పట్టభద్రులకోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్రసమితి విజయం సాధించడం అనేది ఆ పార్టీకి నైతికంగా చాలా బలాన్నిచ్చే అంశం. నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికలో దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఆ ప్రభావం.. అధికార టీఆర్ఎస్‌కు అనుకూలంగానే ఉంటుంది.
దుబ్బాకలో తెరాస ఎమ్మెల్యే మరణించినప్పటికీ.. ఉపఎన్నికలో ఆ సానుభూతిని తోసిరాజని నెగ్గిన బీజేపీ గెలుపు.. కేవలం వాపు మాత్రమే అని ఈ ఎన్నికలతో తెరాస నిరూపించింది. విద్యావంతుల్లో కూడా తమ పార్టీకి మంచి బలం ఉందని నిరూపించుకుంది. సాగర్ ఎమ్మెల్యేను గెలిపించుకోడానికి కూడా ఈ విజయం బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు.
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాగానే తమకు తిరుగులేదని బీజేపీ అనుకుంది. వారికి గట్టి దెబ్బే తగిలింది. పైగా సాగర్ ఉపఎన్నికతో పాటూ ఖమ్మం మునిసిపల్ ఎన్నికలపై వారు భారీగా ఆశలు పెట్టుకుని ఉండగా.. ఆ రెండుజిల్లాలతో కలిసిన ఎమ్మెల్సీ స్థానంలో పల్లా రాజేశ్వరరెడ్డి తిరుగులేని విజయాన్ని నమోదు చేయడం విశేషం. ఈ నేపథ్యంలో బీజేపీ అలర్ట్ అవుతోంది.
సాగర్ విషయానికి వస్తే.. అధికార తెరాసకు ఎడ్వాంటేజీ ఉంటుందని.. స్థానికంగా మంచి పేరున్న సీనియర్ నేత జానారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా గట్టిపోటీ ఇస్తారనే ప్రచారం ముమ్మరంగా ఉంది. అయితే.. బీజేపీ దుబ్బాక తరహాలో.. ఎలాంటి ప్రచార గిమ్మిక్కులను అనుసరిస్తుందో.. అక్కడ ఎంత మేరకు తమ బలాన్ని నిరూపించుకోగలుగుతుందో చూడాలి.
.

Discussion about this post