తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో గురువారం రాత్రి భారీ దోపిడీ జరిగింది. దోపిడీ దొంగలు రూ.85లక్షల విలువైన బంగారం.. రూ.5లక్షల నగదు దోచెకెళ్లారు. దోపిడీ ఆనవాళ్లు దొరకకుండా చేసేందుకు దొంగలు సీసీ కెమెరాలు, పుటేజీని కూడా పట్టుకెళ్లారు. పట్టణ నడిబొడ్డున.. జనసంచారం అధికంగా ఉండే ప్రాంతంలో రాత్రి 10.30గంటల నుంచి 11గంటల మధ్య చోటు చేసుకోవడం సంచలనం కలిగిస్తోంది. సంఘటనా స్థలాన్ని తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డి శుక్రవారం ఉదయం పరిశీలించారు. దోపిడీ దొంగలను పట్టుకోవడం కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.
శ్రీకాళహస్తి పట్టణం పెద్దమసీదువీధిలో మూడేళ్లుగా ఫిన్ కేర్ చిన్న తరహా ఫైనాన్స్ సంస్థ నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ వారు బంగారు కుదువ పెట్టుకుని అప్పు ఇస్తుంటారు. అదేవిధంగా నగదు లావాదేవీలు కూడా నిర్వహిస్తుంటారు. ఈ సంస్థకు శ్రీకాళహస్తి శాఖ మేనేజరుగా స్రవంతి అనే మహిళ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ పని చేసే సిబ్బంది గురువారం రాత్రి యథావిధిగా విధులు నిర్వర్తించుకుని ఇళ్లకు వెళ్లారు. అయితే ఫిన్ కేర్ సంస్థ మేనేజరు స్రవంతి, మరో ఉద్యోగి విఘ్నేష్ మాత్రం కార్యాలయంలోనే ఉన్నారు.
రాత్రి 10గంటల తరువాత విఘ్నేష్ కూడా తన కార్యాలయం పైనే ఉన్న తన గదికి వెళ్లాడు. మేనేజరు స్రవంతి మాత్రం ఖాతాదారులు లావాదేవీలకు సంబంధించి రికార్డులు పరిశీలిస్తూ ఒంటరిగా కూర్చుంది. రాత్రి 10.30గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు ఫిన్ కేర్ కార్యాలయంలోకి చొరబడ్డారు. మేనేజరు స్రవంతిని కత్తులతో బెదిరించారు. ఆమె చున్నీతో కాళ్లు, చేతులు కట్టేశారు. అరవకుండా నోటికి గుడ్డ పెట్టారు. ఆ తరువాత తాళాలు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని బెదిరించారు.
స్రవంతి భయపడి తాళాలు ఉన్న చోటు చెప్పింది. వెంటనే వారు స్ట్రాంగ్ రూమ్ లాకర్ తెరచి రూ.85లక్షల విలువ చేసే బంగారం… రూ.5లక్షల నగదు తీసుకున్నారు. దోపిడీ ఆనవాళ్లు కనపడకుండా ఉండటానికి ఫిన్ కేర్ ఫైనాన్స్ సంస్థలో కార్యాలయంలో ఉన్న సీసీ కెమెరాలను, సీసీ పుటేజీని తొలగించి తమతో పాటు తీసుకెళ్లారు. దోపిడీ దొంగలు కేవలం అరగంట లోపే తమ పని ముగించుకున్నారు. పోతూ పోతూ మేనేజరు స్రవంతి సెల్ ఫోన్ కూడా పట్టుకెళ్లారు. ఈ దోపిడీ ఘటనతో స్రవంతి షాక్ కు గురైంది. కొంతసేపటి తరువాత గదికి వెళ్లిన విఘ్నేష్ మళ్లీ కార్యాలయంలోకి వచ్చాడు. చున్నీతో కాళ్లు, చేతులు కట్టేసి.. నేలపై పడి ఉన్న మేనేజరు స్రవంతిని గమనించాడు.
