ఏ రాజకీయ పార్టీ అయినా.. కార్యకర్తలను నాయకులను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే అలా కార్యకర్తల్ని కాపాడుకునే ప్రయత్నాలు పార్టీకే సమాధి కట్టేలా ఉండకూడదు. పార్టీ పరువును బజారుకీడ్చకూడదు. కొందరు వ్యక్తులు పార్టీ ప్రతిష్ఠకు కళంకంగా తయారవుతారని అర్థమైనప్పుడు.. వారిని తక్షణం వదిలించుకోవడం పార్టీకి మంచిది.
విశాఖ జిల్లా సీలేరులో ఒక దివ్యాంగురాలైన వివాహితపై అత్యాచారం జరిగింది. ఆమె ఒంటరిగా ఉండడం గమనించిన ప్రబుద్ధుడు అర్ధరాత్రి సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులకు చెబితే చంపుతానని కూడా బెదిరించాడు. ఆమె దివ్యాంగురాలు. మరునాడు ఆమె తల్లి ఇంటికి తిరిగివచ్చిన తర్వాత విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నాళ్ల వెంకటరావు అనే సదరు ప్రబుద్ధుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముద్ర ఉన్న నాయకుడు, గతంలో గ్రామ స్థాయి పార్టీ పదవులు కూడా నిర్వహించిన వాడు ఇలా చేయడంతో ఇప్పుడు పెద్ద రాద్ధాంతం అవుతోంది. విపక్షాలంతా మండిపడుతున్నాయి.
పార్టీ కార్యకర్తగా ముద్ర ఉన్న వాళ్లంతా సచ్ఛీలురు అయిఉండాలంటే ఏ పార్టీకీ సాధ్యం కాదు. అలాగే కార్యకర్తలు ఏదైనా తప్పు చేసినప్పుడు, నేరానికి పాల్పడినప్పుడు వారి పార్టీని నిందించడం కూడా కరెక్టు కాదు. అయితే అలాంటి నేరాలు చేసిన వాడు తమ పార్టీలో ఉన్నాడని తెలిసిన తర్వాత పార్టీ చర్య తీసుకోకపోవడం కూడా కరెక్టు కాదు.
తెలుగుదేశం ఈ విషయంలో కొంచెం ఎక్కువ రాద్ధాంతం చేస్తోంది. తెలుగు మహిళ సారధి వంగలపూడి అనిత మాట్లాుడుతూ నాయకుల అండ చూసుకుని ఇలాంటి అత్యాచారాలకు పాల్పడుతున్నారని అంటున్నారు. ఇలాంటి రాజకీయ ఆరోపణలు కరెక్టు కాదు.
కానీ, అమ్మాయిల మాన, ప్రాణరక్షణ కోసం దిశ వంటి కఠినమైన చట్టాన్ని కార్యరూపంలోకి తెచ్చే ప్రయత్నంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి తప్పులు చేసిన వారు తన పార్టీలో ఉంటే ఉపేక్షించడం ఎంతమాత్రమూ కరెక్టు కాదు. జగన్ సంకల్పిస్తున్న దిశ అనే చట్టానికి ఇలాంటి పార్టీ కార్యకర్తలు దిష్టిచుక్కలే అంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి వారిని తక్షణం పార్టీనుంచి తొలగిస్తే పార్టీ ప్రతిష్ఠ పెరుగుతుంది.
సాధారణంగా ఇలాంటి సమయంలో కార్యకర్తలపై చర్య తీసుకోడానికి పార్టీలు వెనకాడతాయి. విపక్షాల ఆరోపణలకు తలొగ్గినట్టు అవుతుందని, తాము చర్య తీసుకుంటే.. అది తమ విజయంగా విపక్షాలు ప్రచారం చేసుకుంటాయని అనుకుంటాయి. అలాంటి సంశయాల జోలికి పోకుండా వైఎస్సార్సీపీ కఠినంగా వ్యవహరిస్తే బాగుంటుంది.
ఇవి కూడా చదవండి :
ఏడుకొండవాడి దర్శనానికి కండీషన్లివే!
Rose Day : రోజాపూల దినోత్సవం కాదు, మరేంటి?
జగన్ సర్కారు పరువుపోయే ఎదురుదెబ్బ!
బీజేపీతో కయ్యానికి సై అంటున్న పవన్ కల్యాణ్
70 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు ఈసారి నో టికెట్
నాయకుల మీద అవినీతి ఆరోపణలు, దందాలు సాగిస్తున్న ఆరోపణలు వచ్చినప్పుడు పార్టీ స్పందించకపోయినా.. అది రాజకీయ వ్యూహంగానే ఉంటుంది. ప్రత్యర్థుల చేతికి అస్త్రాలు ఇవ్వకుండా తీసుకునే జాగ్రత్తలాగానే ఉంటుంది. కానీ.. అమ్మాయిలపట్ల, దివ్యాంగురాలి పట్ల అమానుషంగా వ్యవహరించిన ఇలాంటి దిష్టిచుక్కలను తొలగించుకుంటేనే పార్టీకి మంచిపేరు దక్కుతుంది.
.

Discussion about this post