రకరకాల మనుషుల మనస్తత్వాల సమ్మిళితమే సమాజం. అలాంటి సమాజంలో సజావుగా, సాఫీగా మనుగడ సాగించాలంటే రెండింటిని ఎప్పుడూ మన చెంత ఉంచుకోవాలి.
అవి ఏమిటంటే..
Smile
Silence
ముఖంలో చెదరని చిరునవ్వుని, మాటలో పొదుపుని ఆభరణాలుగా చేసుకుని మనుషులతో మసలుకోగలిగితే నూటికి తొంభై శాతం సమస్యలు మన దరి చేరవు.
మరి అలా ఉండడం సాధ్యమేనా? అందుకు మనం అనుసరించాల్సిన పద్దతులు ఏమిటి?
కోపం, ద్వేషం, అసూయ, అసహనం, నిస్పృహ, నిరాశ, అనేవి ప్రతి మనిషిలో అంతర్లీనంగా ఉంటాయి. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు అవి బయటపడి మనషుల మనస్సులను గాయపరుస్తాయి. అలాంటి సందర్భాలలోనే మనం సంయమనం పాటించి చిరునవ్వు, నిశ్శబ్దం అనే బ్రహ్మాస్త్రాలను మనపై కోపం ప్రదర్శించిన వారిపై సంధించాలి.
ఎలాగంటే.. సాధారణంగా వ్యక్తుల మధ్య గొడవలు రావటానికి ప్రధాన కారణం ఏంటంటే..
‘నాకు నచ్చినట్లే ఉండాలని, నేను అనుకున్నదే జరగాలని, నేను చెప్పినట్లే వినాలని’ ప్రతిఒక్కరూ తనకు తాను అనుకోవడం వల్లే. అది అసాధ్యమని తెలిసినా “అహంకారం” మనల్ని ఆ వైపుకు నడిపిస్తుంది.
మామూలుగా భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య, బంధువుల మధ్య గొడవలు అనేటివి వస్తుంటాయి. ఒక్కోసారి ఇతరుల వైఖరుల వల్ల కూడా గొడవలు జరుగుతుంటాయి.
భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు ఒక విధంగా, స్నేహితుల మధ్య గొడవలు వచ్చినప్పుడు ఇంకోవిధంగా, బంధువుల మధ్య గొడవలు వచ్చినప్పుడు మరోవిధంగా మనం కోపాన్ని ప్రదర్శిస్తుంటాం. ఎవరిమధ్య గొడవలు వచ్చినా కోపం అనేది కామన్ పాయింట్ అయినప్పటికీ దాన్ని తీవ్రతలో మాత్రం తేడాలు ఉంటాయి.
ఏ కారణంచేతనైనా ఇతరులు మనమీద కోపం ప్రదర్శించినప్పుడు వెంటనే స్పదించకుండా మౌనం వహించి ఒక చిరునవ్వు వాళ్ళ వైపు విసిరామనుకోండి. ఎదుటి వ్యక్తిలో కోపం సగానికి సగం తగ్గిపోతుంది. ఆ తర్వాత వాళ్ళల్లో కోపం పూర్తిగా సద్దుమణిగిన తర్వాత సామరస్యంగా విషయం చెబితే అప్పుడు మనం చెప్పేది అవతలి వాళ్ళు వింటారు.
అలాకాకుండా మనం కూడా అదే స్థాయిలో కోపాన్ని ప్రదర్శిస్తే అనర్థాలు జరుగుతాయి.
ఉదాహరణకు: ఏ కారణంచేతనైనా భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి ఒకరిపై మరొకరు ద్వేషాన్ని పెంచుకుని నిరంతరం కోపాన్ని ప్రదర్శించుకుంటున్నారనుకోండి. అప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరు ప్రతిస్పందించకుండా మౌనం వహించి తన పని తాను చేసుకుంటూ చిరునవ్వుతో మెలిగారనుకోండి. కొంతకాలానికి కోపం ప్రదర్శించేవారిలో క్రమేపి మార్పు వస్తుంది. అంతేకాదు ఇంతకాలం అనవసరంగా కోపం పెంచుకుని కాలాన్ని వృధా చేసుకోవడంతో పాటు సుఖమయ జీవితాన్ని చేజార్చుకున్నాననే భావం వాళ్ళల్లో కలిగి పశ్చాత్తాపపడతారు.
also read : నవతరం అన్నమయ్య .. సిరివెన్నెల సీతారామశాస్త్రి
ఒకవేళ నీవు మౌనంగా ఉన్నా నీపై కోపాన్ని ప్రదర్శించేవారిలో ఎలాంటి మార్పు కనబడకపోతే వాళ్ళ మానాన వాళ్ళను వదిలేసి నీ పని నీవు చేసుకుంటూ ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్ళడమే ఉత్తమం.
ఎందుకంటే.. ఈ ప్రపంచం ఎంతో విశాలమైనది. అందమైనది కూడా. అలాంటి ప్రపంచంలో ఎవరో ఒకరు నిన్ను ద్వేషించారనో, అసహ్యించుకున్నారనో, లేకపోతే కోప్పడ్డారనో అదే ఆలోచిస్తూ కుంగుబాటుకు గురయితే జీవితం నాశనం అవుతుంది.
కాబట్టి.. నిన్ను ప్రేమించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు ఈ సమాజంలో ఎంతోమంది ఉండవచ్చు. వాళ్ళతో నీ కష్టసుఖాలను పంచుకుంటూ, ప్రకృతిని ఆస్వాదిస్తూ, నీకిష్టమైన వ్యాపకంతో మమేకమై మౌనంగా చిరునవ్వుతో కాలం గడిపేస్తే జీవితం సఫలీకృతమవుతుంది.
…దేవీప్రసాద్ ఒబ్బు
9866251159

EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
.