ఉండవిల్లి చంద్రబాబునాయుడు ఇంటి వద్ద ఒక పెద్ద హైడ్రామా చోటు చేసుకుంది. ఎంతగా బరితెగించి ప్రవర్తిస్తే.. అంతగా తమ తమ పార్టీ అధినాయకుల్లో కళ్లలో పడవచ్చునని, తమ రాజకీయ భవిష్యత్తు దవ్యంగా ఉంటుందని అనుకుంటూ నాయకులు తలపడ్డారు కొట్టుకున్నారు. ఉండివిల్లి ఎపిసోడ్ చివరికి అధికార పార్టీ ఎమ్మెల్యే అరెస్టు వరకు కూడా వెళ్లింది.
మామూలుగా అయితే జోగి రమేష్ కు పార్టీలో సానుభూతి రావాలి. అయితే అంతర్గతంగా జరుగుతున్న చర్చలను బట్టి తెలుస్తున్నదేంటంటే.. సానుభూతి కాదు కదా.. ఆయన మీద కొత్త అనుమానాలు కూడా షురూ అయ్యాయి. అసలు వివాదం తీవ్రత ఎంత? దాని పట్ల జోగి రమేష్ స్పందన ఏమిటి? అనేవి తరచిచూస్తే.. కొంచెం అతి చేశాడనే ప్రచారం పార్టీలోనే జరుగుతోంది. ఇదంతా త్వరలో జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేపడితే తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి, తనకు అవకాశాలను మెరుగుపరచుకోవడానికే అనే ప్రచారం జరుగుతోంది.
జోగిరమేష్ వ్యవహరించిన తీరు మీద, చేసిన రాద్ధాంతం మీద సొంత పార్టీలోనే వ్యక్తమవుతున్న అనుమానాలు ఇలా ఉన్నాయి..
తెలుగుదేశం నేత అయ్యన్నపాత్రుడు జగన్ ను తిడితే.. దానికి జవాబుగా చంద్రబాబునాయుడు ఇంటమీద దాడికి వెళ్లడమే చిత్రంగా ఉంది. ఆ తిట్లకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే అయ్యన్నపాత్రుడు నే నిలదీయాలి, ఆయనతోనే తేల్చుకోవాలి గానీ.. ఎక్కడ రాద్ధాంతం చేస్తే తనకు ఎక్కువ మైలేజీ వస్తుందో చూసుకుని.. అక్కడ గొడవచేశారని పలువురు అనుకుంటున్నారు.
నిజానికి, జోగి రమేష్ లో సొంత మైలేజీ కోసం తపనే తప్ప తన నిరసన తెలియజెప్పే నిజమైన ఉద్దేశం లేదని అలా ఉండిఉంటే.. పార్టీలో ఎవ్వరికీ చెప్పకుండా.. అక్కడకి కూతవేటు దూరంలోనే ఉండే ఇతర నాయకుల్ని వెంటబెట్టుకోకుండా వెళ్లేవారే కాదని కూడా కొందరు అంటున్నారు.
జోగి రమేష్ ఒక వ్యూహం ప్రకారం.. తనకు అనుకూలంగా ఉండే కొంత మంది మీడియా వారికి మాత్రం సమాచారం ఇచ్చి.. వారు అక్కడకు వచ్చి తన ఆగడాల్ని కవర్ చేసేలా ప్లాన్ చేసుకుని.. ఈగొడవ నడిపించారని వినిపిస్తోంది.
జగన్మోహన్ రెడ్డి మీద అత్యంత అనుచితంగా, హేయంగా విరుచుకుపడే ఇతర నాయకులు ఎందరో ఉండగా.. బుడ్డా వెంకన్నతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని.. టీవీ కెమెరాల్లో చక్కగా కనిపించడం కోసమే అన్నట్టుగా ఒకరిమీద ఒకరు రంకెలు వేసుకుంటూ డ్రామాను రక్తి కట్టించారని పార్టీలో వారు అనుకుంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సగం పదవీకాలం ఇప్పటికే పూర్తయింది. రెండున్నర సంవత్సరాల తర్వాత మంత్రివర్గంలో మార్పులుంటాయని ఆయన తొలుతే చెప్పారు. త్వరలో పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని అంతా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. మంత్రి పదవి దక్కించుకోవడం కోసం, సీఎం దృష్టిలో మంచి మార్కులు తెచ్చుకోవడం కోసం జోగి రమేష్ ఇలాంటి నాటకాలు ఆడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. మరి ఈ విమర్శలన్నీ అబద్ధమని, తను చిత్తశుద్ధితోనే ఆవేదనతోనే గొడవడపడ్డానని జోగిరమేష్ ఎలా నిరూపించుకుంటారో చూడాలి.
.

Discussion about this post