జర్నలిస్టుగా, రచయితగా, ప్రచురణకర్తగా డాక్టర్ గోవిందరాజు చక్రధర్ ది సుదీర్ఘ ప్రస్థానం. రచయితగా, ప్రచురణకర్తగా ఆయనకు ఎదురైన స్వానుభవాలు ఈ Writer’s Blues. నలభైకి పైగా పుస్తకాలు తీసుకువచ్చిన వ్యక్తిగా.. ఆయన అనుభవాలను adarsini.com పాఠకులకోసం ప్రత్యేకంగా అందిస్తున్నారు. ఆ వ్యాసపరంపరలో ఇది నాలుగవది.
బూదరాజు రాధాకృష్ణ నవతరం జర్నలిజం నడకను పరిపుష్టం చేసిన భాషావేత్త. అయిదువేల పుస్తకాలను మధించి ఆయన ఎంపిక చేసిన మంచి వాక్యాల సంకలనం ‘మరవరాని మాటలు‘. ఈనాడు సంస్థ ప్రచురించవలసిన పుస్తకం.. చివరికి మీడియా హౌస్ ద్వారా వెలుగు చూసింది. సూర్యకాంతికి అరచేతిని అడ్డుపెట్టినట్టుగా.. ఈ పుస్తకం వెలుగులోకి రాకుండా ఈనాడు లోని కొందరు వ్యక్తులు ఆపించారు. అయినా ఆగుతుందా..?
‘‘అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని ఈ సంకలనం తిరిగి నా చేతికి వచ్చేసరికి నా వయస్సు పెరిగిపోయింది. ఆరోగ్యం చాలా క్షీణించింది. ఏనాడో పోగొట్టుకొన్న వస్తువు బహుకాలం తరవాత దొరికినప్పుడు అది యథాపూర్వ స్థితిలో ఉందో లేదో ఎంత జీర్ణావస్థలో ఉందో, కనీసం కొన్నిచోట్లనయినా ఖిలమయిందో లేదో పరీక్షిద్దామన్న ఉబలాటమున్నా మళ్లీ శ్రమించే శక్తి సామర్థ్యాలు లోపించాయి.’’
తను సంకలనం చేసిన మరవరాని మాటలు పుస్తకం కోసం రాసిన పరిచయంలో ప్రముఖ భాషావేత్త బూదరాజు రాధాకృష్ణ ఈ విషయం పేర్కొన్నారు.
నన్నయ నాటినుంచి ఈనాటి వరకు ఐదువందల మంది రచయితలు రాసిన అయిదువేల గ్రంథాలనుంచి సేకరించిన మరవరాని మాటలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈనాడు సంస్థ వారి ఉషోదయ పబ్లికేషన్స్ 1991లో ఈ పుస్తకం ప్రచురించి ఉండాల్సింది. కానీ దశాబ్దాల కాలం దాటినా ప్రచురణకు నోచుకోలేదు. ఎంతో కష్టపడి సేకరించి సంకలనం చేసిన ‘మరవరాని మాటలు’ పుస్తక రూపంలో చూసుకోవాలని బూదరాజు రాధాకృష్ణ తపించారు.
ఉషోదయా పబ్లికేషన్స్ తరఫున ప్రచురిస్తారన్న ఆశ ఆయనలో పూర్తిగా సన్నగిల్లింది. ఆ సమయంలో ఆ పుస్తకాన్ని నా సారథ్యంలోని మీడియా హౌస్ పబ్లికేషన్స్ తరపున ప్రచురించటానికి ముందుకు వచ్చాను. 2004 ఏప్రిల్‌లో 406 పేజీల ఈ పుస్తకాన్ని ప్రచురించి మే 3వ తేదీకల్లా పుట్టినరోజు కానుకగా బూదరాజు గారికి అందచేశాను.
ప్రతిఏటా పుట్టినరోజునాడు నలుగురయిదుగురు సన్నిహిత మిత్రులకు బూదరాజు రాధాకృష్ణ హోటల్‌లో పార్టీ ఇచ్చేవారు. కేతు విశ్వనాధరెడ్డి, పి.డి.పి.వర్మ, విశాలాంధ్ర రాజేశ్వరరావు వంటి కొద్దిమంది ఈ సమావేశంలో పాల్గొనేవారు. నేను కూడా ఒక ఏడాది బూదరాజు వారి పుట్టినరోజు విందులో పాల్గొన్నాను. అయితే ‘మరవరాని మాటలు’ ప్రచురించిన 2004వ సంవత్సరపు పుట్టినరోజు కార్యక్రమంలో నేను ఊరెళ్లవలసి రావడంతో పాల్గొనలేదు. ఆ మరునాడు ఫోనుచేసి ఆవిష్కరణ విశేషాలను బూదరాజు చెప్పారు.
బూదరాజు రాధాకృష్ణ అంటే చాలామందికి గిట్టదు. ఆయన దేన్నయినా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడేవారు. బూదరాజు ధోరణి రామోజీరావుకు తెలుసు కనుక ఆయన మాటలను ఎంజాయ్ చేసేవారు. అయితే ఈనాడులోని ఒక పెద్దాయనకు బూదరాజు అంటే పడకపోవడం వల్లే మరవరాని మాటలు ప్రచురణను పక్కన పెట్టేశారట. 2004 నాటికి ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్ బాధ్యతల నుంచి కూడా బూదరాజు వైదొలగారు.
