తమిళనాడు రాజకీయాలకు రంగు, రుచి, వాసన అన్నీ సమకూరనున్నాయి. పురట్చి తలైవి జయలలిత నెచ్చెలి.. శశికళ జైలునుంచి వచ్చేస్తున్నారు. ఆమె శిక్షాకాలం పూర్తికావస్తోంది.. అదనపుజైలు లేకుండా.. ఆమె పది కోట్ల రూపాయల జరిమానా చెల్లించడం కూడా పూర్తి అయింది. ఏతావతా.. ఆమె జనవరిలో తమిళనాట అడుగుపెట్టేస్తారు. దీంతో అక్కడి రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయే అవకాశం ఉంది.
వచ్చే ఏడాదిలోనే అక్కడ ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటికే అన్నా డీఎంకే గ్రూపు తగాదాలతో సతమతం అవుతోంది. అదే సమయంలో.. డీఎంకే అధికారం కోసం ఆరాటపడుతోంది. కొత్త పార్టీలు క్యూ కడుతున్నాయి. శశికళ రాగానే.. రాజకీయంగా కొత్త సమీకరణలు సాధ్యం అని అంతా అనుకుంటున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కుడిభుజంగా ఉంటూ ఆమె మరణందాకా ఆమెను వీడకుండా ఉండిన వ్యక్తి శశికళ గుర్తుందా…? జయలలిత మరణం వెనుక ఆమె హస్తం కూడా ఉందనే వార్తలు కూడా వచ్చాయి. జయలలిత సాహచర్యంలో ఆమె ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టిందనే ఆరోపణలను ఎదుర్కొంది… జయలలిత మరణం తర్వాత ఆమెను ఇదే కేసుకింద అరెస్టు చేయడం జరిగింది. ఆరోపణలు ఋజువు కావడంతో అప్పట్లో న్యాయస్థానం ఆమెకు నాలుగు సంవత్సరాల కారాగార వాస శిక్షతోబాటు పదికోట్ల రూపాయల జరిమానా చెల్లించాల్సిందిగా తీర్పునిచ్చింది.
ఒకవేళ జరిమానా చెల్లించని పక్షంలో మరో ఏడాదిపాటు జైలు శిక్ష అనుభవించాల్సిందిగా అప్పటి న్యాయమూర్తి జస్టిస్ మైకేల్ జె.కున్హా తీర్పునిచ్చారు. కాగా జనవరి 27 నాటికి శశికళ శిక్ష ముగియనుంది. ఈ నేపధ్యంలో ఆమె పది కోట్ల రూపాయలను కోర్టు వారికి జరిమానాగా చెల్లించారు. మరో రెండు నెలల్లో ఆమె జైలు నుండి విడుదల కానుంది. ఒకవేళ శశికళ విడుదలైతే రానున్న తమిళనాడు ఎన్నికల్లో ఆమె నిలబడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
జయలలిత మరణం తర్వాత ఎఐఎడిఎంకే పార్టీ సమావేశం నిర్వహించగా ఆ సమావేశంలో శశికళ పార్టీ జనరల్ ప్రెసిడెంట్ గా నియమితురాలు గావడం జరిగింది. తర్వాత జరిగిన పర్యవసానాల ప్రభావంగా తమిళనాడుకు పన్నీరు శెల్వం ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడంతోపాటు ఇటు శశికళను పార్టీ ప్రెసిడెంట్ పదవి నుండి తొలగించడం జరిగింది. దీంతొ శశికళ ప్రెసిడెంట్ గా అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం అనే కొత్త పార్టీని స్థాపించింది. తర్వాత ఆమె జైలుకెళ్లడం జరిగింది. కాగా మరి కొద్ది రోజుల్లో చిన్నమ్మ విడుదల కానుంది. తమిళనాడులో ఇప్పటికీ జయలలిత హవా ఉందనే చెప్పవచ్చు. ఈ నేపధ్యంలో శశికళ రానున్న తమళనాడు ఎన్నికల్లో బరిలోకి దిగి, అమ్మ పేరుతో ఎంతటి హవా సృష్టించనుందో వేచి చూడాల్సి వుంది. మరి దీనికి అటువైపు నుండి తమిళ తంబీలు సిద్ధంగా ఉన్నారో లేదో చూసుకోవాలిమరి…!
.