అందరికీ నా శుభాభివందనములు.
ముందుగా, రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన మీ అందరికీ నా శుభాకాంక్షలు. 2019 సాధారణ ఎన్నికల తర్వాత ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి నా అభినందనలు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. సుస్థిరత, పారదర్శకత, అభివృద్ధిని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రజల విజ్ఞతతో తమ ఓటు హక్కు వినియోగించి, ప్రజలందరికి సేవ చేసే అధికారం మనకు కల్పించారు.
నూతన ప్రభుత్వానికి తక్షణ సమస్యలపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. వాటిలో కొన్ని రాష్ట్ర విభజన పర్యవసానంగా ఏర్పడినవి. మిగిలినవి విభజనానంతరం తలెత్తిన సవాళ్ళ అసంగతమైన నిర్వహణకు పర్యవసానాలుగా ఉన్నాయి. మానవ మరియు భౌతిక వనరుల రెండింటిని దుర్వినియోగపర్చడం రాష్ట్రం యొక్క దుస్థితిని మరింత తీవ్రతరం చేసింది. నా ప్రభుత్వానికి దాదాపు ఖాళీ ఖజానా సంక్రమించినందున ప్రజా ధనాన్ని మరియు అన్ని సహాయక వనరులను పూర్తి జవాబుదారీగా, సమర్ధవంతంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఏర్పడింది. అయినప్పటికీ, సమస్యలను అధిగమించి, ప్రజానీకానికి సంతృప్తకరమైన ప్రజా సేవలు అందించేటట్లు చూడగలమని నా ప్రభుత్వం విశ్వసిస్తున్నది.
ప్రజలు గత అయిదు సంవత్సరాలలో తమ ఆకాంక్షలు నెరవేరలేదని భావించి 21వ శతాబ్దంలో తమను ముందుకు తీసుకువెళ్లేందుకు మార్పు కోసం ఎదురుచూస్తున్న సమయంలో, మంచి మరియు సుపరిపాలన కోసం ఐదు కోట్ల మంది ప్రజల ఆశలతో నూతన ప్రభుత్వం బాధ్యతలను చేపట్టింది.
ఈ నూతన ప్రభుత్వం శాసనసభలో తాజా మరియు అనుభవజ్ఞులైన గౌరవ సభ్యుల సంపూర్ణ సమ్మేళనంగా ఉంది. సుపరిపాలన లక్ష్యంతో సరైన విధానాలను రూపొందించడంలో భాగస్వాములయ్యే సభ్యులందరికీ నేను మరోసారి స్వాగతం పలుకుతున్నాను. వారు ఈ రాష్ట్ర విలువలను మరియు సాంస్కృతిక వారసత్వాన్ని కూడా పెంపొందిస్తారని నేను విశ్వసిస్తున్నాను.
అవినీత రహిత, సమ్మిళిత పాలన ద్వారా అణగారిన, వంచించబడిన వారి ఉన్నతికి నా ప్రభుత్వం కట్టుబడి ఉంది. సంపద ఉన్న ప్రాంతాలలో గతంలో నిర్లక్ష్యానికి గురైన జనాభా వర్గాలు ఉన్నాయి. ఈ వర్గాలకు అదనపు సహాయం అందించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన సమస్యలు 5 సంవత్సరాల తరువాత సైతం సవాళ్లు విసురుతున్న సందర్భంలో, ఉమ్మడి ప్రయత్నాలు చేపట్టడం మరింత అత్యవసరం. దుర్భల మరియు అనాదరణకు గురైన వర్గాలను ప్రధాన జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి ఒక ప్రత్యేక, కేంద్రీకృత చర్యను చేపట్టాల్సిన అవసరం ఉంది.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 మరియు ఇతర చర్చా వేదికలలో పేర్కొన్న అన్ని హామీలు మరియు వాగ్దానాలు అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించడానికి మా ప్రయత్నాలు మా అజెండాలో అగ్రస్థానంలోనే ఉంటాయి. వాటిలో, ఇతర వాటితో పాటుగా రాష్ట్రానికి ప్రత్యేక కేటగరీ హోదా, సత్వరమే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం మరియు అవసరమైన అదనపు నిధులతో రాష్ట్రానికి మద్దతు అందించే అంశాలు కూడా చేరివున్నాయి. రాష్ట్ర విభజన కారణంగా ఆదాయ ఆర్జన, ఉపాధి అవకాశాలు కోల్పోవడం, ప్రధాన ఆరోగ్య మరియు విద్యా సంస్థలను మరియు సామాజిక మౌలిక సదుపాయాలను కోల్పోవడం కారణంగా జరిగిన నష్టాన్ని పూర్తిగా పూరించాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
రాష్ట్ర ప్రజలకు చేసిన అన్ని వాగ్దానాలను నెరవేర్చడానికి నా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. ఆ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించడం ప్రోత్సాహకరంగా ఉంది. మార్పు కోసం – మెరుగైన మార్పు కోసం నిరాశ, నిస్పృహలతో ఎదురుచూస్తున్న ప్రజలలో ఆనందం మరియు సంతోష భావాన్ని కలిగించడం సముచితంగా ఉంటుంది. నా ప్రభుత్వం సమస్యలను పరిష్కరించడానికి మరియు చేసిన వాగ్దానాలను నెరవేర్చడానికి స్పష్టమైన దృక్పథాన్ని మరియు చర్య తీసుకోదగిన ప్రణాలికలను కలిగి ఉంది. ఈ ప్రభుత్వం వ్యవస్థను పూర్తిగా అధునీకరించి దేశానికి ఆదర్శంగా నిలిచేందుకు కృషి చేస్తుంది. నా ప్రభుత్వం ఈ ప్రక్రియలో ద్విముఖ విధానాన్ని అనుసరిస్తుంది. అవినీతిని నిర్మూలించి సేవల బట్వాడా యంత్రాంగాన్ని ప్రజల ముంగిటకు తెచ్చేందుకు ప్రభావంతమైన, సమర్ధవంతమైన చర్యల చేపడుతుంది.
