోనో/ అబ్బాయితోనో పెళ్ళి చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని తల్లిదండ్రులను బ్లాక్ మెయిల్ చేసి భయానికి గురిచేస్తారు. ఇది అత్యంత ప్రమాదకరం.
అందుకని ఇలాంటి తత్వాన్ని చిన్నతనం నుంచే పిల్లల్లో చొరబడకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్త వహించాలి.
ఆందోళన కలిగించే అంశం ఏంటంటే…
ఇప్పుడు ఈ తరహా బ్లాక్ మెయిలింగ్ పెద్దల్లో కూడా విస్తరించడంవల్లే సమాజంలో హత్యలు, ఆత్మహత్యలు, మానభంగాలు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు పెట్రేగిపోతున్నాయి.
ఎలాగంటే…
ఉదాహరణకు:
కుటుంబంలో ఏ కారణంచేతనైనా భార్యాభర్తల మధ్య విపరీతమైన గొడవలు వచ్చినప్పుడు విడాకులు ఇచ్చేస్తానని భర్త, ఆత్మహత్య చేసుకుంటానని భార్య ఒకరినొకరు బ్లాక్ మెయిల్ చేసుకోవడంవల్ల ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఇద్దరూ భయంతో బతుకుతుంటారు.
అలాగే, ఏదైనా పనిమీద గవర్నమెంటు ఆఫీసుకు వెళ్ళినప్పుడు సదరు ఉద్యోగి అపరిమితమైన లంచం ఇస్తేనే పని చేస్తానని చెప్పినప్పుడు వెళ్ళిన వ్యక్తి అతనికి లంచం ఇచ్చుకోలేక ఆత్మహత్య చేసుకోవచ్చు. లేకపోతే ధైర్యం చేసి అతనిపై దాడిచేయవచ్చు. ఇంకా ధైర్యం ఉంటే సదరు ఉద్యోగిని ఎ.సి.బి కి పట్టించవచ్చు. అదేవిధంగా లంచం తీసుకున్న వ్యక్తి ఎప్పుడు అవినీతి నిరోధక శాఖ అధికారులు వచ్చి పట్టుంకుంటారేమోనని నిరంతరం భయంతో చస్తూ బతుకుతుంటాడు.
ఒంటరిగా ఉన్న మహిళపై ఒక అగంతకుడు మానభంగం చేసేసిన తర్వాత, విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదరించడంవల్ల బాధిత మహిళ భయపడి ఆ విషయాన్ని ఇతరులకు చెప్పకపోవచ్చు. లేకపోతే మనసు వికలంచెంది ఆత్మహత్య చేసుకోవచ్చు. అలాగే మానభంగం చేసిన వ్యక్తి ఆ విషయం ఎవరికీ తెలియకూడదనే అజ్ఞానంతో సదరు మహిళను చంపివేయవచ్చు. లేకపోతే పోలీసులు పట్టుకుని శిక్ష పడేలా చేస్తారేమోనని భయపడి ఆత్మహత్య చేసుకోవచ్చు. వెరసి భయం అనేది ఇద్దరిలోనూ కామన్ విషయం.
ఉద్యోగం చేసో, వ్యాపారం చేసో లేక కూలీపని చేసో ఒక సాధారణ వ్యక్తి తన స్థాయికి తగ్గట్టు ఒక స్థలాన్ని కొన్నాడనుకుందాం. ఆ స్థలాన్ని బాగా పలుకుబడి ఉన్న వ్యక్తో లేక ఒక రాజకీయ నాయకుడో సదరు వ్యక్తిని భయపెట్టి బలవంతంగా ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు ఆ సాధారణ వ్యక్తి ఆ బలవంతుడికి భయపడి ఏమీచేయలేక మౌనంగా ఉండిపోవచ్చు. లేకపోతే కష్టపడి సంపాదించిన ఆస్తి పరులపాలు అయినందుకు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవచ్చు. ఒకవేళ బాధిత వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడనుకుందాం. అప్పుడు సదరు పలుకుబడి ఉన్న వ్యక్తినో లేక రాజకీయ నాయకుడినో భయపెట్టి పరువు తీయ్యాలని ఉద్దేశంతో ఆ విషయాన్ని మీడియా హైలెట్ చేసిందనుకో. ఆ సమయంలో సదరు పలుకబడి ఉన్న వ్యక్తో లేక రాజకీయ నాయకుడో విషయం బట్టబయలు అయినందుకు భయంతో బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయవచ్చు. లేకపోతే సున్నిత మనస్కుడు అయితే పదిమందిలో పరువు పోయిందని మనస్థాపం చెంది ఆత్మహత్య కూడా చేసుకోవచ్చు.
