‘మూర్తి’ వాక్కు : హిందూఆలయాలను దోచుకోవడానికి ఇవాళ కాదు.. సుమారు 35 ఏళ్ల కిందటే.. ఒక వ్యవస్థీకృతమైన మార్గం ఏర్పడింది. ఇప్పటి ప్రభుత్వాలు.. ఆ దోపిడీ మార్గాన్ని మరింత ఆధునీకరించి.. దేవాలయాలనుంచి ధనం అనే రక్తం పిండుకుంటూ.. అదే ఆలయాలను మరింత విస్మరిస్తున్నాయి.
అంతర్వేదిలో రధం దహనంతో ప్రారంభమై.. రామతీర్ధం విగ్రహ ధ్వంసం వరకూ 140 దేవాలయాలపై దాడులు జరిగాయి. ఆగ్రహించిన హిందూ సమాజం నిరసనకు దిగింది. మన దేవాలయాలను వాటి సంపదను, పవిత్రతను కాపాడలేకపోతున్న ప్రభుత్వాలు ఏ హక్కుతో పెత్తనం చేస్తున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతూ దేవాలయాలపై సర్కారు కర్రపెత్తనం ఎందుకు చేస్తోంది. అసలు ఎలా చేయగలుగుతోంది? వారికి ఆ అధికారమే లేదు.. ఆ ధైర్యం ఎలా వచ్చింది?
దేవాలయాల నిర్వహణ హక్కు హిందూ సమాజానిదే..
హిందూ దేవాలయాలపై అధికారం చెలాయించే హక్కు ప్రభుత్వానికి ఉందా అంటే లేదనేది రాజ్యాంగ నిఫుణుల వాద న. సర్కారు చూపిస్తున్న రాజ్యాంగ అధికరణం 25(2) A ప్రకారం మన మత ఆచరణతో సంబంధం ఉన్న ఆర్ధిక పరమైన లేదా సెక్యులర్ వ్యవహారాలు క్రమబద్ధం చేసేందుకు కావాల్సిన శాసనాలు చేయగల అధికారం మాత్రమే ప్రభుత్వానికి ఉంటుంది. అంటే ‘ఏవైనా దేవాలయాల్లో ఆర్థిక అవకతవకలు జరిగితే వాటిని క్రమబద్ధీకరించటం మాత్రమే ప్రభుత్వం భాద్యత’ అని అర్దం అంతే కానీ దేవాలయాల్లో తిష్ఠ వేయమని కాదు. ఇటు 26వ అధికరణం ప్రకారం- ప్రతి మతానికి తమకు సంబంధించిన మతపరమైన అంశాలు సొంతంగా నిర్వహించుకునే హక్కు ఉంది. ఈ సంగతి ప్రభుత్వాలకు తెలియనది కాదు. వారు దీనిని పూర్తిగా విస్మరించారనీ అనలేం. మైనారిటీ అనే పదాన్ని ముసుగుగా తొడిగి ముస్లిం, క్రిస్టియన్ మతాలకు సంబంధించిన ప్రార్థన స్థలాల/ ఆలయాల విషయంలో వారు పరిమితంగానే జోక్యం చేసుకుంటున్నారు. హిందూ ఆలయాల విషయానికి వచ్చేసరికి, మతపరంగా వారికి ఉన్న ఈ హక్కును ప్రభుత్వాలు దారుణంగా కాలరాస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాల పాలిట శాపంగా పరిణమించిన ఒక వ్యవహారం ఉంది. అదే, జస్టిస్ చల్లా కొండయ్య కమిషన్. 1987 లో ప్రభుత్వానికి నివేదిక అందజేసిన చల్లా కొండయ్య అసంబద్ధ, హిందూ వ్యతిరేక సూచనలు చేసారు. ఇది పూర్తిగా హిందువుల హక్కులు కాలరాసిన నివేదిక. హిందువుల సహనాన్ని అలుసుగా తీసుకుని వారి గౌరవాన్ని ప్రభుత్వానికి తాకట్టు పెట్టింది.
ఈ కమిషన్ నివేదిక ప్రకారం హిందూ దేవాలయాల్లో అంతులేని అవినీతి జరుగుతోంది. 80 శాతం ఉన్న హిందూ దేవాలయాలను అదుపులోకి తీసుకుంటే మిగిలిన 20 శాతం ఉన్న ఇతర మతాల ప్రార్ధన మందిరాలు లైన్ లో పడిపోతాయనేది ఈయన సలహా! హిందూ సమాజం ఎంత వ్యతిరేకించినా, ఈ నివేదికను ప్రభుత్వాలు అమలు పరిచాయి.