రాష్ట్రాన్ని అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే ప్రక్రియలో వినూత్న చర్యలు చేరివున్నాయి. ఇవి ఇతర రాష్ట్రాలు అనుసరించేందుకు ఆదర్శస్రాయంగా ఉంటాయి.
మొదట, మునుపటి పాలనా నియమాలకు విరుద్ధంగా, నా ప్రభుత్వం పూర్తి స్థాయిలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని అగ్రస్థానంపై ఉంచుతుంది. ఈ దశలో ప్రధాన చర్యగా నా ప్రభుత్వం ప్రప్రథమంగా రాష్ట్రంలో దర్యాప్తులను నిర్వహించేందుకు సిబిఐకి గత ప్రభుత్వం ఉపసంహరించిన సాధారణ సమ్మతిని పునరుద్ధరించింది.
రెండవది, నా ప్రభుత్వం పూర్తి పారదర్శకతను విశ్వసిస్తుంది. దీనిని కట్టుదిట్టం చేయడానికి, ఇప్పటి వరకూ వినని చర్యగా టెండర్లను ఇవ్వడానికి ముందే ప్రతి భారీ టెండరును పరిశీలించేందుకు జ్యుడిషియల్ కమీషన్ సహాయాన్ని నా ప్రభుత్వం కోరింది. పారదర్శకతను పెంపొందించడానికి మరియు అవినీతికి ఆస్కారం లేకుండా చేయడానికి, ప్రజల ఫీడ్ బ్యాక్ ను పొందేందుకు ఒక వారంపాటు పబ్లిక్ డొమైన్ లో ఈ పత్రాలను కమీషన్ ఉంచుతుంది. తగు జాగ్రత్త తరువాత, కమీషన్ అవసరమైన మార్పులను చేర్చి, తదుపరి చర్య కోసం టెండర్ పత్రాన్ని తిరిగి ఇస్తుంది.
మూడవది, ఏవేని కులం, రంగు, మతం లేదా రాజకీయ అనుబంధంతో సంబంధం లేకుండా అర్హులైన వారికి సంక్షేమ పథకాలను పంపిణీ చేస్తూ నా ప్రభుత్వం స్వర్గీయ డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారిచే తీసుకుని రాబడిన సంతృప్త మార్గాన్ని అనుసరిస్తుంది. అవినీతికి పాల్పడే అవకాశం ఉన్న విచక్షణ అధికారాన్ని తొలగించేలా ఇది కట్టుదిట్టం చేస్తుంది. నాల్గవది, అధిక ధర టెండర్ల ద్వారా ప్రభుత్వ ధనం వృథా కాకుండా నివారించేందుకు నా ప్రభుత్వం చర్యలను చేపడుతుంది. టెండర్లను, కాంట్రాక్టులను కేటాయించడంలో ద్రవ్యోల్బణ ధోరణులను నిపుణుల కమిటీ పరిశీలించి, అవసరమైన చోట దిద్దుబాటులను చేయడమవుతుంది. ఈ దశలో అవసరమైతే రివర్స్ టెండరు విధానాన్ని చేపట్టడమవుతుంది. సముచిత కార్యవిధానాలను పాటించడానికి, ఖర్చును సమర్ధవంతంగా తగ్గించడానికి మరియు అధిక ధర బిడ్డింగ్ లను నివారించడానికి ఉత్తరోత్తర ఈ విధానం దేశంలో ట్రెండ్ సెట్టర్ గా ఉంటుంది.
