రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఎట్టకేలకు స్పందించారు. ఉద్యోగ సంఘాలతో భేటీ కావడానికి సుముఖత వ్యక్తం చేశారు. ఇందుకోసం గురువారం ముహూర్తం ఖరారు చేశారు. చర్చలకు జగన్ అంగీకారం తెలపడంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. జగన్ నుంచి శుభవార్త వస్తుందని కూడా వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇందులో భాగంగా ఈ రోజు (బుధవారం) రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖాధికారులతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. చర్చల సారాంశాన్ని అధికారులు సీఎం జగన్ ముందు పెట్టనున్నారు.
రాష్ట్రంలో తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. పీఆర్సీపై తుది ప్రకటన చేయాలన్నది వారి ప్రధాన డిమాండ్. దీంతో పాటు మొత్తం 71 సమస్యలు పరిష్కారం చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చలు సఫలం కాలేదు.
ఈ నేపథ్యంలో ఈ నెల 9న కార్యాచరణ ప్రణాళిక సిద్ధం ప్రకటిస్తామని ఐకాస నేతలు తేల్చి చెప్పారు. ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రిని కలవకుండా ‘ఆ ముగ్గురు’ అడ్డుకుంటున్నారని ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు.
ఈ విషయంపై ఆదర్శిని డాట్ కామ్ ఓ ప్రత్యేక కథనం కూడా అందించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుముఖంగా ఉంటే.. అసలు అడ్డుకోగలిగిన వారు ఎవరున్నారు.. అంటూ ఆ కథనం వివరించింది. ‘జగనన్న కలవదలచుకుంటే మధ్యలో వాళ్లెవరు’ అనే శీర్షికతో ఆ కథనం వచ్చింది. ఈలోగా ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు శుభవార్త వచ్చింది.
ఈ పరిణామాల తరువాత ఉద్యోగ సంఘాల నేతలతో స్వయంగా చర్చలు జరపడానికి జగన్ అంగీకరించారు. ఇది శుభపరిణామం అని చెప్పవచ్చు. ముఖ్యంగా పీఆర్సీ పై తుది ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఉద్యోగుల సమస్యల పట్ల జగన్ కూడా సానుకూలంగా స్పందించాలని ఆశిద్దాం.
.