తెలంగాణ పెద్దపల్లి జిల్లా మంథనిలో జరిగిన న్యాయవాది దంపతుల హత్య ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ హత్యోదంతం రేకెత్తిస్తున్న అనుమానాలు, భయాల నేపథ్యంలో.. న్యాయవాదుల పరిరక్షణకోసం ప్రత్యేకంగా ఒక చట్టం రావాలనే డిమాండ్ కూడా సర్వత్రా వినిపిస్తోంది.
మంథనిలో జరిగిన న్యాయవాది దంపతుల హత్య ను తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి ఖండించారు. బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో డిజిపిని కలిసి, ఈ కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేసి శిక్ష అమలు అయ్యేలా చూడాలని కోరారు. ఈ మేరకు డిజీపీకి వినతిపత్రం సమర్పించారు. డిజీపీ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే నిందితులను పట్టుకుని శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని నర్సింహారెడ్డి అన్నారు.
న్యాయవాదుల కోసం ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకు రావాలని బార్ కౌన్సిల్ డిమాండ్ చేస్తున్నదని నర్సింహారెడ్డి అన్నారు.
కొత్త చట్టం అవసరమా?
మంథనిలో న్యాయవాది దంపతులను హత్య చేయడం చాలా తీవ్రమైన సంగతి. అయితే ఈ ఘటనతో.. యావత్ న్యాయవాదుల సమాజం మొత్తం ప్రమాదంలో ఉన్నట్టుగా భావించాలా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. తెలంగాణ బార్ కౌన్సిల్ మాత్రం.. ఏకంగా న్యాయవాదులకోసమే ఒక ప్రత్యేక చట్టం కావాలని అంటోంది. ఈ హత్యకు గురైన వారు.. కేవలం న్యాయవాది కావడం వల్లనే ఇలాంటిది జరిగి ఉండొచ్చు. అంతమాత్రాన వారికి ఒక ప్రత్యేక చట్టం కావాలంటే.. సామాన్య ప్రజల రక్షణ కోసం ఉన్న చట్టాలన్నీ డొల్లవేనని, వాటివల్ల ప్రయోజనం లేదని.. సాక్షాత్తూ బార్ కౌన్సిల్ ఛైర్మన్ భావిస్తున్నారా అనే అనుమానం కూడా కలుగుతోంది. ఈ డిమాండ్ పై మాత్రం భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.