నా ప్రభుత్వం సేవల బట్వాడా యంత్రాంగాన్ని తిరిగి పరిశీలిస్తుంది. గ్రామ సేవకుడు విధానాన్ని తీసుకురావాలని ప్రతిపాదించడమయింది. అందులో వివిధ ప్రభుత్వ పథకాలను ఇంటివద్దకే అందించేలా 50 కుంటుంబాల కోసం అదే గ్రామం లేదా వార్డు నుండి ఒక్కో సేవకుడిని కేటాయించడమవుతుంది. అతని పరిధిలోని ప్రజలయొక్క ఇబ్బందులను గ్రామ సచివాలయానికి తెలియజేసేందుకు కూడా ఆ సేవకుడు బాధ్యత వహించడమవుతుంది. ప్రతి గ్రామ సేవకునికి నెలకు రూ.5,000/-లు గౌరవ వేతనం అందించడమవుతుంది మరియు ఈ వ్యవస్థలో ఏ విధమైన అవినీతిని నా ప్రభుత్వం సహించదు. ఏదైనా సమస్యను వారు ఎదుర్కొన్నట్లయితే, ఈ సేవకులపై ప్రజలు కాల్ సెంటరులో ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. నూటికి నూరు శాతం పారదర్శకత మరియు సంతృప్తి ఉండేలా చూడటానికి ఈ ప్రక్రియను సిఎంఓ నేరుగా పర్యవేక్షిస్తుంది. గ్రామ సచివాలయం ప్రజలకు పాలనను అందుబాటులోకి తీసుకొస్తుంది. పౌరుడి అభ్యర్ధనను 72 గంటలలో పరిష్కరిస్తుంది. ఇది 10 విద్యావంతులైన యువతకు ఉపాధిని కల్పిస్తుంది.
ఎన్నికల ప్రణాలికను బహిరంగంగా ప్రదర్శించడం ద్వారా మరియు దానిని ఒక పవిత్ర పత్రంగా పరిగణించి, నా ప్రభుత్వం తనకు తాను బాధ్యత వహిస్తుంది. ఎటువంటి మార్పు లేకుండా దాని అమలుకు కట్టుబడి ఉంటుంది. ప్రతి ప్రభుత్వ శాఖ అన్ని వాగ్ధానాలను నెరవేర్చామని నిర్ధారించుకోవడానికి ఒక ప్రతిని ఉంచుకుంటుంది. పేదలు, నిరుపేదలు, అభాగ్యులకు సహాయపడే మార్గాలను అన్వేషిస్తూ తప్పనిసరిగా కేంద్రీకృత పరిపాలన అంతటా దృష్టిసారించాలనేది మునుపటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి భావజాలం ప్రస్తుత సందర్భంలో ప్రతి ఒక్కరు గ్రహిస్తారు. ఇది బహుశా ఏ సమయంలో ఉన్నదానికంటే ఇప్పుడు సంగతంగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత ప్రభుత్వం తొమ్మిది ఇతివృత్తాలతో కూడి ఉన్న ‘‘నవరత్నాలు’’ అనే ఒక ఏకీకృత సంక్షేమ అజెండాను రూపొందిస్తున్నది. వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్సుమెంటు, వైఎస్ఆర్ పింఛన్ లు, పేదలందరికీ గృహాలు, యువతకు ఉపాధి మరియు ఉద్యోగ కల్పన, వైఎస్ఆర్ ఆసరా – వైఎస్ఆర్ చేయూత దశల వారీగా మద్యనిషేదం, జలయజ్ఞం వంటివి ఇతివృత్తాలుగా ఉన్నాయి. ఇతివృత్తాలను శ్రేణీకరించి పటిష్టవంతమైన పురోగతితో కూడిన సమర్ధవంతమైన అమలు రాబోయే సంవత్సరాల్లో నా ప్రభుత్వానికి ప్రధాన అజెండాగా ఉంటుంది. తొమ్మిది సంక్షేమ ఇతివృత్తాలను కలిగివున్న ఈ పథకం జనాభాలోని భిన్న వర్గాలకు మరియు వివిధ రంగాలకు లబ్ధి చేకూరుస్తుంది. నా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమానికి మూలస్థంభంగా ఉండే ఈ ఇతివృత్తాలను అత్యంత వివరంగా విశదీకరించనివ్వండి.
రైతుల సంక్షేమంపై నా ప్రభుత్వం ప్రధానంగా దృష్టిసారిస్తుంది. నా ప్రభుత్వం రైతాంగం యొక్క సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉంది. కొంత మేరకు అసాధారణ వాతావరణ పరిస్థితుల వల్ల మరియు ఎక్కువగా అసంబద్ధ విధానాల వల్ల ఇప్పటి వరకూ నష్టం వాటిల్లిన వ్యవసాయ రంగంలో పరివర్తన తేవడానికి నా ప్రభుత్వం ప్రణాలికలను కలిగివుంది. సుమారు 62 శాతం జనాభా ఇంకా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నందున, వారి ప్రయోజనాలు, సంక్షేమం చూడడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని నా ప్రభుత్వం భావించింది. నకిలీ విత్తనాల సరఫరాతో సహా పలు విధాలుగా దోపిడీకి గురవుతున్న రైతుల గురించి నా ప్రభుత్వం తీవ్రంగా ఆందోళన చెందుతోంది. నా ప్రభుత్వం రైతుకు సంబంధించిన సమస్యలను లోతుగా పరిశోధించి, సంస్కరణలను తీసుకురావవడానికి ‘‘రాష్ట్ర రైతు కమీషన్’’ ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నది. ప్రతిపాదిత మిషన్ వ్యవసాయ మరియు అనుబంధ రంగాలలో విధానం మరియు అమలు అంశాలను పర్యవేక్షిస్తుంది.
