తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజైన మంగళవారం రాత్రి శ్రీ రామచంద్ర పుష్కరిణిలో స్వామివారు ఏడుచుట్లు తిరిగి భక్తులకు అభయమిచారు .
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.
సాయంత్రం 6.30 గంటలకు శ్రీ సీతారామలక్ష్మణులు ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీరామచంద్ర పుష్కరిణికి చేరుకున్నారు. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు ఆశీనులై పుష్కరిణిలో 7 చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు మారుతి ప్రసాద్, ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో మోహన్, సూపరింటెండెంట్ రమేష్ కుమార్ విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
.