ప్రపంచంలోని మిగిలిన ప్రాణి కోటి అందరికంటె కూడా మనిషిని వేరు చేసి, ఉన్నతంగా నిలబెట్టే అంశాలు చాలా ఉంటాయి. వాటిలో ‘తర్కం’ కూడా ఒకటి. మనిషికి మాత్రమే ఆలోచన ఉంటుంది. (లేదా మనిషికి ఉన్న ఆలోచన మాత్రమే మనకు తెలుసు). ప్రతి మనిషీ, తాను ఎలాంటి పని చేసినా సరే.. దాని చుట్టూ, దానిని సమర్థించుకుంటూ ఒక అందమైన వాదన/ తర్కం తయారు చేసుకుంటాడు.
ఇంత వరకు చాలా సహజపరిణామం. కానీ.. ఆ తర్కాన్ని, వాదనని సహేతుకంగా, జ్ఞానంతోనే నిర్మించుకున్నాడా.. లేదా, అడ్డగోలుగా తయారు చేసుకున్నాడా? అనేది ప్రధాన చర్చ. ఒకసారి తన పనులను సమర్థించే వాదన తయారు చేసుకున్నాక- అందులోంచి బయటకు వస్తాడా లేదా, ఇతరులు చెప్పే మాటలను ఆలకిస్తాడా లేదా అనేది అతడి మూర్ఖత్వమూ, జ్ఞానమూ స్థాయిని బట్టి ఉంటుంది.
ఇదే విషయాన్ని ఒక సుభాషితం ఇంకొక రీతిలో మనకు తెలియజెబుతుంది.
అజ్ఞః సుఖమ్ ఆరాధ్యః సుఖతరమ్ ఆరాధ్యతే విశేషజ్ఞః
జ్ఞానలవదుర్విదగ్ధం బ్రహ్మాపి నరం న రంజయతి
ఏ మాత్రం విషయ పరిజ్ఞానం లేని వాడికి చెప్పి ఒప్పించడం చాలా సులభం. ఎంతో జ్ఞానం ఉన్న మేధావికి చెప్పి ఒప్పించడం కూడా చాలా సులభం. కానీ మిడిమిడి జ్ఞానంతోనే అహంకారంగా ప్రవర్తించేవాడికి చెప్పి ఒప్పించడం బ్రహ్మ తరం కూడా కాదు. – అనేది శ్లోకభావం
నాకేమీ తెలియదు అనే క్లారిటీ ఉండే అజ్ఞానులు (అమాయకులు) ఉంటారు. ఏం చెప్పినా సరే.. చెప్పిన మాట వారికి వెంటనే అర్థమవుతుంది. తెలిసిన వారు ఎటూ గ్రహిస్తారు! కాకపోతే తెలిసీ తెలియని వారే.. ‘నాకు సర్వం తెలుసు’ అనే ముసుగులో ఆత్మవంచన చేసుకుంటున్న వారే.. తర్కానికి దిగుతారు. వారిని ఒప్పించాలంటే.. వారిని తయారుచేసిన బ్రహ్మ వల్ల కూడా కాదు.
ముందు చెప్పుకున్నట్టు ప్రతిమనిషికీ ఒక వాదన ఉంటుంది. ‘నాకు తెలుసు’ అనే నమ్మకం ప్రతి మనిషికీ ఉంటుంది. ఈ నమ్మకం అందరికీ ఉండాలి కూడా. అది కూడా లేకపోతే మనుగడ చాలా కష్టం.
‘నాకు తెలిసినది సత్యం’ అనుకునే వాళ్లు కొందరుంటారు.
‘నాకు తెలిసినది సత్యం- కానీ, సత్యం ఇంకా చాలా ఉండొచ్చు’ అనే స్పృహ ఉండే మధ్యేవాదులు కొందరుంటారు.
‘నాకు తెలిసినది మాత్రమే సత్యం- ఇంకేమీ లేదు’ అనుకునే మిడిమిడి జ్ఞానవాదులు కొందరుంటారు.
‘నాకు తెలిసినది మాత్రమే సత్యం- మిగిలిన వాళ్లకు తెలిసినదెల్లా అసత్యం. మిగిలిన వాళ్లకు ఏమీ తెలియదు’ అనుకునే అహంకారులూ కొందరుంటారు.
ఈ చివరి బాపతు మనుషులతో వేగడం చాలా కష్టం.
తెలిసీతెలియని అర్థజ్ఞానంతో మిత్ర బృందాలలో, చర్చలలో చిరాకు పుట్టించేది వీళ్లే. ‘జ్ఞానలవ’ అంటే విషయ పరిజ్ఞానం చాలా తక్కువే అయినా.. ‘దుర్విదగ్ధం’- మహా గర్వంతో అలరారే వాళ్లు అంటూ సుభాషితకారుడు వర్ణించింది వీళ్ల గురించే! ఇలాంటి వాళ్లు ప్రతిరోజూ, ప్రతి ఒక్కరికీ నిత్యజీవితంలో తారసపడుతూనే ఉంటారు. వారి పట్ల ఒక రకమైన విరక్తి కలిగిస్తూ ఉంటారు. అలాంటి వారికి ఒక ప్రయత్నం తర్వాత.. రెండోసారి చెప్పకపోవడమే, వారితో వాదించకపోవడమే మంచిది.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సరదాగా ఓ మాట వాడుకలో ఉంటుంది.
‘‘తెలీని వాడికి చెప్పొచ్చు. తెలిసిన వాడికీ చెప్పొచ్చు. తెలిసీ తెలియని వాడికి కూడా కష్టపడి చెప్పవచ్చు. కానీ.. ఫలానా వాడికి మాత్రం చెప్పలేం’’ అని! అంటే మిడిమిడి జ్ఞానంతో చిరాకు పుట్టించేలా వాదించే వారు మాత్రమే కాదు. అంతకంటె మూర్ఖులు, మరొకరితో పోల్చడానికి కుదరనంత మూర్ఖులు కూడా మనకు తారసపడుతూనే ఉంటారు. వారి జోలికి వెళ్లకుండా ఉండడం మాత్రమే కాదు.. వారినుంచి దూరంగా వెళ్లిపోవడం, తక్షణ కర్తవ్యంగా వారిని వదిలించుకోవడం.. చాలా మంచిది, ఆరోగ్యకరం, శ్రేయస్కరం.
శుభోదయం.
.

Discussion about this post