అధికంగా ప్రస్తావించబడే ఎం.జి.ఎన్.ఆర్.జి.ఎస్. తో వ్యవసాయ కార్యకలాపాలను అనుసంధానం చేయడమనేది ఈ రోజుకు కూడా అస్పష్టంగానే ఉన్నది. నా ప్రభుత్వం సాగు ఖర్చును తగ్గించడానికి సీజనులో వ్యవసాయ కార్మికులు అందుబాటులో ఉండేటట్లు చూడడానికి వీలుగా ఒక విధానాన్ని రూపొందించడానికి గల సాధ్యాసాధ్యాలను అన్వేషిస్తుంది. వాగ్దానం చేసినట్లుగా, మొదటిగా ఉద్దేశించిన సమయానికంటే ఇంకా ముందుగా 2019 – రబీ నాటి నుండే అక్టోబరు 15, 2019 తేదీ నుండి విత్తనాలను వేసే సమయానికి ప్రతి రైతు కుటుంబానికి వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా సాలుకు రూ.12,500/-లను నా ప్రభుత్వం అందిస్తుంది. ఇది రైతులకు నేరుగా రూ.10000 కోట్లకు పైబడి నిధుల మొత్తం అందడానికి వీలుకల్పిస్తుంది. ఈ మొత్తంలో దాదాపు 5వ వంతు ఆర్ధిక సహాయం, ఓదార్పు కోసం చూస్తున్న భూయజమానులతోపాటు కౌలు రైతులకు అందుతుంది. సాగుదారుల మరియు భూయజమానుల ప్రయోజనాలు మరియు హక్కులకు భంగం కలుగకుండా కౌలు రైతుల ప్రయోజనాలను కాపాడాలని నా ప్రభుత్వం నిశ్చయించింది.
నా ప్రభుత్వం రైతులకు వడ్డీ రహిత రుణాలను మరియు ఉచిత బోరు బావులను కూడా సమకూర్చాలని ప్రతిపాదిస్తున్నది. రైతుల బోరు బావులను ఉచితంగా సమకూర్చుకోవడానికి వీలుగా రాష్ట్రంలోని ప్రతి ఒక్క శాసనసభ నియోజకవర్గంలో ఒక రిగ్ ను ఏర్పాటు చేయడానికి ప్రణాళికను రూపొందించడమయింది. ప్రత్యేకంగా శ్రద్ధ ఉంచాలని ప్రతిపాదించిన కొన్ని ఇతర రైతు – హిత పూర్వక కార్యక్రమాలలో పగలు 9 గంటలు ఉచిత విద్యుత్తుని అందించడం, ఆక్వా రైతులకు మద్దతు, రూ.3000 కోట్ల కార్పస్ తో ధరల స్థిరీకరణ నిధిని, రూ.2000కోట్ల కార్పస్ తో ప్రకృతి విపత్తు సహాయ నిధిని నెలకొల్పడం మరియు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక ఆహార ప్రాసెసింగ్ యూనిటును ఏర్పాటు చేయడం వంటివి చేరి వున్నాయి. సహకార డైరీలకు పాలు సరఫరా చేసే రైతులకు లీటరుకు రూ.4/- ప్రోత్సాహకాన్ని ఇవ్వడం ద్వారా సహకర రంగాన్ని, ప్రత్యేకించి పాడి పరిశ్రమ రంగాన్ని పునరుద్ధరించడానికి నా ప్రభుత్వం కట్టుబడి ఉంది. దురవస్థలో ఉన్న రైతు కుటుంబానికి అండగా నిలబడేందుకు ఏదేని కారణంచేత రైతు మరణించిన సందర్భంలో వైఎస్ఆర్ బీమా పథకం కింద రూ.7.00 లక్షల మొత్తాన్ని సమకూర్చడానికి నా ప్రభుత్వం కట్టుబడి ఉంది.