ఇలా…
లోకంలో ప్రతిఒక్కరూ ఏదోక భయంతో ఇటు బతకలేక అటు చావలేక బతుకు బండిని భారంగా నడుపుకొస్తున్నారనేది నమ్మలేని నిజం.
మరి మనిషి భయం నుంచి బయటపడడానికి మార్గం ఉందా?
సృష్టిలో ప్రతి సమస్యకు పరిష్కారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మనిషిలో భయం తొలగిపోవడానికి కూడా మార్గం ఉంది.
పిల్లలకు గోరుముద్దులను తినిపించేటప్పుడు దెయ్యాల కథలను కాకుండా, పిల్లలకు ధైర్యాన్ని నూరిపోసే కథలని చెప్పాలి. చీకట్లో సైతం ఒంటరిగా నడిచే నిర్భయత్వాన్ని కలిగించాలి.
నిర్భయత్వం కలగాలంటే, “నాది” అనే పదాన్ని వదిలేయాలి. ‘నా’ ఇల్లు, ‘నా’ కారు, ‘నా’ బైకు, ‘నా’ భార్యాపిల్లలు, ‘నా’ స్నేహితులు అనే భావనను తొలగించుకోవాలి. అంటే వాళ్ళని వదిలించుకోమని చెప్పడం నా ఉద్దేశం కాదు. నాది అనే బంధాన్ని తొలగించుకోవాలి. ఎవరితోనైనా, దేనితోనైనా
మనస్సు లోపల detachment ఉండాలి.
వెలుపల attachment ఉండాలి.
ఎలాగంటే…
‘జీవితమే ఒక రంగస్థలం’ అని అద్భుతమైన మాట అన్నాడు షేక్స్పియర్. రంగస్థలం మీద ఎవరికిచ్చిన పాత్రలు వాళ్ళు నటించిన తర్వాత స్టేజీ దిగిపోతుంటారు. మళ్ళీ ఆ పాత్రలతో అనుబంధాలు పెంచుకోక అక్కడిక్కడే మరచిపోతుంటారు. కారణమేమిటంటే అది కేవలం నటనే అని తెలిసి ఉండడం వల్ల ఆ పాత్రల ప్రభావం నటీనటుల మనసుపై పడదు.
జీవితం కూడా అంతే. దేవుడి ఆడించే నాటకమేనని, అందులో మనం కేవలం పాత్రధారులమేనని నిరంతరం ఎరుకతో ఉంటే అప్పుడు ఏ భయాలూ మన మనసుకు అంటవు.
Be fearless అన్నాడు వివేకానందుడు.
కాబట్టి…
ఈ అందమైన ప్రపంచంలో దేనికీ భయపడకుండా స్వేచ్ఛగా జీవించడమే అసలైన జీవితం.
…దేవీప్రసాద్ ఒబ్బు
9866251159

ఇవి కూడా చదవండి :
సురేష్ పిళ్లె : ఒక మా ఎలక్షన్.. మీడియా ఓవరాక్షన్
రామ్ బాణం : జర్నలిస్టులకు నోబెల్ శాంతి బహుమతి.. జర్నలిజం ప్రపంచానికే స్ఫూర్తి
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
.

Discussion about this post