తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రత్యేకించి ఈనాడు దినపత్రిక తెలిసిన ప్రతి ఒక్కరికీ నాలుగు దశాబ్దాలుగా చిరపరిచితుడైన కార్టూనిస్ట్ శ్రీధర్ సంస్థ నుంచి తప్పుకున్న తరువాత.. తెలుగు అగ్రదినపత్రిక నుంచి సమకాలీన రాజకీయ వ్యవహారాల మీద వ్యంగ్య బాణాలు సంధించబోయేది ఎవరు? మీడియా వ్యవహారాల మీద ఆసక్తి ఉండే ప్రతిఒక్కరినీ ఈ సందేహం తొలుస్తుంటుంది. అయితే ఈ విషయంలో ఈనాడు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపిస్తోంది.
‘ఇదీ సంగతి’ అంటూ ప్రతిరోజూ పాకెట్ కార్టూన్లతో శ్రీధర్ ఈనాడు పాఠకులకు నలభయ్యేళ్లుగా తన చతురతను పంచిపెట్టారు. సంస్థతో సుదీర్ఘ అనుబంధం తరువాత ఆయన తప్పుకున్నారు. ఒక రకంగా చూసినప్పుడు.. పొలిటికల్ కార్టూనిస్టుగా ఆయన ఈనాడు మీద వేసిన ముద్రతో పోలిస్తే.. ఆ స్థానాన్ని అంతే ప్రతిభగల వారితో భర్తీ చేయడం కత్తి మీద సాము.
శ్రీధర్ రాజీనామా తరువాత మీడియా వర్గాల్లో రకరకాల పుకార్లు, ఊహాగానాలు వినిపించాయి. ఆయన ఇతర పత్రికల్లో చేరబోతున్నారని, ఇంగ్లిషు పత్రికలలో చేరుతారని కూడా ఊహాగానాలు వచ్చాయి. అయితే ఆయన ఈనాడుకు రాజీనామా తర్వాత, ఇప్పటి వరకూ కార్టూన్లకే దూరంగా ఉన్నారు. కొత్తగా యూట్యూబర్ అయ్యారు. అంతరార్థం అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా వారాంతపు విశ్లేషణల వీడియోలు చేస్తున్నారు. కేవలం కుంచెను కొరడాగా ప్రయోగించడం మాత్రమే కాకుండా, రాయగల పటిమ, వ్యవహారాల మీద అవగాహన ఉన్నందున ఆయనకు వీడియో రూపంలో రాజకీయ విశ్లేషణలు చేయడం సునాయాసమైన వ్యవహారంగానే నడుస్తోంది.
‘ఇదీసంగతి’ మాయమైందే..
‘వ్యక్తులు కాదు సంస్థలు శాశ్వతం’ అనేది మనమందరమూ నమ్మే సిద్ధాంతం. ఈనాడు దినపత్రిక ఈ సిద్ధాంతాన్ని మరింత ప్రబలంగా విశ్వసిస్తుంది. ఎలాంటి అనుభవ శూన్యులకైనా శిక్షణ ఇప్పించి.. వారితో పత్రిక నడపించగలను అనేది రామోజీరావు ధీమా అని పెద్దలు చెబుతుంటారు. పలు సందర్భాల్లో సంస్థ నుంచి దిగ్గజాలు నిష్క్రమించినప్పుడు ఆయన ఆ విషయాన్ని సాధికారికంగా నిరూపించుకున్నారు కూడా.
అయితే శ్రీధర్ నిష్క్రమణ తర్వాత.. సంస్థ చిత్రంగా స్పందించింది. మామూలు ధోరణిలో అయితే.. రోజుల వ్యవధిలోనే కొత్త కార్టూనిస్టుతో ‘ఇదీసంగతి’ని కొనసాగిస్తూ.. తమకు వచ్చిన నష్టమేం లేదని చాటవలసిన సంస్థ. ఆ కార్టూన్ ఫీచర్ ను నిలిపివేసింది. ఆ నిలిపివేత తాత్కాలికమే కావచ్చు.
ఇదివరలో కూడా శ్రీధర్ అనారోగ్యం పాలైనా, విదేశీ యాత్రలకు వెళ్లినా పాకెట్ కార్టూన్ ప్రచురించకుండా.. ఆయన గైర్హాజరీని సంస్థ గౌరవించింది. రాజీనామా ఆమోదం పొందేవరకు ఆయన సుమారు రెండు వారాలుగా సెలవులోనే ఉన్నప్పటికీ, కార్టూన్లు గీయకపోయినప్పటికీ.. దినపత్రికలో పాకెట్ కార్టూన్లు కనిపించలేదు గానీ.. వెబ్ సైట్ లో ‘ఇదీసంగతి’ టాబ్ కింద ఆయన సెప్టెంబరు 13న గీసిన కార్టూన్ నే చాలా కాలం పాటు ఉంచారు. ఆయన రాజీనామా తర్వాత కూడా కొన్నాళ్లు అలాగే ఉన్నది గానీ.. ఇప్పుడు కార్టూన్ల ట్యాబ్ నే సైట్ నుంచి కూడా పూర్తిగా తొలగించేశారు.
శ్రీధర్ స్థానంలో ఎవరు?
