చైనాలో మొదలై ప్రపంచం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసిన ప్రాణాంతక వ్యాధి కరోనా. కోవిడ్-19గా నామకరణం పొందిన ఈ మహమ్మారి కమ్యూనిస్టు దేశాన్ని అతలాకుతలం చేసింది. వేల సంఖ్యలో ప్రాణ నష్టంతో పాటు ఆర్థికంగా, పారిశ్రామికంగా ఆ దేశాన్ని కుదేలుచేస్తోంది. అక్కడ కరెన్సీ వినియోగం తగ్గిపోయి.. డిజిటల్ లావాదేవీలు పెరిగిపోయాయి. అనేక పారిశ్రామిక, ఉత్పాదక సంస్థలు మూతబడి, ప్రజలకు ఉపాధి లేకుండాపోయింది. ఈ వ్యాధి భయంతో పౌర సంచారం తగ్గిపోయి నిర్మానుష్య వాతావరణం తాండవిస్తోంది. ఈ నేపథ్యంలో చైనాతో భారీగా వ్యాపార వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న భారతదేశం కష్టనష్టాలను ఒకసారి పరిశీలిస్తే..
కొవిడ్-19 పుణ్యమా అని భారత్‌లో బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. పదేళ్లలో గరిష్ట స్థాయికి చేరుకున్న బంగారం ధర పది గ్రాములు రూ. 44,430 పలికింది. చైనా నుంచి దిగుమతి తగ్గడంతో పాటు ప్రపంచ ఆర్థిక మందగమనాన్ని బట్టి దేశీయంగా పసిడి ధర కొండెక్కినట్లు తెలుస్తోంది.
కొవిడ్-19 ప్రభావం ఫార్మాసూటికల్స్ పరిశ్రమలు, సౌర విద్యుత్ ప్రాజెక్టులపై చూపుతోంది. వీటికి అవసరమైన ముడిసరుకు దిగుమతి చైనా నుంచి నిలిచిపోవడంతో సదరు రంగాలు స్తంభించిపోయాయి. అనంతపురం, కడప జిల్లాల్లో చేపట్టిన రూ.5,100 కోట్ల విలువ చేసే సౌర విద్యుత్తు ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడ ఆగిపోయినట్లు తెలుస్తోంది.
పట్టు రైతులకు కరోనా వైరస్ కలిసొచ్చింది. దేశంలో చైనా సిల్క్ కు మంచి డిమాండు ఉంది. అయితే కరోనా దెబ్బకు దిగుమతి నిలిచిపోవడంతో దేశీయ పట్టుకు డిమాండు పెరిగింది. కిలో బైవోల్దిన్ రకం గూళ్ల ధర ప్రస్తుతం రూ.610కు చేరుకుంది. ధర మరింత పెరగనుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గుంటూరు మిర్చికిది గడ్డుకాలంగా పరిణమించింది. చైనాకు అత్యధికంగా ఎగుమతి అయ్యే గుంటూరు మిర్చికి కొవిడ్-19 కారణంగా గిరాకీ తగ్గిపోయింది.
.

Discussion about this post