వెంటనే ఆమెకు కట్లు విప్పాడు. ఏం జరిగిందో తెలుసుకున్నాడు. ఆ తరువాత అనగా సుమారు 11.30 గంటల ప్రాంతంలో సమీపంలోనే ఉన్న శ్రీకాళహస్తి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ కు వెళ్లి స్రవంతి ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకాళహస్తి డీయస్పీ విశ్వనాథ్ వెంటనే తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దోపిడీ జరిగిన తీరును పరిశీలించారు. ఫిన్ కేర్ ఫైనాన్స్ సంస్థ పిలిపించి విచారించారు. శ్రీకాళహస్తి నుంచి బయటకు వెళ్లే అన్ని మార్గాల్లో అప్రమత్తం చేశారు.
తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డి పరిశీలన
శ్రీకాళహస్తి పట్టణ నడిబొడ్డున ఉన్న ఫిన్ కేర్ ఫైనాన్స్ సంస్థలో భారీ దోపిడీ జరగడంతో తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డి స్వయంగా శుక్రవారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కార్యాలయాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. దోపిడీ చేసిన తీరును మేనేజరు స్రవంతిని అడిగి తెలుసుకున్నారు. దోపిడీకి పాల్పడిన వ్యక్తులు తమిళం, హిందీ భాషల్లో మాట్లాడినట్లు మేనేజరు స్రవంతి పోలీసులకు చెప్పారు.
ఫైనాన్స్ సంస్థలో దోపిడీకి పాల్పడిన వారిని పట్టుకునేందుకు శ్రీకాళహస్తి, తిరుపతి పోలీసులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. కాగా ఘటన స్థలాన్ని క్లూస్ టీం కూడా పరిశీలించింది. పోలీసు జాగిలాలు శ్రీకాళహస్తి పట్టణంలోని వీయంసీ కూడలి వరకు వెళ్లినట్లు సమాచారం. ఇక శ్రీకాళహస్తి- పిచ్చాటూరు మార్గంలో రామచంద్రాపురం-రాజీవ్ నగర్ మధ్యన ఉన్న అయ్యప్పస్వామి ఆలయ పరిసరాల్లో మేనేజరు స్రవంతికి సంబంధించిన సెల్ ఫోన్ సిగ్నల్స్ లొకేషన్ చూపినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఎన్నెన్నో అనుమానాలు..?
శ్రీకాళహస్తి పట్టణం పెద్దమసీదువీధిలో గల ఫిన్ కేర్ ఫైనాన్స్ సంస్థలో జరిగిన భారీ దోపిడీకి సంబంధించి ఎన్నోఅనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టణ నడిబొడ్డున జనసమ్మర్ధం అధికంగా ఉండే ప్రాంతంలో ఈ ఫైనాన్స్ సంస్థ ఉంది. కూతవేటు దూరంలోనే శ్రీకాళహస్తి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ ఉంది. ఈ ఫైనాన్స్ సంస్థలో పనిచేసే కొంతమంది సిబ్బంది ఇదే భవనంలో పై అంతస్థులో అద్దెకు ఉంటున్నారు. దోపిడీ 10.30 నుంచి 11గంటల మధ్య జరిగింది. ఆ సమయంలో ఫైనాన్స్ సంస్థ తెరచి ఉంటారని దోపిడీ దొంగలకు ఎలా తెలుసు..? అప్పటి వరకు మేనేజరు స్రవంతి ఒక్కరే కార్యాలయంలో ఎందుకు ఉన్నట్లు..?
దోపిడీ జరిగే కొన్ని నిమిషాల ముందు విఘ్నేష్ అనే సంస్థ ఉద్యోగి ఎందుకు తన గదికి వెళ్లాడు..? ఆ తరువాత మళ్లీ అతడు ఎందుకు కిందకు వచ్చాడు..? పక్కనే పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ దోపిడీ జరిగిన సుమారు గంట తరువాత ఫిర్యాదు చేయడం వెనుక ఆంతర్యమేమిటి..? పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు పొంతన లేకుండా ఫిన్ కేర్ సిబ్బంది ఎందుకు సమాధానం చెబుతున్నట్టు..? ఇలా ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. ఈ ఘటనలో ఇంటి దొంగల హస్తం ఉందేమోననే దిశలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. వాస్తవాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ దోపిడీ ఘటన శ్రీకాళహస్తిలో సంచలనం కలిగించింది. ఇక్కడ ఫైనాన్స్ సంస్థల్లో కానీ.. బ్యాంకుల్లో కానీ ఇలాంటి ఘటన ఎపుడు చోటు చేసుకోలేదని స్థానికులు అంటున్నారు.
Discussion about this post