ముఠాలకు, కుటుంబ రాజకీయాలకు పెట్టింది పేరైన కాంగ్రెస్ పార్టీలో ఈసారి తెలంగాణ ఎన్నికలను ఎదుర్కొనే వేళలో ఎలాంటి అంతర్గత కుమ్ములాటలు చోటుచేసుకోబోతున్నాయి. పార్టీ కి ఉపయోగపడేలాగా.. కూటమి జట్టుగా ఉండేలాగా.. పార్టీ కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోవాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒక కుటుంబానికి ఒకటే టికెట్ ఇవ్వాలని కూడా కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఇది పార్టీ శ్రేయస్సు కోరే నిర్ణయమే కావొచ్చు గానీ.. దీనిని పురస్కరించుకుని పార్టీలో కుమ్ములాటలు పెరగవచ్చునని కూడా పలువురు విశ్లేషిస్తున్నారు. ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసే చర్యల్లో భాగంగా.. పీసీసీ నాయకులు నగర శివార్లలోని ఒక రిసార్టులో సమావేశమై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక కుటుంబానికి ఒకే టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ నెల 16 కల్లా మొత్తం పూర్తిస్థాయి జాబితాను ప్రకటించాలని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. పొత్తుల విషయంలో ఏమైనా ప్రతిష్టంభన ఏర్పడితే.. కొన్ని స్థానాలను పెండింగ్ లో పెట్టే అవకాశం కూడా ఉంది. మొత్తానికి 16వ తేదీన జాబితా ప్రకటించడం మాత్రం ఖరారు అని చెబుతున్నారు. గండిపేటలోని ఓ రిసార్టులో సమావేశమైన ప్రదేశ్ ఎన్నికల కమిటీ(పీఈసీ).. సీట్ల కేటాయింపు, మిత్రపక్షాలతో సర్దుబాటుపై చర్చించింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ కుంతియా, కార్యదర్శులు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.
పార్టీ పట్ల విధేయత, గెలిచే సత్తా ఉన్న నేతలనే పోటీకి దింపాలని పీఈసీ నిర్ణయించింది. ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు అభ్యర్థులతో జాబితాను పీఈసీ రూపొందిస్తుంది. అనంతరం ఈ జాబితాను ముగ్గురు సభ్యుల స్క్రీనింగ్ కమిటీకి పంపనుంది. పరిశీలన అనంతరం ఈ జాబితా నుంచి తుది అభ్యర్థిని ఏఐసీసీ ఎన్నికల కమిటీ ఎంపిక చేస్తుంది. కాగా, పీఈసీ సమావేశం సందర్భంగా బలమైన సీట్లను మిత్రపక్షాలకు వదులుకోవద్దని పార్టీ సీనియర్ నేతలు గట్టిగా వాదించినట్లు సమాచారం. ఈసారి కూడా ఒక కుటుంబంలో ఇద్దరికి టికెట్లు ఇవ్వకూడదని నిర్ణయించారు. అయితే గతంలో రెండు టికెట్లు పొందిన నేతలకు ఈసారి కూడా మినహాయింపు ఇచ్చేందుకు ఆమోదముద్ర తెలిపారు.
ఉత్తమ్ భార్య సేఫ్
కుటుంబానికి ఒకటే టికెట్ ఇవ్వాలని నిర్ణయించడం నిజానికి కాంగ్రెస్ పార్టీకి మంచి సూచిక. పార్టీలో గుత్తాధిపత్యం కాకుండా.. అందరికీ అవకాశాలు కల్పించే వాతావరణానికి సూచిక. అయితే.. గతంలో కూడా 2014లో ఇలాంటి ఉబుసుపోని నిర్ణయం చేశారు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యెకు మాత్రం కోదాడ టికెట్ ఇచ్చారు. ఆ రెండు సీట్లు వారు గెలిచారు. ఇప్పుడు కూడా ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అంటూనే.. గతంలో రెండు టికెట్లు పొందిన వారికి మినహాయింపు అని ఆ క్లాజ్ కు మినహాయింపు ఇస్తున్నారు. అంటే ఉత్తమ్ భార్య టికెట్ మాత్రం సేఫ్ అన్నమాట. మరో వైపు అంతేస్థాయిలో ఆశలు పెట్టుకున్న ఇతర నాయకులకు దెబ్బ పడుతుంది.
కొండా వారు ఏమంటారో?
కొండా సురేఖ, మురళి దంపతులు ఈ ఒక్కటే టికెట్ నిర్ణయాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది. కొండా సురేఖ సిటింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ టికెట్ నిరాకరించడం ద్వారా కేసీఆర్ ఆమెను పొమ్మనకుండానే పొగ పెట్టారు. దానికి తగ్గట్టుగానే సురేఖ కూడా స్పందించారు. కేసీఆర్ మీద విపరీతంగా విమర్శలు చేయడంతో పాటు, ఆమె ఎంచక్కా తిరిగి తన మాతృసంస్థ కాంగ్రెస్ లో చేరిపోయారు. ఆ సందర్భంగా తమకు కేసీఆర్ ఒక్క టికెట్ ఇవ్వలేదని, రాబోయే ఎన్నికల్లో తమ కుటుంబంనుంచి తమ దంపతులతో పాటు, కూతురు కూడా కలిపి ముగ్గురం పోటీచేస్తాం అన్నారు. ఇప్పుడు ఒకటే దక్కేలా ఉంది. ఆమె ఎలా ఫైర్ అవుతారో చూడాలి.
కోమటిరెడ్డి మంటలు తప్పవా?
కోమటిరెడ్డి కుంటుంబం కూడా సోదరులిద్దరికీ టికెట్లు ఆశించే స్థితిలోనే ఉంది. ప్రస్తుతానికి కోమటిరెడ్డి రాజగోపాల్ ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ.. ఎమ్మెల్యేగానూ బరిలో దిగే ఉద్దేశంతో ఉన్నారు. అయితే ఇప్పటికే ఆయన మీద కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ గట్టిగా కన్నేసింది. అసలు పీసీసీ అయితే ఆ కుటుంబాన్ని పూర్తిగా పక్కన పెట్టినట్టే ప్రస్తుత వాతావరణం కనిపిస్తోంది. దీనిపై ఇప్పటికే కోమటిరెడ్డి సోదరులు మండిపడుతున్నారు. పార్టీకోసం పనిచేసేవారిని దూరం చేసుకుంటున్నారు అంటూ తెగడుతున్నారు. ఇప్పుడు కుటుంబానికి ఒకటే టికెట్ అంటూ వారికి నిరాకరిస్తే.. మరింత మంటలు చెలరేగుతాయనడంలో సందేహం లేదు. వెంకటరెడ్డికి మాత్రం టికెట్ ఇస్తే, రాజగోపాల్ అలిగే అవకాశం పుష్కలంగా ఉంది.
.
Discussion about this post