ఉపరితల మరియు భూగర్భ జలాల సమన్వయ వినియోగం, శాస్త్రీయ నీటి పరిరక్షణ ద్వారా నీటి వనరుల అభివృద్ధి, బిందు మరియు తుంపర సాగునీరు వంటి సూక్ష్మ సాగునీటి పద్ధతులను అనుసరించడం, నదుల అనుసంధానం మరియు నిర్ణీత కాలావధి విధానంలో జలయజ్ఞం క్రింత చేపట్టి, కొనసాగుతున్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా ఏకీకృత నీటి నిర్వహణను చేపట్టి అన్ని జిల్లాలకు హామినిచ్చిన నీటిని అందించాలని నా ప్రభుత్వం సంకల్పించింది. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు మరియు ఒకప్పుడు భారీ ప్రాజెక్టుగా భావించిన వెలిగొండ ప్రాజెక్టుతోపాటు ఇతర ముఖ్యమైన ప్రాజెక్టులను ఖచ్చితమైన కాలవ్యవధిలో పూర్తి చేయడమవుతుంది. ఏవేని లోపాలు, అవకతవకలు ఉన్నట్లయితే, వాటిని సరిదిద్దడానికి సాగునీరు, సాంకేతిక నిపుణులతో ఒక తృతీయ పక్ష విచారణ చేపట్టాలని కూడా ఉద్దేశించడమయింది. నా ప్రభుత్వం, అవసరమని గుర్తించినట్లయితే తగిన శ్రద్ధతో రివర్స్ టెండరింగ్ కు వెళ్లడానికి కూడా వెనుకాడదు. 108 హెల్త్ అంబులెన్సు వాహనం యొక్క హారను శబ్దము కొద్ది కాలముగా మూగబోయినప్పటికీ, మన జ్ఞాపకాలలో ఇంకా సజీవంగానే ఉంది. పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చేందుకు, రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచేందుకు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా రాష్ట్ర పౌరులందరికీ నివారణ, రోగ నిర్ధారణ మరియు స్వస్థత కలిగించే ఆరోగ్య సంరక్షణ సేవను అందించాలని నా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం, వార్షికాదాయం రూ.5.00 లక్షలకు మించినటువంటి మరియు ఆరోగ్య సంరక్షణ ఖర్చు రూ.1000/-లు మించిన ప్రజానీకానికంతటికీ వర్తింప చేయడమవుతుంది. చికిత్స కోసం ప్రస్తుతమున్న 1095 ప్రొసీజర్లకు అదనంగా మరో 936 ప్రొసీజర్లకు ఈ పథకం వర్తిస్తుంది. దీర్ఘకాలిక మూత్రపిండ సమస్యలు మరియు తలసేమియా వంటి వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు ప్రత్యేక సహాయంగా నా ప్రభుత్వం నెలకు రూ.10,000/-ల పింఛను సమకూరుస్తుంది.
వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని సమర్ధవంతంగా అమలుపరచడంతో పాటు, ఏదేని ప్రైవేటు రంగం సదుపాయంతో సమానంగా ప్రభుత్వ ఆసుపత్రులను రూపాంతరీకరించేందుకు నా ప్రభుత్వం ఒక సమగ్ర కార్యచర్య ప్రణాలికను రూపొందిస్తుంది. ఈ ప్రయత్నాలన్నీ పేదలకు వారి స్వంత ఖర్చులను తగ్గించడమే కాకుండా శిశు మరణాల రేటు, మాతృసంబంధ మరణాల దామాషా, మహిళలలో రక్తహీనత, పోషకాహార లోపం వంటి వివిధ ఆరోగ్య ప్రమాణాలలో గణనీయమైన మార్పులను తీసుకువస్తాయి. రాష్ట్రంలోని శిశువులు, విద్యార్థులు, గర్భిణీలు మరియు పాలిచ్చే మహిళల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు మధ్యాహ్న భోజనాలు వంటి పోషకాహార సంబంధిత పథకాలను సరైన స్ఫూర్తితో అమలుపరచడమవుతుంది. గ్రామ ఆరోగ్య కార్యకర్తలను ప్రోత్సహించడానికి రాష్ట్రంలోని దాదాపు 45,000 మంది ఆశా వర్కర్లకు నెలవారీ గౌరవ వేతనాన్ని రూ.3000/-నుండి రూ.10,000/-కు పెంచడమయింది.
మద్యపాన వినియోగం అనేది దురవస్థకు దారితీసి, భారీస్థాయిలో కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తుంది. ఈ బెడద యొక్క ప్రతికూల ప్రభావాన్ని గుర్తిస్తూ, దశలవారీగా మద్యాన్ని నిషేధించడానికి నా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మొదటి చర్యగా, గొలుసు దుకాణాల మూసివేతకు నా ప్రభుత్వం ఆదేశించింది. దీనివల్ల ఇది అనేకమంది హృదయాలలో సంతోషాన్ని తీసుకువస్తుందని ఆశించడమయింది.
