అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరువేంకటాద్రీశుని సేవలో తరించే భక్తులకు నిజాయితీతో చేసే సేవ పుణ్యం ఇస్తుందనే విశ్వాసం తరువాత.. కానీ అనల్పమైన ఆత్మతృప్తిని తప్పకుండా ఇస్తుంది. అంతే కాదు.. శ్రీవారి భక్తుల అభినందనల్ని దీవెనల్ని కూడా పుష్కలంగా ఇస్తుంది.
ఈ దృష్టాంతానికి నిదర్శనమే తాజాగా తిరుమలలోని సంఘటన. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీవారి భక్తురాలు నవత నవంబరు 6వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుమలలో మొబైల్ ఫోన్ పోగోట్టుకున్నారు. వెంటనే తిరుమలలోని విజిలెన్స్ కంట్రోల్ రూంకు వెళ్ళి ఫిర్యాదు చేశారు. కంట్రోల్ రూం సిబ్బంది వెంటనే స్పందించి ఆమె తిరుగాడిన ప్రాంతాల్లోని సిసి కెమెరాల పుటేజి పరిశీలించి గంటలోపు ఆమె మొబైల్ ఫోన్‌ను గుర్తించి అప్పగించారు.
తాను ఫిర్యాదు చేయడానికి వెళ్ళినప్పటి నుంచి ఫోన్ తనకు అప్పగించేంత వరకు విజిలెన్స్ కంట్రోల్ రూం సిబ్బంది ఎంతో గౌరవంగా, స్నేహ పూర్వకంగా వ్యవహరించారని ఆమె అభినందించారు.
కంట్రోల్ రూం సిబ్బంది ఎల్లవేళల ఇదేవిధంగా భక్తులకు సేవలు అందించాలని కోరారు. ఈమేరకు శుక్రవారం టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డికి ఆమె మెయిల్ పంపారు.
అందరు పోలీసుల్లో ఈ స్ఫూర్తి ఉంటుందా..
పోయిన్ ఫోన్ ను వెతికి తిరిగి అప్పగించడంలో తిరుమల విజిలెన్స్ సిబ్బంది పాత్ర నిజంగా అభినందనీయమే. కానీ.. ఇదే స్ఫూర్తి అందరిలోనూ ఉంటుందా అనేది అనుమానం. ప్రధానంగా ఫోను చోరీకి సంబంధించి పోలీసులకు ఫిర్యాదులు ఇస్తే.. కనీసం వాటిని నమోదు చేయకుండా తమచుట్టూ పోలీసులు తిప్పుకునే సందర్భాలు కూడా అనేకం కనిపిస్తుంటాయి.
ఇలాంటి నేపథ్యంలోనే ఇంత పద్ధతిగా వ్యవహరించిన టీటీడీ విజిలెన్స్ సిబ్బందిని ఖచ్చితంగా అభినందించి తీరాలి.
.
Discussion about this post