రంగం ఏదైనా కావచ్చు… దిగజారడానికి వ్యక్తిగత దౌర్భల్యమే కారణం.
గీత రచయిత కులశేఖర్ అనామకంగా కన్నుమూయడం బాధాకరం. ఈ నేపథ్యంలో ఆయన గురించిన వార్తా కథనాలు, సోషల్ మీడియాలో పోస్టులు అనేకానేకం వచ్చాయి. వస్తున్నాయి. కులశేఖర్ గురించి ఆయనతో స్వల్ప కాలం పరిచయం ఉన్నవారు, ఆయనతో కలసి పాత్రికేయ వృత్తిలో, సినీ ప్రస్థానంలో కొనసాగినవారు సంతాపం వ్యక్తం చేశారు. కులశేఖర్ ఒక వెలుగు వెలిగి తదనంతర కాలంలో వృత్తిపరంగా, వ్యక్తిగతంగా దెబ్బ తిన్నారు. అవకాశాలు లేకుండాపోయాయి. కుటుంబ జీవితం ఛిద్రమైంది. ఆలయాల్లో చోరీ చేసినట్టుగా కేసులుపడ్డాయి. జైలుకు కూడా వెళ్లారు. ఈ కేసులు అనేవి కులశేఖర్ పతనావస్థను వెల్లడించాయి. ఆపైన కొన్ని యూట్యూబ్ ఛానెళ్లలో ఆయన చెప్పిన మాటలను ఆధారంగా చేసుకొని– కులశేఖర్ అలా అయిపోవడానికి కారణం సినిమా పరిశ్రమలోని జాడ్యాలే కారణం అనీ, ఆయనలోని విద్వత్తుకి తగిన గుర్తింపు దక్కలేదని, ఆయన్ని తొక్కేస్తూ కుట్రలు చేశారంటూ వ్యాఖ్యలు కూడా చేశారు.
కులశేఖర్ అనామకంగా చనిపోవడం అనేది బాధాకరమే. కులశేఖర్ మాత్రమే కాదు ఏ వ్యక్తీ అనామకంగా చనిపోకూడదు. మరణం కూడా గౌరవపూర్వకంగా ఉండాలి. అయితే ఇక్కడ కులశేఖర్ కు ఆ పరిస్థితి ఎందుకు దాపురించింది? ఇందులో సినీ పరిశ్రమ బాధ్యత ఏమైనా ఉందా? సినిమా జాడ్యాలు పాత్ర ఏమిటి? అనేది మాట్లాడుకోవాలి.
సినిమా పరిశ్రమలోకి కులశేఖర్ అడుగుపెట్టిన సమయం చాలా ఉత్తమమైనదే. అప్పటికి ఒక వెలుగు వెలిగిన వేటూరి సుందర రామమూర్తి తన కలం వేగం తగ్గించారు. సినిమా పరిశ్రమలో వినే ‘సింగిల్ కార్డు’తో ఆయన పాటలు రాయడం అరుదైపోయింది. శేఖర్ కమ్ముల మాత్రం ఆనంద్, గోదావరి చిత్రాల్లో రాయించారు. అప్పటికి సిరివెన్నెల సీతారామశాస్త్రి ఉధృతంగా ఉన్నారు. కృష్ణవంశీ లాంటి దర్శకులు, ఎమ్మెస్ రాజు, స్రవంతి రవికిషోర్ లాంటి నిర్మాతలు శాస్త్రి గారితోనే పాటలు రాయించుకొనేందుకు ఎన్నాళ్లు అయినా వేచి చూస్తాము అనేవారు. వీరి మధ్య చంద్రబోస్ కుర్రకారుకు నచ్చే పాటలు రాయడంలో మునిగి ఉన్నారు. ఆ సమయంలో కొత్త నిర్మాతలు, కొత్త దర్శకులు, సంగీత దర్శకులు తమకు తగ్గ, తమ బడ్జెట్ స్థాయిలో ఉండే కొత్త కలాన్ని వెదుక్కొన్నారు. అలాంటి సమయంలో ఉషాకిరణ్ మూవీస్ 2000లో స్వల్ప బడ్జెట్ తో తీసిన ‘చిత్రం’ సినిమాలో అందరూ కొత్త నటులే. దర్శకుడిగా తేజకు అదే మొదటి సినిమా. ఆర్పీ పట్నాయక్ అప్పటికి ఒకట్రెండు సినిమాలకు పనిచేసి ఉన్నారు. ఆ సినిమాకు గీత రచయితగా కులశేఖర్ ను ఎంచుకున్నారు. అందరూ కులశేఖర్ కు అదే మొదటి చిత్రం అంటారు. కానీ కులశేఖర్ అప్పటికే 1999లో వచ్చిన నాంది (శూల్ సినిమాకు అనువాదం)కి పాటలు రాశారు.
