ప్రధాని నరేంద్రమోడీ రాజ్యాంగ వ్యవస్థలను ఇన్ ఫ్లుయెన్స్ చేస్తున్నాడనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. చంద్రబాబునాయుడు ఈ విషయంలో అనేకానేక ఆరోపణలు చేసి.. మోడీకి, ప్రజల దృష్టిలో ఉన్న విశ్వసనీయత మొత్తం ఒక అపోహ అని తేల్చేశారు. సాధారణంగా గవర్నర్ల వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ప్రభావితం చేయడం మాత్రమే కాదు, శాసించడం కూడా చాలా మామూలు సంగతి. ఆ విషయం అందరికీ తెలుసు. అయితే న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం వంటి స్వతంత్ర వ్యవస్థలను కూడా మోడీ ఇన్ ఫ్లుయెన్స్ చేస్తున్నారనే అనుమానం ఇప్పుడు బలపడుతోంది.
కర్నాటకలో ఖాళీ అయిన ఎంపీ స్థానాలకు మాత్రం ఉప ఎన్నిక నిర్వహించడానికి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ అయిన ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలు ప్రకటించకపోవడం అనేది.. ఎన్నికల సంఘం వైఖరి మీద అనుమానాలను, వారి మీద ఉండగల మోడీ సర్కార్ ప్రభావం మీద అసంతృప్తిని కలిగిస్తున్నది. వీటికి తోడు.. ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు.. మోడీతో అంటకాగుతూ.. ఆయన దయా దాక్షిణ్యాలకై పాకులాడుతున్నాయని… ఆయనను పల్లెత్తు మాట అనకుండా, రాష్ట్రానికి చేస్తున్న ద్రోహాన్ని ప్రశ్నించకుండా.. కుమ్మక్కు రాజకీయాలు కొనసాగిస్తున్నాయని అనడానికి ఇది ప్రబల నిదర్శనంగా కనిపిస్తోంది.
జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలతో నిరపాయకరమైన జోన్ లోకి చేరుకున్న తర్వాత.. రాజీనామాలు చేయించారు. ప్రత్యేకహోదా కోసం ఎంపీ పదవులను త్యాగం చేస్తాం అంటూ రెండేళ్ల కిందట ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి, తీరా ఇక ఉప ఎన్నికలు రావు అనే ధీమా వచ్చాక రాజీనామా చేయించారు. అది వారి రాజకీయ నిర్ణయం కావొచ్చు.
జగన్ బ్యాచ్ ఎంపీలు రాజీనామాలు చేస్తే.. వారికి ఉపఎన్నికల గండం ఎదురవకుండా.. భారతీయ జనతా పార్టీ మరింతగా తమ తోడ్పాటు అందించింది. ఏప్రిల్ 6వ తేదీన ఎంపీలు రాజీనామా చేస్తే.. వారితో చర్చల పేరిట మీనమేషాలు లెక్కించి.. జూన్ 21న ఆ రాజీనామాలను ఆమోదించారు. ఈలోగా ఉపఎన్నికలు రాగల గడువు దాటిపోయింది. భాజపా-వైకాపా కుమ్మక్కు రాజకీయాల గురించి చంద్రబాబు ఎంతగా నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. అప్పటిదాకా నమ్మని వారికి కూడా అప్పట్లో అనుమానం కలిగింది.
తీరా ఇప్పుడు ఎన్నికల సంఘం కర్నాటకలో ఒక మాదిరిగా, ఏపీలో ఒక మాదిరిగా పరిస్థితుల్ని పరిశీలిస్తుండడం ఆ అనుమానాల్ని బలపరుస్తోంది. ఎంపీస్థానాల ఖాళీలు రెండు రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. కర్నాటకలో ఉప ఎన్నిక పెడుతున్నారు. ఏపీలోని అయిదు స్థానాలకు ఉప ఎన్నిక పెట్టడం లేదు. అచ్చంగా ఇది భాజపా ప్రభావంతో.. వైకాపాకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఈసీ తీసుకున్న పక్షపాత నిర్ణయం అనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది. ఇలాంటి మరకు ను ఎలా చెరిపేసుకుంటారో చూడాలి.
.

Discussion about this post