అదృష్టవశాత్తు కంపోజ్ చేసి ప్రింటింగ్‌కు సిద్ధం చేసిన కాపీ బూదరాజు దగ్గర ఉండటంతో మళ్లీ కంపోజ్, ప్రూఫ్ రీడింగ్ శ్రమ తప్పింది.
ఇవి కూడా చదవండి : మోడీ, చంద్రబాబు.. ‘ఈ జన్మలో చూడలేం’ అనుకున్నది చూపించారు
చట్టాలు తయారు చేసే స్థానంలో ఉంటూ బండబూతులు తిట్టుకునే సిగ్గుమాలిన రాజకీయం
ఈనాడు వారు ప్రచురించాల్సి ఉన్న ఈ పుస్తకాన్ని నువ్వెందుకు ప్రచురిస్తున్నావు? అని ఒకరిద్దరు శ్రేయోభిలాషులు నన్ను వారించారు. అయితే బూదరాజు అభిమతాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రచురణకే సిద్ధమయ్యాను. మరవరాని మాటలను బూదరాజు రాధాకృష్ణ మరో పబ్లిషర్ ద్వారా ప్రింట్ చేయించారన్న విషయాన్ని రామోజీరావు దృష్టికి తెచ్చినప్పుడు,
‘ఇన్నేళ్లు ఎందుకు పబ్లిష్ చేయకుండా పెట్టుకుని కూర్చున్నారు?’ అంటూ ఆ కబురు చెప్పిన వ్యక్తికి ఘాటుగా తలంటారట. మరవరాని మాటలు వచ్చిన కొత్తల్లో అమ్మకాలు బాగానే ఉండేవి. ఆ తర్వాత నెమ్మదిగా సేల్స్ తగ్గింది.
ఆంధ్రభూమి డైలీలో ఒక సాహితీవేత్త మరవరాని మాటలు పుస్తకాన్ని రివ్యూ చేశారు. ఆ సమీక్షకు ‘మరవదగిన మాటలు’ అని శీర్షిక పెట్టారు. ఆ రివ్యూ ఎంత క్రిటికల్‌గా ఉందో ఆ హెడ్డింగే చెబుతోంది.
బూదరాజులో సుగుణాలు
బూదరాజు రాధాకృష్ణ మాట పెళుసుగా అన్పించినా సున్నిత హృదయుడు. నేనెప్పుడైనా చెప్పిన టైముకు ఆయన ఇంటికి చేరుకోకపోతే, ఫోను చేసి ఎక్కడ ఉన్నదీ ఆరా తీసేవారు. పుస్తకాల ప్రచురణ విషయంలో తనకు సంబధం లేని విషయాలను అసలు ఆయన పట్టించుకునే వారు కాదు. పుస్తకం ప్రింటింగ్‌కు ఏ పేపర్ వాడుతున్నాం, దాని నాణ్యత ఏమిటి? వగైరాల ధ్యాసే ఉండేది కాదు. కవర్ డిజైన్‌ను చూపిస్తే ఏమీ కామెంట్ చేసేవారు కాదు. కవర్ డిజైనర్ సూచించిన కలర్ స్కీమ్ తోనే వెళ్లమనే వారు.
ఇది కూడా చదవండి : జగన్ మడమ తిప్పని నేత అంటారు గానీ.. మాట మార్చేసే నేత
పుస్తకం చేతికి వచ్చాక
తన పుస్తకాల ప్రూఫ్‌లను బూదరాజు స్వయంగా దిద్దేవారు. రెండు ప్రూఫ్‌లు చూశాక ఇక అంతటితో తన బాధ్యత పూర్తయిందనుకునే వారు. మళ్లీ ఫైనల్ ప్రింటవుట్లు చూపించు అని అడిగేవారు కాదు. పుస్తకం తన చేతికి అందాక క్షుణ్ణంగా ఆసాంతం చదివి ఏవైనా అక్షరదోషాలు మిగిలిఉంటే మార్క్ చేసి ఆ కాపీని భ్రదపరిచేవారు. రీప్రింట్‌కు వచ్చినపుడు ఆ కరెక్షన్స్ చేయమనే వారు.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
బూదరాజు పుస్తకం అచ్చువేసే పబ్లిషర్లకు ఆయన పరంగా ఏ సమస్యలూ ఉండేవి కావు. తన పరిధికి లోబడి అంతవరకు ఆ బాధ్యతను నెరవేర్చేవారు. కంటెంట్ విషయంలో రవ్వంత మార్పును, సూచనను కూడా సహించేవారు కాదు.
మరవరాని మాటలే కాకుండా ఆయన ఆత్మకథ విన్నంత కన్నంత, అనువాద పాఠాలు, మంచి జర్నలిస్టు కావాలంటే, తెలుగు సంగతులు పుస్తకాలను కూడా నేనే ప్రచురించాను.
తనకు ఎన్ని కాపీలు కావాలో చెప్పేవారు. అవి చాలకుంటే మరికొన్ని ఇమ్మనేవారు. జర్నలిజం కాలేజి ప్రిన్సిపల్‌గానే గాక పబ్లిషర్‌గా కూడా బూదరాజు రాధాకృష్ణతో సన్నిహితంగా మెలిగే అవకాశం దొరికింది. నేను ప్రచురించిన పుస్తకాల్లో ఎన్నదగిన వాటిలో మరవరాని మాటలు కూడా ఒకటి.
.. డాక్టర్ గోవిందరాజు చక్రధర్
Discussion about this post