ఇదికూడా చదవండి : ఆర్జీవీకి ఆశ్రయమిస్తున్న నటుడెవరంటే..
‘చిత్రం’ సినిమాలో ప్రతి పాట తెలుగునాట మారుమోగింది. సినిమా ఎంత బాగా ఆడిందో అదే స్థాయిలో పాటలు కుర్రకారు నోళ్లలో నానాయి. ఆ తరవాత తేజ– ఆర్పీ పట్నాయక్– కులశేఖర్ ఆ త్రయం సినిమా పరిశ్రమలో, సినిమా ప్రియుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కులశేఖర్ ముందుకి నవతరం దర్శకులు, సంగీత దర్శకులు, నిర్మాతలు క్యూ కట్టారు. లబ్ధ ప్రతిష్టులైన దర్శకులు, నిర్మాతల నుంచి పిలుపులు వచ్చాయి. ‘సీతారామశాస్త్రి తరహాలో రాయగల రచయిత వచ్చారు’ అనే మాటే వినిపించింది. ఒక విధంగా కులశేఖర్ ఆ స్థాయిలో రాయడానికి సీతారామశాస్త్రి శిష్యరికం ఎంతో పని చేసింది.
కులశేఖర్ ఆ స్థాయిని, గుర్తింపును మోయడంలో, బ్యాలెన్స్ చేయడంలోనే ఇబ్బంది పడ్డాడు. పెద్ద సంస్థలు, పెద్ద వ్యక్తులే ముఖ్యం అనుకున్నాడు. చిన్నవారిని చులకనగా చూడటం, వారి పట్ల కనీస మర్యాదను చూపకపోవడం జరిగిందనేది చిత్ర పరిశ్రమలో వినిపించే మాట. సీతారామ శాస్త్రి కావచ్చు, వేటూరి కావచ్చు అలా వ్యవహరించేవారు కారట. తన పాటకు తగ్గ పారితోషికం ఇవ్వలేరనో, సినిమా తీసే వ్యవహారం కాదో అని గుర్తిస్తే మర్యాదగా చెప్పి పంపేవారు. ఒకవేళ కొత్త వ్యక్తులు, చిన్న స్థాయి వాళ్ళు… కానీ విషయం ఉంది అనుకొంటే వారిద్దరూ కావచ్చు, చంద్రబోస్ కావచ్చు అవకాశం వదిలేవారు కాదు. కులశేఖర్ మాదిరే వేటూరి అనుకొంటే శేఖర్ కమ్ముల తీసిన ‘ఆనంద్’కు ఎందుకు పాటలు రాస్తారు? కులశేఖర్ తరవాత వచ్చిన భాస్కరభట్ల రవికుమార్ ఇంకా కొనసాగుతూ ఉన్నారు అంటే కారణం… పరిశ్రమలోని వ్యక్తులతో ఆయన సఖ్యంగా ఉండటమే. చిన్నవారిపట్లా మర్యాదగా వ్యవహరించడమే. ఒక్కోసారి చిన్న చిత్రంలోని పాట కూడా బంపర్ హిట్ కావచ్చు. అది మరో పది పాతిక పాటలను తీసుకువస్తుంది. ఈ లాజిక్ ను భాస్కరభట్ల పట్టుకొన్నాడు… కులశేఖర్ వదులుకొన్నాడు.