నా ప్రభుత్వం, పాఠశాలకు వెళ్లే పిల్లలందరికీ విద్యను అందించేలా చూడటానికి కట్టుబడి ఉంది. తద్వారా తన పిల్లల చదువు గురించి ఏ తల్లీ చింతించదు. గుర్తింపు మరియు ప్రోత్సాహక మొత్తంగా అమ్మ ఒడి పథకం క్రింద తన పిల్లలను పాఠశాలకు పంపుతున్నందుకు ప్రతి తల్లికి సంవత్సరానికి రూ.15000/- లను ఇచ్చేందుకు నా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ చర్య పూర్తిగా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడమే కాకుండా సార్వత్రిక విద్య ద్వారా విజ్ఞాన ఆర్ధిక వ్యవస్థకు అవసరమైన పర్యావరణ వ్యవస్థణు సృష్టించింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు సెకండరీ స్థాయిలో స్థూల నమోదు నిష్పత్తి (జిఇఆర్) లో మెరుగుదలను తీసుకురావడానికి మరియు ఈ స్థాయిలన్నింటిలో డ్రాపౌట్ రేట్లను గణనీయంగా తగ్గించడానికి కట్టుబడి ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలల ప్రస్తుత స్థితి పిల్లలు పాఠశాలలకు వెళ్లేలా ప్రోత్సహించడానికి వీలుగా అధిక స్థాయిలో ఉన్నతీకరించి, నవీకరించాలని సూచిస్తున్నది. పాఠశాలల ప్రమాణాలు, వసతులను మెరుగు పరిచేందుకు నా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అన్ని పేద కుటుంబాల విద్యా వ్యయాన్ని భరించేందుకు నా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. సాంకేతిక మరియు ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు కోసం మేము మొత్తం ఫీజు రీయింబర్స్మెంటుకు అదనంగా బోర్డింగ్ మరియు వసతి కోసం ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ.20,000/-లను సమకూర్చుతాం. నా ప్రభుత్వం అన్ని ఉన్నత మరియు సాంకేతిక విద్యా సంస్థల్లో సైతం నాణ్యమైన విద్యను అందిస్తుంది.
వైఎస్ఆర్ చేయూత ద్వారా ఒక సమ్మళిత సమాజాన్ని స్థాపించడం మా ప్రాధాన్యత. ఈ పథకం క్రింద అవసరమైన మద్దతును ఇవ్వడం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఎస్.సి, ఎస్.టి, బి.సి మరియు మైనారిటీ కుటుంబం, ప్రత్యేకించి మహిళలు నిలదొక్కుకునేలా చేయడానికి నా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ పథకం క్రింద ఈ వర్గాలకు చెంది 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల ప్రతి మహిళ సంవత్సరానికి రూ.18,750/-ల చొప్పున 4 సంవత్సరాలలో రూ.75,000/-ల మొత్తాన్ని అందుకుంటుంది.
నా ప్రభుత్వం ఎస్.సీలు, ఎస్.టీలు, బి.సీలు, మైనారిటీలు మరియు ఇతర బలహీన వర్గాల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుంది. ఈ వర్గాల వధువుల వారి వివాహ సమయాన ప్రోత్సాహకరంగా రూ.1,00,000/-ల మొత్తాన్ని అందించడం జరుగుతుంది. చట్టబద్ధమైన అధికారాలతో ఒక శాశ్వత వెనుకబడిన తరగతుల కమీషన్ ను నెలకొల్పాలని నా ప్రభుత్వం ప్రణాళిక కలిగివున్నది. ప్రభుత్వ కాంట్రాక్టు బాధ్యతలన్నింటిలో అంటే సిబ్బందిని ఔట్ సోర్సింగ్ ద్వారా తీసుకోవడం, రవాణా సదుపాయాలు, సివిలు పనులు మున్నగు వాటిలో ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు 50 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు నా ప్రభుత్వం కట్టుబడి ఉంది. వాస్తవ సమ్మళిత రాజకీయ పాలనను సాకారం చేసేందుకు డైరెక్టర్లు, చైర్మన్లు, ట్రస్టు మండళ్లు మున్నగు రాజకీయ నియమకాలన్నింటిలో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రతిపాదిస్తున్నది. నాయీ బ్రాహ్మణులు, దర్జీలు, మత్స్యకారులు, నేతకారులకు ఆర్ధిక మద్దతును అందించడమవుతుంది.
కాపు వర్గం సంక్షేమానికి నా ప్రభుత్వం అంతే సమానంగా కట్టుబడి ఉంది. కాపుల కోసం ఐదు సంవత్సరాల కాలంలో రూ.10,000 కోట్లను ప్రత్యేకించడానికి ప్రణాలికను కలిగివున్నాం. ఆర్యవైశ్యులు, ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్ మైనారిటీలు మరియు అగ్ర వర్ణాలలోని ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల పట్ల తగినంత శ్రద్ధను చూపడమవుతుంది. జర్నలిస్టులు, లాయర్లు, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కూడా నా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అధికారుల అవినీతి లేదా ఉదాసీనతను సహించకుండా ఉంటూ, యోగ్యమైన పరిశీలనలు మరియు గుర్తింపుపొందిన సూచనలను స్వీకరించడానికి నా ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
పదవీ స్వీకారం తరువాత, సామాజిక సంక్షేమ పింఛనును దశలవారీగా రూ.3000/-లకు పెంచుతామనే వాగ్ధానాన్ని నెరవేరుస్తూ, నా ప్రభుత్వం మొదటి చర్యగా, వృద్ధులకు వైఆసర్ భరోసా పింఛనును రూ.2250/-లకు పెంచించి మరియు సంవత్సరానికి రూ.250/-ల పెరుగుదలలతో రానున్న 4 సంవత్ససరాలలో మొత్తం పింఛను రూ.3000/-లకు చేరుకుటుంది. పింఛను కోసం అర్హమయ్యే వయసు 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు తగ్గించాం. ఇది సుమారుగా మరో 5 లక్షల మందికి లబ్ధిని చేకూరుస్తుంది.
