రాంగోపాల్ వర్మ పరారీలో ఉన్నారని.. రాంగోపాల్ వర్మను అరెస్టు చేయడానికి ప్రకాశం జిల్లా పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారని రకరకాల వార్తలు వస్తున్నాయి. తాను విచారణకు హాజరుకావాల్సిన తేదీకి ముందురోజు కోయంబత్తూరు ఎయిర్ పోర్టులో ఉన్నట్టుగా వర్మ పెట్టిన ట్వీట్ ను అనుసరించి.. ఒక పోలీసు బృందం తమిళనాడు వెళ్లి అక్కడ గాలిస్తున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి.
ఈలోగా.. రాంగోపాల్ వర్మ వరుస వీడియోలు విడుదల చేస్తున్నారు. తను చేసిన పనిలో నేరం లేదని, ఈ కేసులేవీ తనకు వర్తించవని అంటున్నారు. మరోవైపు కొన్ని టీవీ ఛానెళ్లు ఆయనతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ కూడా చేసి ప్రసారం చేస్తున్నాయి. మరి షూటింగులో ఉండడం వల్ల.. పోలీసు విచారణకు కూడా హాజరు కాలేనని చెప్పిన వర్మ, టీవీ ఛానెళ్ల ఇంటర్వ్యూలకు మాత్రం ఎలా అందుబాటులోకి వస్తున్నారు? ఇంతకూ ఆయన ఎక్కడ ఉన్నారు?
విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. దర్శకుడు రాంగోపాల్ వర్మ హైదరాబాదు శివార్లలోనే ఉన్నట్టుగా సమాచారం. ఒక నటుడి ఫాంహౌస్ లో ఉన్నట్టుగా ఆయనకోసం ప్రకాశం జిల్లా పోలీసులు వచ్చిన తొలిరోజునే గుసగుసలు వినిపించాయి. టీవీ ఇంటర్వ్యూలు కూడా జరిగిన తర్వాత ఆ గుసగుసలు మరింతగా ధ్రువపడ్డాయి.
దక్షిణాదికే చెందిన ఒక ప్రముఖ నటుడికి హైదరాబాదు నగర శివార్లలో ఉండే ఫాంహౌస్ లోనే రాంగోపాల్ వర్మ ఆశ్రయం పొందుతున్నట్టుగా సమాచారం. సదరు నటుడు కూడా చిన్నవారేం కాదు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ప్రముఖుడు! విఫల రాజకీయ నాయకుడు. భారతీయ జనతా పార్టీ మీద, మోడీ విధానాల మీద నిత్యం విమర్శలు కురిపిస్తూ ఉండే వ్యక్తి! ఇటీవలి కాలంలో ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మీద కూడా విమర్శలు చేయడం ద్వారా కొన్నాళ్లు వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. అలాంటి వివాదాస్పద నటుడి ఫాంహౌస్ లోనే రాంగోపాల్ వర్మ ఆశ్రయం పొందుతున్నట్టుగా సమాచారం. ఆయన హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మీద తీర్పు రావాల్సి ఉన్నందున అప్పటిదాకా అక్కడే సేదతీరుతూ వేచి ఉండి, హైకోర్టు ఇచ్చే తీర్పును బట్టి తదుపరి కార్యచరణ నిర్ణయించుకోవాలనుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
ఇదికూడా చదవండి : కులశేఖర్ బతుకుపాఠం.. దౌర్బల్యాలే పాకుడురాళ్లు
రాంగోపాల్ వర్మ పరారీలో ఉన్నారని అనుకోవాల్సిన అసవరం లేదు. ఆయన కేవలం అజ్ఞాతంలో మాత్రమే ఉన్నారు. నిజానికి ఇది కూడా అనవసరమైన అజ్ఞాతం! అలాగని అజ్ఞాతంలో ఉన్న వ్యక్తి మిన్నకుండిపోకుండా.. వరుస వీడియోలు విడుదల చేస్తున్నారు. ఎలాంటి వాదనను ఆయన కోర్టులో వినిపించాలో.. లేదా, పోలీసుల విచారణకు హాజరైనప్పుడు వారికి వినిపించాలో.. అవన్నీ తన వీడియోలలో చెప్పుకుంటున్నారు. అది చాలదన్నట్టుగా తనకు అనుకూలురైన మీడియా టీవీ ఛానెళ్ల వారిని పిలుచుకుని వారికి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
కానీ రాంగోపాల్ వర్మ తెలుసుకోవాల్సిన వాస్తవం ఒకటుంది. ఇలా పోలీసుల కళ్లుగప్పి అజ్ఞాతంలో ఉన్న వాళ్లు.. మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడాన్ని హీరోయిజంగా భావించవచ్చు. ఇలాంటి ఇంటర్వ్యూల వల్ల ఏదైనా చట్టపరమైన చిక్కు వస్తే.. అది మీడియా వారిని పెద్దగా ఇబ్బంది పెట్టదు. కానీ.. పోలీసుల కళ్లుగప్పిన వారినే చికాకు పెడుతుంది.
Discussion about this post