కులశేఖర్ ఎంతగా కొత్తవాళ్లను కాదనుకొన్నా– పెద్ద చిత్రాల్లో తగిన అవకాశాలే దక్కాయి. మృగరాజు, ఘర్షణ, సంతోషం లాంటి పెద్ద హీరోల చిత్రాలకు పాటలు రాశారు. అదే సమయంలో ఆయన ఆర్థిక క్రమశిక్షణ పాటించలేకపోయారు అని సన్నిహితులే చెబుతారు. ప్రముఖ బిల్డర్ ఒకరు తను ఎంతగానో పూజించే ఒక స్వామీజీ మీద ఉన్న ప్రేమతో ఖరీదైన ప్రాంతంలో కులశేఖర్ కు ఒక బాగా ఖరీదైన ఫ్లాట్ ను బహుమతిగా ఇచ్చారు. తదనంతర కాలంలో ఆ ఫ్లాట్ ను కులశేఖర్ అమ్మేసుకున్నారు. తన సన్నిహితులతోనూ, బంధువులతోనూ సత్సంబంధాలు కొనసాగించలేదు. అలాగని చిత్ర సీమలో తనకు వెన్నంటి ఉన్నవారితోనూ స్నేహపూర్వకంగా ఉండలేకపోయారు. ఈ దశలో చేసిన దర్శకత్వం కూడా ఆయన జీవితానికి పైమెట్టు కాలేదు సరికదా పాకుడురాయిగా మిగిలింది.
కులశేఖర్ వృత్తి జీవితంలో ఎగుడుదిగుళ్లను పరిశీలిస్తే– ఆయనలోని విద్వత్తు ఉంది కాబట్టే అవకాశాలు వరుస కట్టాయి. పెద్దా చిన్నా తేడా లేకుండా సినీ ప్రముఖులు ఆయనతో పాటలు రాయించుకోవాలని చూశారు. వ్యక్తిగత వ్యవహార శైలి, వ్యసనాలు అనేవి ఏవీ కూడా ఆయనకు సినిమా పరిశ్రమ అంటించలేదు. పరిశ్రమ ఎప్పుడూ ఎవరినీ పాడు చేయాలని చూడదు. వారి విద్వత్తును, కళను వినియోగించుకోవాలనే చూస్తుంది. ఇక్కడ మన విద్వత్తు ఎంత ముఖ్యమో క్రమశిక్షణ, ఆటిట్యూడ్ కూడా అంతే ముఖ్యం. ప్రముఖ నిర్మాత రామానాయుడు ఒక మాట చెప్పేవారు ‘సినీ పరిశ్రమలో పెద్దాచిన్నా తేడా లేకుండా ప్రతి ఒక్కరితో మంచిగా మాట్లాడాలి. ఈ రోజు చిన్నవాడు అనుకొన్నవాడు రేపటి రోజున పెద్ద స్థాయిలో నిలబడతాడు. సినీ పరిశ్రమలో ఉన్న మ్యాజిక్కే అది. కాబట్టి ప్రతి ఒక్కరితో మర్యాదగా మాట్లాడితే ఏమీపోదు కదా’. ఈ మాటలు ఎంత లోతైనవో అర్థం చేసుకోలేక చాలా మంది ఇమేజ్ మాయలోపడి భవిష్యత్తును చేతులారా చెడగొట్టుకున్నారు. ఇక వ్యసనాలు అనేవి మనిషిని డామినేట్ చేస్తే ఎవరూ ఎదగలేరు. దేనికైనా హద్దులు ఉంటాయి. అలాగే మన చుట్టూ ఎవరు ఉన్నారు… అందులో ఎవరు శ్రేయోభిలాషులో గుర్తించికపోతే ఎవరైనా దెబ్బ తింటారు.
మన వ్యక్తిగత దౌర్భల్యాలే ఎదుగుదలకు విఘాతం అవుతాయి. అందుకు సినీ పరిశ్రమను నిందించడం వృథా. వ్యక్తిగత ఆలోచనల్లోనే వక్ర మార్గం ఉన్నా, వ్యసనాలు ఎక్కువ అయినా అది ఏ వృత్తిలో ఉన్నవారినైనా వెనక్కి నెట్టేస్తుంది. అందుకు సినిమా జాడ్యాలు లాంటి మాటలు విసరడం వృథా. ఒకటి మాత్రం వాస్తవం – సినిమా పరిశ్రమలో నెగ్గుకు రావాలంటే గుమ్మడికాయంత జ్ఞానంతోపాటు ఆవగింజంత అణకువ కూడా కావాలి.
..పెరియాళ్వార్
Discussion about this post