కులం, జాతి, మతం మరియు రాజకీయ గుర్తింపులకు అతీతంగా రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఒక గృహాన్ని సమకూర్చడానికి నా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రానున్న 5 సంవత్సరాలలో 25 లక్షల గృహాలను నిర్మించడానికి మేము నిబద్ధత కలిగి ఉన్నాం.
మహిళలకు మద్దతును కొనసాగిస్తూ పొదుపు సమాఖ్యల (డ్వాక్రా) రుణ బకాయిల పూర్తి మొత్తాన్ని నేరుగా మహిళల చేతికి నాలుగు దశలలో అందించడానికి నా ప్రభుత్వం నిబద్ధత కలిగి ఉంది. దీనికి అదనంగా, ఆసరా పథకం క్రింద మహిళా పారిశ్రామికవేత్తలందరికి వడ్డీలేని రుణాలను అందిస్తాం.
రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే, ప్రత్యేక కేటగరి హోదా కోసం మన పోరాటాన్ని కొనసాగించి, పలు కార్యక్రమాల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి మేము కట్టుబడి ఉన్నాం. అంతేకాక సంఘటిత, అసంఘటిత రంగాలు రెండింటిలో యువతకు ఉద్యోగ కల్పనపై దృష్టి సారిస్తూ నెలకు రూ.5000/- గౌరవ వేతనంతో తమ యొక్క గ్రామాలు/వార్డులకు సేవలు చేయడానికి ఆసక్తి ఉండి, 50 కుటుంబాల అవసరాలను తీర్చడానికి మేము గ్రామ/వార్డు సేవకులను కూడ నియమిస్తాం. ఈ గ్రామ/వార్డు సేవకుల ప్రజలు, ప్రభుత్వానికి మధ్య మధ్యవర్తులుగా వ్యవహరించి, ఆకాంక్షిత నవరత్నాలు పథకం క్రింద గుర్తించిన కార్యకలాపాల సేవలను సజావుగా అందించే విధంగా చేస్తారు. నా ప్రభుత్వం గ్రామ సచివాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నది. ప్రతి గ్రామంలో ఒక గ్రామ సచివాలయం ఉంటుంది. ఈ సచివాలయాలలో పని చేయడానికి ఒక్కో గ్రామానికి 10 మంది వ్యక్తుల చొప్పున పలు పోస్టుల కోసం 1.60 లక్షల ఖాళీలను కూడా భర్తీ చేయడమవుతుంది. ప్రభుత్వ కార్యాలయాలలోని అన్ని ఖాళీలను భర్తీ చేయడానికి మేము కట్టుబడి ఉన్నాం. ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన ఖాళీల కాలపట్టికను కూడా విడుదల చేయాలనే ప్రణాళిక చేస్తున్నాం.
యువతకు ఉపాధిని కల్పించాలని నా ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. కొంత మంది యువత వివిధ కారణాల వలన సంఘటిత ఉపాధిని పొందడానికి ఉద్దేశించిన విద్యార్హతలు లేదా నైపుణ్యాలను పొందలేకపోయి ఉంటారు. ఈ ముఖ్యమైన జనాభా సంబంధిత అనుకూలతలను సక్రమంగా నిర్వహించి, తమ జీవనాధారాన్ని సంపాదించడానికి వారిని ఆర్ధిక కార్యకలాపంలోకి తీసుకొచ్చి జాతి కోసం సంపదను సృష్టించాల్సిన ఆవశ్యకత ఉంది. సరైన దిశలో శిక్షణ పొందిన యువత మంచి ఉద్యోగ అవకాశాలను పొందుతారు. ఈ దీర్ఘకాలిక ప్రణాలికతో యువత సామర్థ్యాలను మరింత ఉత్పాదక విధానంలో వినియోగించాలని నా ప్రభుత్వం యోచిస్తున్నది. విద్యా విధానంలో ప్రమాణాలను మెరుగుపరచి, ఐటిఐలు మరియు పాలిటెక్నిక్ లలో గణనీయమైన అభివృద్ధిని సాధించేందుకు రాష్ట్రం కట్టుబడి ఉంది. సాంకేతిక విద్యా సంబంధ సంస్థలతో పరిశ్రమ అనుసంధానాన్ని నిర్ధారిస్తూ యువతను పరిశ్రమకు సంసిద్ధంగా ఉంచడమవుతుంది. దీనితో, తయారీ రంగంలో యువత కోసం ఉద్యోగాలను కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాలికలను ప్రారంభిస్తుంది.