శ్రీధర్ ను క్వాలిటీ పరంగా ‘రీప్లేస్’ చేయడం అంత సులువు కాదు. కానీ, పాకెట్ కార్టూన్లు పాఠకులకు కూడా ఒక అలవాటుగా మారిన తర్వాత.. ఎవరో ఒకరితో కార్టూన్లను భర్తీ చేయడం అవసరం. శ్రీధర్ ను మరిపించే విధంగా.. జాతీయ స్థాయి కార్టూనిస్టులను ఎవరినైనా ఈనాడు తీసుకువస్తుందా? అనే ఊహాగానాలు కొంత నడిచాయి గానీ.. అదంతా నిజం కాదు.
ఇవి కూడా చదవండి :
ఈనాడు శ్రీధర్ : తీరానికి ఆవల…
కొత్త అవతారంలోకి శ్రీధర్
ఉద్యోగులను తగ్గించుకునే పనిలో ఈనాడు
Rape : ఈ వైసీపీ నేత.. ‘దిశ’ చట్టానికి దిష్టిచుక్క!
‘మనం లబ్ధ ప్రతిష్ఠుల వెంట పడాల్సిన అగత్యం లేదు. కొత్త వారిని మనం ప్రోత్సహిస్తే వాళ్లే లబ్ధ ప్రతిష్ఠులు కాగలరు’ అనేది రామోజీరావు పాలసీ. ఆ పాలసీ ప్రకామే.. నలభయ్యేళ్ల కిందట.. శ్రీధర్ కూడా కార్టూనిస్టు అవతారం ఎత్తారు. అలాగే ఇప్పుడు కూడా మరొక కార్టూనిస్టును పాకెట్ కార్టూన్లకు తగినట్లుగా తీర్చడానికి ఈనాడు కసరత్తు చేస్తోంది.

సంస్థలో ఉన్న కార్టూనిస్టులను, ఆర్టిస్టులను పరిశీలిస్తున్నారు. శ్రీవల్లి వంటి సీనియర్ కార్టూనిస్టులు ఉన్నప్పటికీ.. వారిని పరిగణించడం లేదు. శ్రీనివాస్ అనే ఆర్టిస్ట్ ను అడిగినప్పటికీ.. రాజకీయ కార్టూన్లమీద ఆసక్తి లేదని చెప్పినట్లు సమాచారం. తెలుగువెలుగు సాహిత్య పత్రికను మూసివేసిన తర్వాత.. ఆ విబాగం నుంచి ఈనాడులోకి వచ్చిన సీతారాం, మాకిరెడ్డి అనే కార్టూనిస్టులను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే రవి అనే కార్టూనిస్టు కూడా కార్టూన్లు గీస్తున్నారు. ప్రస్తుతానికి ఎడిటోరియల్ పేజీలో వచ్చే వ్యాసాలకు రవి నే కార్టూన్లు గీస్తున్నారు.
కొత్త ముద్ర చూపించగలరా?
కార్టూన్లు గీయగలవారిని ఇంకా బాగా తీర్చిదిద్దడం సాధ్యమే గానీ.. పదునైన కొత్త ముద్ర చూపించగలరా? అనేది ప్రశ్న. ఆ మాటకొస్తే.. కార్టూన్లలో ఏ ఇద్దరిని గమనించినా.. ఎవరి శైలి వారిదే అన్నట్లుగా ఉంటుంది. అలాంటప్పుడు.. శ్రీధర్ శైలిని అనుకరించకుండా.. ‘సొంత గీత’ ఉన్న వారిని ప్రోత్సహించాలి. డిజిటల్ పెన్ తో ఆ ఫార్మాట్ లోనే ఎక్కువగా గీసే శ్రీనివాస్ కు రాజకీయ కార్టూన్ల ఆసక్తి లేదు. మాకిరెడ్డి, సీతారాం లను పరిశీలిస్తున్నారు. రవితో ఇప్పటికే ఎడిట్ పేజీ కోసం గీయిస్తున్నారు.
కార్టూనిస్టు రవి గీత ఇంచుమించుగా శ్రీధర్ కార్టూన్ ను అనుకరిస్తున్నట్టే ఉంటుంది. లోతుగా గమనించని వారికి అది శ్రీధర్ గీసినదే అని భ్రమ కలుగుతుంది కూడా. అలాంటి అనుకరణను సంస్థ ఇష్టపడుతుందా, లేదా, కొత్తగీతతో పాఠకులను రంజింపజేస్తుందా తెలియదు. ఎడిటోరియల్ పేజీలో ప్రస్తుతానికి క్రమ తప్పకుండా రవితోనే గీయిస్తున్నందువల్ల.. అతనికే తొలి ప్రాధాన్యం ఇస్తారేమో అనికూడా అనిపిస్తుంది.
ప్రస్తుతానికి ‘ఇదీ సంగతి’ పాకెట్ కార్టూన్లు ఆగాయి. తిరిగి ఎప్పుడు మొదలవుతాయో తెలియదు. జరుగుతున్న కసరత్తును బట్టి ఈ మాకిరెడ్డి, సీతారాం, రవి.. ముగ్గురిలో ఒకరికే శ్రీధర్ వారసుడిగా.. ఈనాడు కార్టూన్ల ప్రస్థానాన్ని కొనసాగించే బాధ్యత దక్కుతుంది.
Discussion about this post