రాజకీయంగా వారిద్దరూ శత్రుపక్షాలకు చెందిన నాయకులే అయి ఉండవచ్చు. సభలో ఒకరి మీద ఒకరు కత్తులు దూస్తుండవచ్చు.. ఒకరి పార్టీని మరొకరు దునుమాడుతూ ఉండవచ్చు. రాజకీయ వైషమ్యాలు ఎలా ఉన్నప్పటికీ.. బేసిగ్గా వారిద్దరూ మనుషులు! ఒకరి పట్ల మరొకరికి గౌరవం, మర్యాద ఉన్నవారు. అందుకే అనుకోకుండా జరిగినా సరే.. వారిద్దరు తారసపడడం చాలా మర్యాదపూర్వంగా, గౌరవప్రదంగానే కనిపించింది.
ఈ అరుదైన సంఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు- చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పరస్పరం తారసపడ్డారు. పలకరించుకోలేదు, చెట్టపట్టాలు వేసుకుని ముచ్చట్లు చెప్పుకోలేదు. కానీ.. ఇద్దరూ తమ తమ గౌరవాన్ని మాత్రం నిలబెట్టుకున్నారు. అంతేకాదు.. రాజకీయాల గౌరవాన్ని కూడా నిలిపారు.
ఒకవైపు చంద్రబాబునాయుడు– నలభయ్యేళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న, పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ వేత్త. మరొకరు చెవిరెడ్డి భాస్కరరెడ్డి.. తిరుగులేని నిరాడంబరత సొంతమైన, ప్రజాబలం ఉన్న, ప్రతికూలతలను తట్టుకుంటూ విజయం సాధించే ఎమ్మెల్యే! వీరిద్దరూ తిరుపతి సమీపంలో, ప్రమాదం అంచున ఉన్న రాయలచెరువు వద్ద పరస్పరం తారసపడ్డారు.
ఇది కూడా చదవండి : మోడీ, చంద్రబాబు.. ‘ఈ జన్మలో చూడలేం’ అనుకున్నది చూపించారు
చట్టాలు తయారు చేసే స్థానంలో ఉంటూ బండబూతులు తిట్టుకునే సిగ్గుమాలిన రాజకీయం
రాయలచెరువు వద్ద గండి పడిన ప్రాంతంలో తీసుకుంటున్న చర్యలను పరిశీలించడానికి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి వెళ్లారు. రాయలచెరువు పరిశీలించి తిరుగు ప్రయాణం అవుతుండగా అక్కడకు వస్తున్న చంద్రబాబుకు- చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎదురుపడ్డారు. ఆ సమయానికి ముందుజాగ్రత్తగా చెరువు వద్దకు అధికారులు తరలించిన ఇసుకబస్తాల మీద రోడ్డు పక్కగా కూర్చుని ఉన్నారు. ఆయన చుట్టూ అనుచరగణం ఉన్నారు. ఆ సందర్భంలో చంద్రబాబు కాన్వాయ్ అటుగా వచ్చింది.
చెవిరెడ్డి భాస్కర రెడ్డి లేచి నిల్చున్నారు. కాన్వాయ్ లో చంద్రబాబు ఉన్న వాహనం తను ఉన్నచోటుకు రాగానే.. ఆయనను చూసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెండు చేతులూఎత్తి నమస్కరించారు. చంద్రబాబు కూడా మొహం తిప్పుకోలేదు. చూసీ చూడనట్టు విస్మరించలేదు. తన వాహనంలో నుండి చెవిరెడ్డికి తిరిగి చంద్రబాబు కూడా ప్రతి నమస్కారం చేశారు. చూస్తున్న వారు మాత్రం ఒకరి గౌరవం ఒకరు కాపాడుకున్నారని అనుకున్నారు.
ఇదీ చదవండి : కోవూరులో మంత్రి బాలినేని అవమానం వెనుక అసలు కారణాలు ఇవే
ఇది పెద్ద విషయం కాదు గానీ..
మామూలుగా అయితే ప్రత్యర్థి పార్టీలకు చెందిన ఇద్దరు నాయకులు పరస్పరం ఎదురుపడితే.. కేవలం నమస్కార ప్రతినమస్కారాలు మాత్రమే కాదు. ఇంతకంటె ఆదరంతో పలకరించుకోవడం కూడా చాలా మామూలు సంగతి. అలాంటప్పుడు.. చంద్రబాబు- చెవిరెడ్డి కేవలం నమస్కారాలు పెట్టుకోవడం విశేషం కాదు.
కానీ.. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితి వేరు! తెలుగుదేశం- వైఎస్సార్ కాంగ్రెస్ అనే ముద్ర కనిపిస్తే చాలు.. కత్తులు దూసుకునే రీతిలో వైషమ్యాలు ముదిరిపోయాయి. ప్రత్యేకించి.. ఇటీవలి శాసనసభ ఎపిసోడ్ తర్వాత.. తన భార్యను అవమానకరంగా సభలో మాట్లాడారని చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్న తర్వాత.. వైసీపీ ఎమ్మెల్యేలు పలువురు ఆ తర్వాత కూడా చంద్రబాబును చాలా నీచంగా తూలనాడిన, విమర్శించిన తర్వాత.. ఇరు పార్టీల మధ్య ఏర్పడిన అప్రకటిత యుద్ధ వాతావరణం వేరు.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
చంద్రబాబునాయుడు అనుభవం రీత్యా- ప్రత్యర్థి పార్టీ వారితోనూ గౌరవంగా ప్రవర్తించడం తెలిసిన నాయకుడు. చెవిరెడ్డి భాస్కర రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ లో, చాలా మందితో పోలిస్తే మితవాద నాయకుడు. రాజకీయ విమర్శల విషయంలో ఎంతకైనా చెలరేగే నాయకుడే గానీ.. నీచమైన భాష ఉపయోగించకుండా.. విమర్శలు చేసే నేతగానే గుర్తింపు ఉంది. అందుకే ఈ ఇద్దరూ తారపడిన సందర్భం చాలా మంచిగా కనిపించింది.
చంద్రబాబు వయసుకు, అనుభవానికి తగినట్లు ఆయనను చూడగానే రెండు చేతులూ ఎత్తి నమస్కారం చేయడం ద్వారా చెవిరెడ్డి తన ‘మర్యాద’ను నిలబెట్టుకున్నారు. చంద్రబాబు కూడా, ఇప్పుడున్న విషపూరిత వాతావరణంలో మొహం తిప్పుకోకుండా, కారులోనుంచే అయినప్పటికీ చేతులెత్తి నమస్కరించి తన ‘గౌరవం’ కాపాడుకున్నారు.
ఈ ఇద్దరు నాయకులు తారసపడిన సందర్భాన్ని ఈ వీడియోలో చూడండి..
Discussion about this post