సరైన స్ఫూర్తితో నవరత్నాలను అమలపరచడమే కాకుండా నా ప్రభుత్వం పరిశ్రమ మరియు సేవా రంగాలను అభివృద్ధిపరచడంపై కూడా దృష్టిసారిస్తుంది. సముచిత ప్రమేయాలలో ప్రత్యేకంగా మహిళల భద్రత మరియు రక్షణ కోసం సాంకేతికతను అవలంబించడమవుతుంది. గ్రామీణ మరియు పట్టణ మౌలిక సదుపాయాలు సంపూర్ణంగా అందే విధంగా ప్రణాళికాబద్ధ విధానంలో చేపట్టడమవుతుంది. పట్టణ ప్రాంతాలలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం కోసం ప్రత్యామ్నాయ ట్రాఫిక్ నమూనాలను అధ్యయనం చేయడమవుతుంది. సంప్రదాయేతర ఇంధనాన్ని ప్రోత్సహిస్తూ, సంప్రదాయ విద్యుత్తు విధానంలో టి&డి నష్టాలను తగ్గించేందుకు ప్రాధాన్యత ఇవ్వడమవుతుంది.
ప్రజలకు చేసిన వాగ్ధానాలను నెరవేర్చే దిశగా, గత పదిరోజులలో నా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వం యొక్క నిజాయితీ, నిబద్ధతకు ప్రతీక అని తెలియజేయుటకునేను సంతోషిస్తున్నాను. ఈ దిశగా ప్రత్యేకించి ఈ క్రింది నిర్ణయాలను పేర్కొనవలసిన అవసరమున్నది.
- పింఛను మొత్తాన్ని రూ.2250/-లకు పెంచడం.
- ఆశా వర్కర్ల జీతాలను రూ.3000/- నుండి రూ.10,000/-లకు పెంచడం.
- వాటా విరాళ పింఛను పథకాన్ని రద్దు చేయటం. కమిటీని ఏర్పాటు చేయడమవుతుంది.
- 26/01/2020 నుండి ‘‘అమ్మ ఒడి’’ పథకాన్ని అమలు చేయడం కోసం విధివిధానాలను మదింపు చేయడం.
- ప్రభుత్వంలో ఎ.పి.ఎస్.ఆర్.టి.సి విలీనం. కమిటీని ఏర్పాటు చేయడమవుతుంది.
- పురపాలక పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను రూ.12,000/-ల నుండి రూ.18000/-లకు పెంచడం.
- ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి. 2019, జూలై నుండి పెంచిన మొత్తాన్ని చెల్లించడం. 2019, అక్టోబరు 15వ తేదీ నుండి రూ.12,500 చొప్పున వైఎస్ఆర్ రైతు భరోసా అమలు.
- గిరిజన సంక్షేమ శాఖలోని సామాజిక ఆరోగ్య కార్యకర్తల జీతాలను రూ.400/- నుండి రూ.4000/-లకు పెంచడం.
- అంగన్ వాడీలు మరియు హోంగార్డులకు వేతనాల పెంపుదల.
- 2020 ఉగాది నుండి 25 లక్షల ఇండ్ల స్థలాల పట్టణాలను పంపిణీ చేయాలని ప్రతిపాదించడమయింది. వచ్చే 4 సంవత్సరాలతోపాటు ప్రతి సంవత్సరం 6 లక్షల గృహాలను నిర్మించడం.
- అక్రమ మైనింగ్ మరియు అవినీతిని అరికట్టడానికి నూతన ఇసుక విధానం.
చివరిగా,
సుపరిపాలన అందించడానికి మొదలుపెట్టిన యాత్ర ఇప్పుడే మొదలయింది. మనం ఆశించిన మార్పు, 5 కోట్ల ప్రజానీకం యొక్క సంపూర్ణ సహకారం మద్దతుతోనే వీలువుతుంది. కేంద్ర ప్రభుత్వం మరియు పొరుగు రాష్ట్రాల సహకారంతో నా ప్రభుత్వం ధృఢ నిశ్చయంతో ముందుకు అడుగు వేస్తుంది.
సుస్పష్టమైన ప్రజా తీర్పును దృష్టిలో ఉంచుకుని అయిదు కోట్ల ప్రజల ఆశయాలు, ఆకాంక్షల మేరకు, వారి కలలు సాకారం చేయడానికి నా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంటుంది.
ఓం సర్వే భవన్తు సుఖిన:
సర్వే సన్తు నిరామయా: .
సర్వే భద్రాణి పశ్యన్తు
మా కష్చిదు:ఖభాగ్భవేత్
ఓం శాంతి శాంతి శాంతి: ..
అర్థం :
అందరూ సుఖంగా, సంతోషంగా ఉండాలి.
అందరూ ఆరోగ్యంగా ఉండాలి.
అందరూ ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాలి.
ఎవరూ బాధతో ఉండకూడదు.
ఓం శాంతి, శాంతి, శాంతి:.
***జై హింద్***
.