ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ వి.శేఖర్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన బుధవారం శ్రీకాళహస్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, బాబు అగ్రహారం పురపాలక ఉన్నత పాఠశాల, ఏఎం పుత్తూరు ప్రాథమికోన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల, భాస్కర్ పేట లోని పురపాలక ఉన్నత పాఠశాల లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా బాబు అగ్రహారం, ఏఎం పుత్తూరు ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ బాలుర పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి శేఖర్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. ప్రతి రోజూ ప్రభుత్వం ఇచ్చిన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలన్నారు. ఈ నిబంధన పాటించని వారిపై చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
ఇక పదవ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నాయని… అందుకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయాలని కోరారు. విద్యార్థులు కూడా పరీక్షల పై శ్రద్ధ చూపాలని సూచించారు. ఎంతవరకు సిలబస్ పూర్తయిందో సంబంధిత ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కోరడంతో పాటు.. ఇంటి నుంచి విద్యార్థులు ఎవరు కూడా క్యారియర్లు భోజనం తెచ్చుకో రాదని సూచించారు.
అయితే బాబు అగ్రహారం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ప్రతి మంగళవారం విద్యార్థులకు అందించే పులిహోర టమాటా పప్పు సరిగ్గా లేదని.. దీని స్థానంలో పెరుగన్నం ఏర్పాటు చేస్తే బాగుంటుందని జిల్లా విద్యా శాఖ అధికారి దృష్టికి ఓ విద్యార్థి తండ్రి తీసుకువచ్చారు.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి భువనేశ్వరి సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సీఆర్ పీ లు, ఎంఈవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
.