రక్షకులే భక్షకులు
రాష్ర్టంలో లక్ష ఎకరాల దేవాలయ భూములు అన్యాక్రాంతమయ్యాయని సాక్షాత్తూ దేవాదాయ శాఖ కమిషనర్ ఇటీవల సెలవిచ్చారు. ఒక్క సింహాచలంలోనే 459 ఎకరాలను 1000 మంది ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్నారని ఆయన వెల్లడించారు. అనుచితంగా దేవాలయాలను చెరబట్టిన ప్రభుత్వాలు వాటిని పార్టీల ప్రయోజనాలు, పాలకవర్గ సొంత లాభాలకు వాడుకుంటున్నాయి. సర్కారు పెత్తనానికి ముందు దేవస్థానానికి ఉన్న రత్నాభరణాలకు లెక్కాపత్రం లేదు. దేవాలయ పాలక మండళ్లు- రాజకీయ నిరుద్యోగుల, పైరవీకారుల పునరావాస కేంద్రాలుగా మార్చేశారు. తిరుపతిలో ఏకంగా ఇస్లామిక్ విశ్వవిద్యాలయం మొదలైనా, వకుళమాత ఆలయం చుట్టూ విధ్వంసం జరిగినా పట్టించుకోలేదు. మాన్యాలు పరాధీనమై, కబ్జా కోరల్లో కకావికలమవుతున్నా ప్రభుత్వాలు పట్టనట్టే వ్యవహరించాయి.
ఆస్తులు పోయినా తిరిగి సంపాదించవచ్చు కానీ మన పూర్వీకులు అందించిన అపురూపమైన కట్టడాలను సైతం ప్రభుత్వాలు నాశనం చేస్తున్నాయి.
హిందూ మతాన్ని అవలంబిస్తే పన్ను
ఇటు దేవాలయాల ఆదాయంలోంచి 21.5% సొమ్మును ప్రభుత్వం బొక్కసంలో నింపుకుంటోంది. ఔరంగజేబు కాలంనాటి జిజియా పన్నుకు (మతావలంబనకు విధించే పన్ను), దీనికీ తేడా ఏమీలేదు. లేని అధికారంతో అడ్డగోలుగా దోపిడీ చేస్తన్న ప్రభుత్వాల విషకోరల్లో దేవళాలు ఎంతకాలం మగ్గాలి.
దేవాలయ నిర్వహణను హిందూ సమాజానికి ఇవ్వాలి
చర్చ్ ను క్రైస్తవ సమాజం మస్జీద్ ను ముస్లింలు సమర్ధంగా నిర్వహించుకోగలుగుతున్నప్పుడు హిందువులకు ఆ సమర్ధత లేదని ప్రభుత్వ అభిప్రాయమా? ఇది యావత్ హిందూ సమాజానికే ఎంతో అవమానకరమైన వ్యవహారం. అసంబద్ధమైన ఏర్పాటు.
దేవాలయ పరిరక్షణ లో విఫలమవుతన్న ప్రభుత్వం భాద్యతల నుంచి తప్పుకోవాలనేది హిందూ సమాజం డిమాండ్‌గా ఉండాలి. ఇది రాజ్యగా విరుద్ధమైన డిమాండ్ కాదు పూర్తి రాజ్యాంగ పరిధిలోనిదే దీని కోసం చట్టాన్ని మార్చా ల్సిన పనికూడా లేదు.
ఇదే డిమాండ్‌ను ధర్మ ప్రచారంలో చురుగ్గా ఉండే త్రిదండి రామానుజ చినజీయర్ కూడా సెలవిచ్చారు. భగవంతుడిని కాపాడుకోవడం మన పాలకుల బాధ్యత అని.. అలా బాధ్యతను సక్రమంగా నిరర్వర్తించలేనప్పుడు.. ఎంతటివారైనా, ఎవ్వరైనా సరే.. దండనీయులే అని చినజీయర్ అన్నారు. ఆయన మాట అక్షరాలా నిజం.
పాలకులు కళ్లు తెరవాలి. హిందూ సమాజాన్ని పార్టీలుగా, కులాలుగా, ఓటు బ్యాంకులుగా చూడడం మానుకోవాలి. హిందువులంతా ఒక్కటే- హిందూధర్మానికి ఎలాంటి అపచారం జరిగినా.. పార్టీ కుల వర్గ విభేదాలకు అతీతంగా సమాజం స్పందిస్తుందనే సంకేతాలు ప్రభుత్వానికి అందాలి. అలా జరిగినప్పుడు.. పాలకులు కూడా ఒళ్లు దగ్గర పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవహరిస్తారు.
.. ఎంఎల్ఎన్ మూర్తి
మూర్తి వాక్కు : రచయిత ఇతర వ్యాసాలు చదవండి
రామతీర్థం రాముడి గుడి నిర్మించాలంటే.. ప్రభుత్వం నిధులిస్తే తప్ప గతిలేదా?
Discussion about this post